వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షీదాబాద్‌లో జరిగిన హింసాకాండలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం చెల్లిస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. ఆ సంఘటన మీద నివేదిక సమర్పించాలంటూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తానని ఆమె చెప్పారు.
ముర్షీదాబాద్‌లో ముస్లిములు పాల్పడిన హింసాకాండలో ముగ్గురు హిందువులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్ళు, దుకాణాలూ ధ్వంసమైపోయాయి. పోలీసులు చేతులు కట్టేసుకుని కూర్చోడంతో హిందువుల జీవితాలు ఛిన్నాభిన్నమైపోయాయి. ఆ సంఘటనకు సంబంధించి మమతా బెనర్జీ ఇప్పుడు కంటితుడుపు చర్యలు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు పరిహారం చెల్లిస్తామని మమతా బెనర్జీ చెప్పారు. ఇళ్ళు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఇల్లు కేటాయిస్తామన్నారు. దుకాణాలు ధ్వంసమైన వారికి తగిన పరిహారం చెల్లిస్తామన్నారు. ఇవాళ కోల్‌కతా నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మాట్లాడారు.
ఏప్రిల్ 11 శుక్రవారం మసీదులో నమాజు పూర్తయిన వెంటనే ముర్షీదాబాద్‌లో ముస్లిములు రోడ్ల మీదకు వచ్చారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడ్డారు. హిందువులపై ఏకపక్షంగా దాడులు చేసారు. వారి ఇళ్ళను, దుకాణాలనూ ధ్వంసం చేసారు. మంటలు ఆర్పడానికి నీళ్ళు దొరక్కుండా చేయడం కోసం బోరింగ్ పంపులను సైతం ధ్వంసం చేసారంటే ఎంత ప్రణాళికాబద్ధంగా దాడులు చేసారో అర్ధమవుతుంది.
ముర్షీదాబాద్ హింసాకాండకు సంబంధించి ఇప్పటివరకూ 150 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు వెల్లడించారు. ముర్షీదాబాద్ జిల్లాలోని షంషేర్‌గంజ్, ధూలియా, తదితర ప్రభావిత ప్రాంతాల్లో తగినంత మంది పోలీసు బలగాలను మోహరించామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అక్కడ పరిస్థితి అదుపులో ఉందని వివరించారు.
ఇంత జరిగినా, దానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఇప్పుడు చేయవలసిన అవసరమేముందని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు తెలిసి కూడా ఎందుకు కేంద్రం తొందర పడిందని నిలదీసారు. ఆ చట్టం వల్ల మంచి జరిగితే సంతోషిస్తాను అంటూనే, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే అజెండాగా కేంద్రం పాలిస్తోందని ఆరోపించారు. ‘‘ముర్షీదాబాద్ అల్లర్ల వెనుక బంగ్లాదేశ్ హస్తం ఉందంటూ కేంద్ర హోంశాఖ వర్గాలు అనుమానిస్తున్నాయని తెలిసింది. అదే నిజమైతే ఆ అల్లర్లకు కేంద్రమే బాధ్యత వహించాలి, ఎందుకంటే సరిహద్దుల దగ్గర కాపలా ఉన్నది మా పోలీసులు కాదు, బీఎస్ఎఫ్ జవాన్లే కదా’’ అంటూ కుతర్కాలు లాగారు.