ఛత్తీస్గఢ్లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతమయ్యారు. మంగళవారం సాయంత్రం కొండగావ్-నారాయణపూర్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలంలో రెండు మృతదేహాలతో పాటు ఒక ఏకే47 తుపాకీ కూడా లభించింది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. మృతుల్లో ఒకరు మావోయిస్టు అగ్రనేత అయిన కమాండర్ హల్దార్. మరొకరు ఏరియా కమిటీ సభ్యుడు రామి అని గుర్తించారు. హల్దార్ తలపై 8లక్షలు, రామి తలపై 5లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఏప్రిల్ 12న ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లాలోని కోల్నార్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు మావోయిస్టులను మట్టుపెట్టాయి. ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికల గురించి సమాచారం అందడంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఆ ఎన్కౌంటర్ జరిగిన మూడు రోజులకే ఈ ఎన్కౌంటర్లో కమాండర్ స్థాయి మావోయిస్టును మట్టుపెట్టడం విశేషం.
ఈ ఎన్కౌంటర్తో కలుపుకుని ఈ యేడాది ఇప్పటివరకూ 140 మంది మావోయిస్టులను మట్టుపెట్టారు. వారిలో 123 మందిని ఒక్క బస్తర్ డివిజన్లోనే తుదముట్టించారు.