వ్యాసుడు రచించిన మహాభారతంలోని శ్రీమత్ భగవద్గీతకు, భరతముని రచించిన నాట్య శాస్త్రానికీ ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించింది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఆ రెండు గ్రంథాలనూ పొందుపరిచారు.
భగవద్గీతకూ, భరతముని నాట్యశాస్త్రానికీ అంతర్జాతీయ గౌరవం దక్కిన విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. ‘‘భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన జీవన విధానానికీ, మన దేశంపై ప్రపంచం దృక్పథానికీ పునాదులు. యునెస్కో రిజిస్టర్లో మన దేశం నుంచి ఇప్పటివరకూ 14 ఉత్కృష్ట సృజనలకు చోటు దక్కింది. కాలాతీతమైన ఆ రచనలు కేవలం సాహిత్య సంపద కాదు, భారతదేశపు జీవన విధానాన్ని ప్రపంచానికి తెలియజేసే తాత్విక భూమికలు’’ అని గజేంద్రసింగ్ షెకావత్ ఎక్స్ మాధ్యమంలో వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భం దేశానికి గర్వకారణమన్నారు. సుసంపన్నమైన భారతీయ సంస్కృతికీ, అనంతకాలం నుంచీ సాగుతున్న భారతీయ జ్ఞానధారకూ ప్రపంచం ఇచ్చిన గుర్తింపు అని వ్యాఖ్యానించారు.