అమరావతి రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తికి అడ్డంకులు తొలగిపోతున్నాయి. అమరావతి రాజధానికి, జాతీయ రహదారితో కలిపే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చేందుకు రైతులు సుముఖత తెలిపారు. ఉండవల్లి మంతెన ఆశ్రమం సమీపం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 4 కి.మీ ఆరు లైన్ల రోడ్డు పూర్తికి 69 ఎకరాలు సేకరిస్తున్నారు. ఇంకా 20 ఎకరాలు సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
రెండో దశలో ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గమ్మ వారధి, మణిపాల్ ఆసుపత్రి వరకు 3 కి.మీ మేర సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. అమరావతి రాజధాని దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 18 కి.మీ ఎనిమిది లైన్ల రహదారిని మొదటి ప్యాకేజీగా, ప్రకాశం బ్యారేజీ నుంచి వారధి వరకు మరో
ప్యాకేజీగా చేపట్టారు. మొదటి ప్యాకేజీ 2018లోనే పూర్తి చేశారు.
తాజాగా మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 7 కి.మీ రహదారి పూర్తి చేయాల్సి ఉంది. ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాల రైతుల వద్ద నుంచి భూసమీకరణకు ప్రభుత్వం చురుగ్గా పనులు చేస్తోంది. రైతులు కూడా భూ సమీకరణకు సిద్దం అయ్యారు. రైతులకు పరిహారంగా ఇచ్చే లే అవుట్లు సిద్దం చేయాల్సి ఉంది. భూసమీకరణకు మరో 3 నెలలు సమయం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. భూమిని కోల్పోయిన రైతులకు మందడం, వెలగపూడిలో పరిహారంగా భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకు రైతులు అంగీకరించారు.