బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి, చిన్నారులను చిదిమేసింది. ఇద్దరు పసిపిల్లలను నరికి చంపి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల సమీపంలోని గాజులరామారంలో నివాసం ఉంటున్న తేజస్విని ఇద్దరు చిన్నారులను విచక్షణా రహితంగా నరికి చంపి, ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నగరం ఉలిక్కి పడేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన గండ్ర వెంకటేశ్వర్‌రెడ్డి, తేజస్విని దంపతులు గాజులరామారం బాలాజీ లే అవుట్లో ఉంటున్నారు. వీరికి హర్షిత్‌రెడ్డి, ఆశిష్‌రెడ్డి ఇద్దరు కుమారులు. ఇద్దరూ ప్రైవేటు స్కూల్లో చదువుకుంటున్నారు. గురువారం ఆఖరి వర్కింగ్ డే కావడంతో వారు త్వరగా ఇంటికి వచ్చారు. వచ్చే ఏడాదిది అవసమైన కొత్త పుస్తకాలు కూడా సమకూర్చుకున్నారు. ఇంతలోనే ఆ తల్లి చిన్నారులపై కొడవలితో విరుచుకుపడింది. పిల్లలను నరికి, ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు వారు గమనించి చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
తేజస్విని ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారులు తీవ్ర శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారికి ప్రతి మూడు గంటలకు ఒకసారి ముక్కులో చుక్కల మందు వేయాల్సి ఉందని గుర్తించారు. తేజస్వినికి కంటి చూపు సరిగా లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందినట్లు పోలీసులు తెలిపారు.