తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. వంటగదిలోని నీటిలో పురుగుల మందు కలిపారు. ఆ దారుణానికి ఒడిగట్టిన నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కేసు వివరాలను తెలియజేసారు.
ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ నెల 13వ తేదీ ఆదివారం, 14వ తేదీ అంబేద్కర్ జయంతి వరుస సెలవుల కారణంగా బడిని రెండు రోజులు మూసివేసారు. 15వ తేదీ ఉపాధ్యాయురాలు, ఇతర సిబ్బంది బడికి వచ్చేసరికి వంటగది తాళం పగలగొట్టి ఉంది. ఆ గదిలో ఒక బకెట్లో నీరు తెల్లగా ఉండడాన్ని అధ్యాపకురాలు గమనించారు. అక్కడి పాత్రలను చూసి అనుమానం రావడంతో టీచర్ ప్రతిభ గ్రామ సర్పంచి, ఇతర పెద్దలకు సమాచారం అందించారు. వారు బడికి వచ్చి ఆ నీటిని పరిశీలించి, అందులో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. ఉపాధ్యాయురాలు ప్రతిభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ భీమేష్ దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులకు ధర్మపురి గ్రామానికి చెందిన సొయం కిష్టు అనే వ్యక్తిపై అనుమానం కలిగింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ వ్యక్తి తానే పాఠశాలలో నీటిలో పురుగుల మందు కలిపానని ఒప్పుకున్నాడు. నిర్మల్లో తన సోదరుడి ఇంటి నుంచి పురుగుల మందు తీసుకొచ్చాననీ, పాఠశాల వంటగది తాళం పగలగొట్టాననీ, గదిలో ఉన్న నీటిలో ఆ పురుగుల మందు కలిపాననీ వివరించాడు.
నిందితుడు కొంతకాలంగా కుటుంబ కలహాల వల్ల మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఇంట్లో వారి మీద కోపంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సొయం కిష్టును అరెస్టు చేసి, కేసు నమోదు చేసామని ఎస్పీ వెల్లడించారు. ఆ సంఘటనలో ఉపాధ్యాయులు జాగ్రత్త పడడం వల్ల పిల్లలెవరికీ ప్రమాదం కలగలేదని ఎస్పీ వివరించారు.