చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల మీద వేసే పరస్పర సుంకాలను 245శాతానికి పెంచినట్లు అమెరికా వెల్లడించింది. ఆ చర్యతో అమెరికా చైనా దేశాల మధ్య ఘర్షణ మరింత ముదిరింది.
కొద్దిరోజుల క్రితం అమెరికా చైనా మీద 145శాతం పరస్పర సుంకాలు విధించింది. అప్పుడే భారత్ సహా పలు దేశాల మీద కూడా పరస్పర సుంకాలు విధించింది. అయితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం పలు దేశాలు చర్చలు ప్రారంభించాయి. ఆ నేపథ్యంలో పరస్పర సుంకాలను 90 రోజుల పాటు ఆపాలని అమెరికా నిర్ణయించుకుంది. ఆ మేరకు వైట్‌హౌస్ నుంచి ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసారు. దాని ప్రకారం… 75కు పైగా దేశాలు వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలకు సిద్ధమయ్యాయి. ఆ చర్చల ప్రక్రియ మొదలవుతున్నందున, ఆయా దేశాల మీద విధించిన పరస్పర సుంకాలను ప్రస్తుతానికి నిలువరించాము. ఒక్క చైనా మినహా అన్ని దేశాలకూ 90 రోజుల పాటు పరస్పర సుంకాలను నిలిపివేసాము అని వైట్‌హౌస్ ప్రకటన తెలియజేసింది.
ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాతో వాణిజ్యం చేసే దేశాలు అన్నింటి మీదా పది శాతం పరస్పర సుంకం విధించారు. అమెరికా ఎగుమతి చేసే వస్తువులకు ఎక్కువ సుంకాలు వసూలు చేస్తున్న దేశాలు, అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులకు మాత్రం తక్కువ సుంకాలు కడుతున్నాయని… దానివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందనీ ట్రంప్ మొదటినుంచీ వాదిస్తున్నారు. తను అధికారంలోకి వస్తే ఆ పరిస్థితిని మారుస్తానంటూ ఎన్నికల ప్రచారం సమయంలోనే ప్రకటించారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రణాళికను అమలు చేయడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా తమతో వాణిజ్యం చేసే ప్రతీ దేశం మీదా పరస్పర సుంకాలు విధించారు. ఆ పరిస్థితిని గమనించిన ప్రపంచ దేశాలు అమెరికాతో చర్చలు మొదలుపెట్టాయి. దాంతో పరస్పర సుంకాలను ట్రంప్ ప్రభుత్వం మూడు నెలల పాటు వాయిదా వేసింది. చర్చలు జరిగి ఓ నిర్ణయానికి వచ్చేటంత వరకూ 10శాతం అదనపు సుంకాన్ని విధించారు.
నిజానికి ఈ పదిశాతం కూడా కొత్తగా వచ్చినదేమీ కాదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తమ దేశానికి ఎగుమతులు చేసుకునే ప్రతీ దేశం మీదా కనీసం పది శాతం సుంకం విధించారు. అమెరికాతో వాణిజ్య లోటు ఎక్కువగా ఉన్న దేశాలకు ఆ లోటును బట్టి సుంకం స్థాయిని పెంచారు. ఇప్పుడు ఆ పది శాతం బేస్‌లైన్ టారిఫ్‌ను తాత్కాలికంగా మూడు నెలల పాటు అమలు చేయనున్నారు.