కత్తితో ఫైలెట్‌ను బెదిరించి ఓ విమానాన్ని హైజాక్ చేయాలని ప్రయత్నించిన దుండగుడి ఆట కట్టించాడు మరో ప్రయాణీకుడు. అమెరికాలోని బెలీజ్‌లో ఓ విమానాన్ని హైజాక్ చేయాలని దుండగుడు ప్రయాణీకులు, ఫైలెట్పై కత్తిదూశాడు. ఇది గమనించిన ఓ ప్రయాణీకుడు తుపాకీతో దుండగుడిపై కాల్పులు జరిపాడు. దుండగుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ట్రాఫిక్ ఎయిర్‌కు చెందిన ఓ విమానం అమెరికాలోని కొరొజాల్ నుంచి శాన్ ఫెడ్రోకు బయలు దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కత్తి తీశాడు. అందరినీ బెదిరిస్తూ విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేశాడు.విమానాన్ని దేశం వెలుపలికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశాడు. కొందరు ప్రయాణీకులను కత్తితో పొడిచాడు.
దుండగుడు వీరంగం వేసిన సమయంలో విమానంలో 14 మంది ప్రయాణీకులున్నారు. వారంతా తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. విమానంలోని ప్రయాణీకుడు దుండగుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో దుండగుడు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
విమానం హైజాక్ యత్నం చేసిన దుండగుడు అకిన్యేలా సావా టేలర్‌గా గుర్తించారు. కత్తిని విమానంలోకి ఎలా తీసుకువచ్చాడనే దానిపై విచారణ జరుపుతున్నారు. దుండగుడి అరాచకంతో విమానం రెండు గంటలుపైగా చక్కర్లు కొట్టింది. చివరకు సురక్షితంగా దిగింది.