తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. ఎస్వీ గోశాలలో వందల సంఖ్యలో ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నాయకులు సవాళ్లు విసిరారు. గోశాల పరిశీలించడానికి రావాలంటూ ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులతోపాటు, టీటీడీ సభ్యుడు బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. గోశాల వద్దకు వెళ్లి భూమన కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. అసత్య ఆరోపణలు చేయడం కాదు, గోశాలకు వచ్చి పరిశీలించాలంటూ కోరారు.
గోశాల పరిశీలనకు వస్తున్నట్లు భూమన ప్రకటించడంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. గుంపులుగా రావడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి గోశాలను పరిశీలించారు. భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలతో బయలు దేరడంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఎస్వీ గోశాలపై వైసీపీ నేతలు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో తిరుమలలో భారీ అక్రమాలు జరిగాయన్నారు. ఎస్వీ గోశాలలో కూటమి ప్రతినిధులు పర్యటించారు.