హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం మీద ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరున్న భూముల్లో చెట్లు కొట్టేసేముందు 1996 సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అనుమతులు తీసుకున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం తరఫున వాదించిన అభిషేక్ మను సింఘ్వీ… అన్ని అనుమతులతోనే జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించారని కోర్టుకు చెప్పారు. అయితే దానిపై న్యాయమూర్తి సందేహాలు వ్యక్తం చేసారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు నరికారని తేలితే రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులు అందరూ జైలుకు వెళ్ళవలసి వస్తుందని న్యాయమూర్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా ఊరుకునే ప్రసక్తే లేదని జడ్జి హెచ్చరించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఈ వ్యవహారంపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది.