ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు ఉపయెన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. మే 9న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
వైఎస్ఆర్సీపీలో నెంబర్ టూగా వెలుగొందిన విజయసాయిరెడ్డి ఈ యేడాది జనవరి 25న తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతున్నానంటూ ప్రకటించారు. ఆయన రాజీనామాతో రాజ్యసభలో ఒక ఎంపీ సీటు ఖాళీ అయింది. దానికి ఎన్నిక జరగవలసి ఉంది. ఆ స్థానానికే ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం… నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఏప్రిల్ 29 వరకూ ఉంది. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు మే 2 వరకూ గడువు ఇచ్చారు. మే 9న ఎన్నిక జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తరువాత ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.