హర్యానాలో భూముల కుంభకోణానికి సంబంధించి ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసు విచారణకు రాబర్ట్ వాద్రా ఇవాళ రెండో రోజు కూడా హాజరయ్యారు. ఇవాళ రాబర్ట్ వాద్రాతో పాటు ఆయన భార్య, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా వాద్రా కూడా ఈడీ కార్యాలయానికి వెళ్ళారు.
రాబర్ట్ వాద్రాను మంగళవారం మొదటి రోజు ఐదు గంటల పాటు విచారణ జరిపారు. ఆయన వాంగ్మూలం నమోదు చేసారు. బుధవారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు. ఆ మేరకు రాబర్ట్ వాద్రా ఇవాళ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్ళారు. ఈడీ విచారణను రాబర్ట్ వాద్రా తనపై జరుగుతున్న దాడిగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తప్పిదాలను బైటపెడుతున్నందునే తప్పుడు ఆరోపణలతో విచారణ జరిపిస్తున్నారంటూ ఆరోపించారు.
రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీ 2008లో గుర్గావ్లో మూడున్నర ఎకరాల భూమిని ఏడున్నర కోట్లకు కొనుగోలు చేసింది. అదే భూమిని రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్కు 58 కోట్లకు విక్రయించింది. ఆ క్రమంలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.