వక్ఫ్ చట్టానికి సంబంధించి తమ స్పందన తెలియజేయడానికి అదనపు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఏడు రోజుల్లోగా ప్రాథమికమైన జవాబు ఇస్తామనీ, సంబంధిత పత్రాలు కూడా సమర్పిస్తామనీ సుప్రీంకోర్టుకు చెప్పారు.
తదుపరి విచారణ జరిగేలోగా వక్ఫ్ బోర్డు లేదా కౌన్సిల్‌కు ఎలాంటి నియామకాలూ జరపబోమని సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. మరోవైపు, వచ్చే విచారణలోగా వక్ఫ్ ఆస్తులను గుర్తించకూడదంటూ సుప్రీంకోర్టు సూచించింది.
వక్ఫ్ చట్టం కోసం కేంద్రప్రభుత్వం దేశ ప్రజల అభిప్రాయాలు కోరిందని సొలిసిటర్ జనరల్ గుర్తు చేసారు. ఏదైనా భూమి లేదా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే విషయమై పెద్ద సంఖ్యలో విజ్ఞాపనలు వచ్చాయని వెల్లడించారు. చర్చోపచర్చలు, భిన్నాభిప్రాయాల సమన్వయం తర్వాత రూపొందించిన చట్టాన్ని అమలు చేయకుండా మొత్తం చట్టంపై స్టే విధించడం తీవ్రమైన చర్య అవుతుందన్నారు. కోర్టుకు జవాబిచ్చేందుకు వారం సమయం కోరారు.
వక్ఫ్ సవరణ చట్టంలో పలు అంశాలు సానుకూలంగా ఉన్నాయని తాము ఇప్పటికే గమనించామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ దశలో చట్టం అమలును పూర్తిగా నిలువరిస్తూ స్టే ఇవ్వడం లేదని మరోసారి స్పష్టం చేసింది. చట్టం వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉన్నందున ప్రస్తుత పరిస్థితిని మార్చాలని అనుకోవడం లేదని వివరించింది. ఈ వ్యవహారంపై న్యాయ సమీక్ష జరిగే వరకూ ప్రస్తుత స్థితిలో ఎలాంటి మార్పులూ లేకుండా కొనసాగించడమే తమ లక్ష్యమని వెల్లడించింది.
అంతకుముందు, ఏప్రిల్ 16న విచారణ రెండు గంటల పాటు కొనసాగింది. ఆ సమయంలో, చట్టంలోని కొన్ని కీలకమైన అంశాల మీద స్టే విధించే అవకాశం ఉన్నట్టు సుప్రీంకోర్టు సంకేతాలిచ్చింది. కేంద్రీయ వక్ఫ్ కౌన్సిల్లోనూ, వక్ఫ్ బోర్డుల్లోనూ ముస్లిమేతరులను చేర్చడం, వక్ఫ్ ఆస్తుల విషయంలో గొడవలను తేల్చేందుకు కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం, వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయడం వంటి ప్రొవిజన్లను ప్రస్తుతానికి నిలువరించే ఉద్దేశం ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చింది.
సుప్రీంకోర్టు తమ ఆదేశాలను జారీ చేయడానికి సిద్ధమైంది. కానీ అంతకంటె ముందు తమ వాదనను వినాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఇంకా వక్ఫ్ చట్టాన్ని సమర్ధిస్తున్న పార్టీల న్యాయవాదులూ సుప్రీంకోర్టును కోరారు.
ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఆ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ భూములను డీనోటిఫై చేసే ప్రక్రియ ప్రారంభించడం, కలెక్టర్లు వక్ఫ్ ప్రొసీడింగ్స్‌లో కొనసాగడం, వక్ఫ్ బోర్డుల సభ్యులుగా ఎక్స్ అఫీషియో సభ్యులను మినహాయిస్తే మిగతా సభ్యులుగా కేవలం ముస్లిములను మాత్రమే నియమించడం వంటి అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని కోర్టు ప్రకటించింది. ‘ప్రభుత్వం చరిత్రను తిరగరాయలేదు’ అని సీజేఐ గమనించారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ సుదీర్ఘ చర్చ జరిగింది. రెండు సభల్లోనూ ఓటింగ్ జరిగింది. రెండు సభల్లోనూ బిల్లుకు ఆమోదం లభించింది. దానికి రాష్ట్రపతి ఏప్రిల్ 5న ఆమోద ముద్ర వేసారు. దాంతో వక్ఫ్ బిల్లు చట్టంగా మారింది.
ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, ఆప్ ఎంఎల్ఎ అమానతుల్లా ఖాన్, మణిపూర్‌కు చెందిన ఎన్‌పిపి ఎంఎల్ఎ షేక్ నూరుల్ హసన్. ఆజాద్ సమాజ్ పార్టీ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన యూపీలోని సంభాల్ నియోజకవర్గ ఎంపీ జియావుర్ రెహమాన్ బరఖ్, జమియాత్ ఉలేమా ఎ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ, సమస్త కేరళ జమియాతుల్ ఉలేమా, సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, తదితరులు వక్ఫ్ సవరణల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసారు.
ఆల్ ఇండియా ముస్లిం పెర్సనల్ లా బోర్డ్ (ఎఐఎంపిఎల్‌బి) కూడా ఈ చట్టాన్ని సవాల్ చేసింది. పార్లమెంటు ఆమోదం పొందిన సవరణలకు తాము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని పీఎల్బీ స్పష్టం చేసింది. ఆ చట్టం వివక్షాపూరితమైనది, ప్రజల మధ్య విభజన తెస్తుంది అని పీఎల్బీ ఆరోపించింది.
ముస్లిం మత ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వ జోక్యానికి వీలు కల్పిస్తోందంటూ ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆర్జేడీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మనోజ్ ఝా, ఫయ్యాజ్ అహ్మద్ సవాల్ చేసారు. ఆర్జేడీ ఎంఎల్ఏ మహమ్మద్ ఇఝార్, అస్ఫీ కూడా ఆ చట్టాన్ని వ్యతిరేకించారు.
తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) తరఫున ఎంపీ ఏ రాజా కూడా కోర్టుకెక్కారు. నిజానికి ఆయన వక్ఫ్ బిల్లు మీద విధించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సభ్యుడుగా కూడా ఉన్నారు. అలాగే సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధులు, తమిళగ వెట్టి కళగం అధ్యక్షుడు, నటుడు అయిన విజయ్ తదితరులు కూడా వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు వక్ఫ్ చట్టాన్ని సమర్ధిస్తూ రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి, ఇంప్లీడ్మెంట్ అప్లికేషన్లు దాఖలు చేసాయి.
రాష్ట్రాల ప్రభుత్వాలే కాదు, అడ్వొకేట్ మహేంద్ర ప్రతాప్ సింగ్, ఆదివాసీ సేవా మండల్, మధ్యప్రదేశ్‌లో గిరిజనుల హక్కుల రక్షణ కోసం పనిచేస్తున్న సంస్థ భిలాలా సమాజ్ ప్రతినిధి జై ఓంకార్, అఖిల భారత హిందూ మహాసభ సభ్యుడు సతీష్ కుమార్ అగర్వాల్, హిందూ సేన అనే స్వచ్ఛంద సంస్థ జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా తదితరులు వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు వ్యతిరేకంగా దరఖాస్తు చేసారు.