నేషనల్ హెరాల్డ్ పత్రిక చరిత్ర ఏంటి?
జాతీయ స్వతంత్ర సంగ్రామం సమయంలో తమకంటూ ఒక పత్రిక ఉండాలని జవాహర్‌లాల్ నెహ్రూ వంటి కాంగ్రెస్ నాయకులు భావించారు. 5వేల మంది వాటాదారులతో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే ప్రచురణ సంస్థను ప్రారంభించారు. ఆ కంపెనీలో రూ.10 ముఖవిలువ కలిగిన 90లక్షల షేర్లు ఉన్నాయి. ఆ సంస్థ ద్వారా నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించసాగారు. ఆ పత్రిక కార్యాలయాల కోసం ప్రభుత్వం దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా చోట్ల విలువైన స్థలాలను నామమాత్రపు ధరకు కేటాయించింది.
కాలక్రమంలో ఆ పత్రిక ప్రాభవం తగ్గిపోయింది. సర్క్యులేషన్ లేక మూతపడిపోయింది. కానీ అప్పులు మాత్రం ఉన్నాయి. 2008 నాటికి ఏజేఎల్ సంస్థకు రూ.90 కోట్ల కంటె ఎక్కువ అప్పులు ఉన్నాయి. వాటిని తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ, ఏజేఎల్ సంస్థకు రూ.90కోట్లు వడ్డీ లేని అప్పు ఇచ్చింది.
నిజానికి నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఉన్న ఆస్తులు వేల కోట్ల విలువ కలిగినవి. వాటిలో ఏ కొన్నిటిని విక్రయించినా రూ.90 కోట్ల అప్పును తీర్చేయడం సులువే. కానీ ఆ పత్రికకున్న వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులపై గాంధీ కుటుంబం కన్ను పడింది. అందుకే కథ మారిపోయింది.
జరిగిన కుంభకోణం ఏమిటి?
2010లో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని రూ.5లక్షల మూలధనంతో ఏర్పాటు చేసారు. అందులో 38శాతం వాటా సోనియా గాంధీది. మరో 38శాతం వాటా రాహుల్ గాంధీది. మిగతా 22శాతం వాటా ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ వోరాల పేరు మీద ఉంది.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కంపెనీ తమ 90లక్షల షేర్లనూ, రూ.90కోట్ల అప్పునూ ఒక బోర్డ్ మీటింగ్ ద్వారా యంగ్ ఇండియన్ కంపెనీకి బదలాయించేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే తమ వాటాదారులకు మాటమాత్రమైనా చెప్పకుండా షేర్లను బదిలీ చేసేసింది.
అంటే నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఉన్న రూ.9కోట్ల మూలధనం, కాంగ్రెస్ పార్టీ నుంచి వడ్డీ లేకుండా తీసుకున్న రూ.90కోట్ల అప్పు, ఇంకా నేషనల్ హెరాల్డ్ పత్రికకు దేశంలోని వివిధ నగరాల్లో ప్రధాన కూడళ్ళలో ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్నీ యంగ్ ఇండియన్ కంపెనీ చేతికి చిక్కాయి. పేరు యంగ్ ఇండియన్‌దే కానీ, దాని నిజమైన యజమానులు సోనియా, రాహుల్ మాత్రమే. మిగతా వారందరూ నామమాత్రపు వాటాదారులే.
ఇప్పుడు యంగ్ ఇండియన్ కంపెనీ, కాంగ్రెస్‌కు రూ.90 కోట్ల అప్పు బాకీ ఉంది. కానీ ఆ కంపెనీ దగ్గర మూలధనం తప్ప మరే నిధులూ లేవు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ, యంగ్ ఇండియన్ కంపెనీకి ఒక ప్రతిపాదన పెట్టింది. మీరు రూ.50లక్షలు చెల్లించండి, మిగతా ఋణాన్ని రైటాఫ్ చేస్తాము అని ప్రతిపాదించింది.
