కర్ణాటకలోని శివమొగ్గలో పరీక్ష రాయడానికి వెళ్ళిన ఇద్దరు బ్రాహ్మణ విద్యార్ధుల యజ్ఞోపవీతాలను అధికారులు లాగిపడేసిన సంఘటన వివాదానికి దారి తీసింది. పీయూసీ విద్యార్ధులు ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశం కోసం బుధవారం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి పరీక్షా కేంద్రానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదిచుంచనగిరి కళాశాల అధికారుల దాష్టీకంపై నిరసనలు వెల్లువెత్తాయి.
బ్రాహ్మణుల సంస్కృతిలో జందేనికి అమితమైన ప్రాధాన్యం ఉంది. అది వారి ఆధ్యాత్మిక అస్తిత్వానికి, తమ ధార్మిక విలువలూ విశ్వాసాల పట్ల నిబద్ధతకూ గుర్తింపునిచ్చే చిహ్నం. ధార్మిక, సాంస్కృతిక అభ్యాసాలను గౌరవించాలన్న అవగాహన విద్యాసంస్థల నిర్వాహకులకు లేకపోవడంపై బ్రాహ్మణ సముదాయం ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్ధుల జందేలను తొలగించడం అనేది వారి మతపరమైన సెంటిమెంట్లను గాయపరచడం మాత్రమే కాదు, తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించుకోడానికి విద్యార్ధుల హక్కులను ఉల్లంఘించడం కూడా.
బ్రాహ్మణుల ఆచార వ్యవహారాల్లో యజ్ఞోపవీతానికి పవిత్రమైన స్థానం ఉంది. అది వారి ధర్మానికి సంబంధించిన విషయం. వారి సాంస్కృతిక వారసత్వం. అలాంటి యజ్ఞోపవీతాలను బలవంతంగా లాగిపారేయడం ద్వారా ఆదిచుంచనగిరి కళాశాల నిర్వాహకులు కేవలం విద్యార్ధులను అగౌరవపరచలేదు, వారి సాంస్కృతిక వారసత్వాన్నే అవమానించారు. ఆ దుశ్చర్యను బ్రాహ్మణ వ్యతిరేక, హిందూ వ్యతిరేక చర్యగా పేర్కొంటూ అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ, శివమొగ్గలోని బ్రాహ్మణ సంఘాల సమాఖ్య తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ పరీక్ష రాసే విద్యార్ధుల వద్ద మత చిహ్నాలను తొలగించాలన్న నిర్ణయమే ఆశ్చర్యదాయకం. మతపరమైన వైవిధ్యాన్ని గౌరవించడం తెలియని తనమో లేక ఉద్దేశపూర్వకంగా అవమానించడమో జరిగింది. విద్యార్ధులకు సమైక్యత, సుహృద్భావాలను నేర్పవలసిన విద్యాసంస్థలే అలాంటి చర్యలకు పాల్పడడం కచ్చితంగా వివక్ష చూపడమే. అంతేకాదు, విద్యార్ధుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కూడా.
శివమొగ్గలోనే కాదు, అలాంటి సంఘటనే ఆ ప్రవేశ పరీక్ష రోజే బీదర్‌లో కూడా జరిగింది. అక్కడ సాయిస్ఫూర్తి ఎగ్జామ్ సెంటర్లో ఒక బ్రాహ్మణ విద్యార్ధి జందేన్ని బలవంతంగా తొలగించే సమయంలో పరీక్ష వాతావరణాన్ని చెడగొట్టారు, అంతేకాదు, ఆ విద్యార్ధికి భవిష్యత్తే లేకుండా చేస్తామంటూ బెదిరించారు కూడా. గణిత పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్ధిని ఈ అనుకోని పరిణామం మానసికంగా క్రుంగదీసింది. ఈ వివక్ష వల్ల విద్యార్ధి మానసికంగా కుంగిపోయాడు.
ఇవి కేవలం చెదురుమదురు సంఘటనలు కాదు. విద్యాసంస్థల్లో విద్యార్ధుల విశ్వాసాల్లో వైవిధ్యాన్ని గుర్తించడానికి ఒప్పుకోని పద్ధతి క్రమంగా పెరుగుతోంది. యూనిఫార్మిటీ పేరిట విద్యార్ధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, వారి మానసిక పరిస్థితిని గాయపరుస్తూ, ప్రవేశ పరీక్షలో వారు ఏకాగ్రతతో రాయలేకుండా చేస్తూ హిందూ సమాజాన్ని లక్ష్యం చేసుకున్న విధానం చాలా ప్రమాదకరమైనది.
ఇంకా విచిత్రం ఏంటంటే, విద్యార్ధుల ఒంటిపై మతచిహ్నాలు ఉండకూడదన్న నియమం అదే ప్రవేశపరీక్షలో మొదట లేదు, తర్వాత అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది. ఆ కొద్ది గంటల్లో ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది. అంతకు ముందు పరీక్షకు జందెంతో ఉన్నప్పటికీ విద్యార్ధులను అనుమతించారు. కానీ కఠినమైన పరీక్ష ముందు మాత్రం యజ్ఞోపవీతాన్ని అనుమతించే ప్రసక్తే లేదంటూ వారి జందేలను తీయించేసారు. దాన్నిబట్టే పరీక్ష అధికారుల అయోమయ అవస్థ, వారి సందర్భశుద్ధి లేనితనమూ బైటపడ్డాయి.
ఆ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ, ఇతర హిందూ సంస్థలూ జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేసారు. మత పరమైన ఆచారాలకే కాక మానవ హక్కుల పట్ల కూడా కనీస అవగాహన, గౌరవం లేనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.