ఆ అరకోటి అప్పు తీర్చడానికి కూడా యంగ్ ఇండియన్ దగ్గర నిధులు లేవు. అందువల్ల ఆ సంస్థ కోల్‌కతాలోని ఒక షెల్ కంపెనీ నుంచి రూ.కోటి అప్పుగా ఇచ్చింది. నిజానికి షెల్ కంపెనీల లావాదేవీలు పూర్తి అనుమానాస్పదం. సాధారణంగా వారు వ్యాపారుల దగ్గర నల్లధనం తీసుకుని, దాన్నే అప్పుగా వెనక్కి ఇచ్చి వారికి సాయం చేస్తారు. దాని కోసం ఒకటి లేదా రెండు శాతం కమిషన్ తీసుకుంటారు. అలా, డబ్బు చేతులు మారకుండానే లావాదేవీ జరిగినట్లు చూపిస్తారు. ఇక్కడ యంగ్ ఇండియన్ కంపెనీ కోసం డబ్బులు ఎవరిచ్చారో తెలియదు.
చివరికి ఏం జరిగింది?
యంగ్ ఇండియన్ కంపెనీలో మేజర్ షేర్‌హోల్డర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. మరికొందరి పేరిట ఇంకొన్ని వాటాలు ఉన్నప్పటికీ గాంధీ కుటుంబం ముందు నోరెత్తే ధైర్యం ఎవరికీ లేదు. కాబట్టి ఇన్నాళ్ళూ నేషనల్ హెరాల్డ్ పేరిట ఉన్న ఆస్తులన్నీ సోనియా, రాహుల్ సొంతం అయిపోయాయి. కేవలం రూ.5లక్షల పెట్టుబడితో వేల కోట్ల ఆస్తులు తల్లీ కొడుకుల సొంతం అయిపోయాయి.
ఈ కథలో మరికొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్‌కు అన్ని ఆస్తులు ఉండి కూడా అప్పులు తీర్చలేక పోవడం ఏమిటి అన్న అనుమానాలు కలుగుతాయి కదా. ఆ పత్రికకు ఢిల్లీలో ఉన్న భవనంలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు అద్దెకు నడుస్తున్నాయి. ఆ భవనంలో ఒక అంతస్తు అద్దెగానే నెలకు రూ.85 లక్షలు వస్తున్నాయి. ఆ లెక్కన మొత్తం భవనం నుంచి నెలకు వచ్చే అద్దెలు ఎంత? ముంబై, లఖ్‌నవూ, భోపాల్ వంటి నగరాల్లో ఉండే మిగతా భవనాల నుంచి వసూలు అవుతున్న అద్దెలు ఎంత? అద్దెల రూపంలో అంతంత ఆదాయం వస్తుంటే రూ.90 కోట్లు చెల్లించలేని పరిస్థితి నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణకర్త అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు ఎందుకు వచ్చింది?
సరే, నేషనల్ హెరాల్డ్ పత్రిక పని చేయడం లేదు. ఏజేఎల్ సంస్థ అప్పుల్లో ఉంది. బాగానే ఉంది. కానీ ఆ అప్పును చెల్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఉదారంగా ఎందుకు ముందుకు వచ్చింది? వడ్డీ లేకుండా రూ.90 కోట్లు ఎందుకు ఋణం ఇచ్చింది? అసలు రాజకీయ పార్టీలు వ్యక్తులు లేదా సంస్థలకు ఋణాలు ఇవ్వడం నిషిద్ధం అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ పని ఎలా చేయగలిగింది?
మరో విచిత్రం ఏంటంటే… కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ లేదా ఏజేఎల్‌కు రూ.90 కోట్లు అప్పు ఇచ్చినట్లు తమ ఖాతా పుస్తకాల్లో ఎక్కడా చూపించలేదు. మరి, ఆ 90 కోట్లకూ లెక్క ఎలా చూపించారు? అక్కడ జరిగిన గోల్‌మాల్ ఏమిటి?
ఒక్క నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలోనే కాంగ్రెస్ పార్టీ ఇంత ఆర్థిక అక్రమాలకు పాల్పడిందంటే, ఇంకా ఇలాంటి విషయాల్లో ఇలాంటి వ్యవహారాలు ఎన్ని ఉన్నాయో? వాటి కథలు ఎప్పుడు వెలుగు చూస్తాయో? అసలు అవి విచారణ దశకు వస్తాయా రావా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడీ చార్జిషీటు మీద మండిపడుతున్నారు. ఆర్థిక అక్రమాల విచారణ ప్రక్రియను రాజకీయ ప్రతీకార చర్యగా వ్యాఖ్యానిస్తూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.