మంగళవారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, శామ్ పిట్రోడా, సుమన్ దూబే తదితరుల మీద ఛార్జిషీటు దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఆస్తులను అక్రమంగా బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలతో వారిపై అభియోగ పత్రం నమోదయింది. న్యాయస్థానం ఆ కేసును ఏప్రిల్ 25న విచారించనుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేరు మీద ఛార్జిషీటు దాఖలు అవడం ఇదే మొదటి సారి. అందుకే ఈడీ ఛార్జిషీటు దాఖలు చేయడాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.
అసలీ నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి? ఈ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకింత భయపడుతున్నారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏమైనా చట్టానికి అతీతులా? వాళ్ళమీద ఈడీ చార్జిషీటు దాఖలు చేస్తే ప్రతీకార చర్య ఎలా అవుతుంది? అసలు ఈ కేసు ఎప్పటిది? పూర్తి వివరాలు పరిశీలిద్దాం.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి 2012 నవంబర్ 1న ఢిల్లీ కోర్టులో కేసు వేయడంతో ఈ కథ మొదలైంది. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక ప్రచురణకర్త అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థను కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తప్పుడు విధానాలతో చేజిక్కించుకున్నారన్నది సుబ్రమణ్యస్వామి చేసిన ప్రధాన ఆరోపణ. ఆ అవసరం కోసం వారు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ కంపెనీని కొత్తగా ఏర్పాటు చేసారు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ యంగ్ ఇండియన్ కంపెనీలో మెట్టువాటా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరిదే.
సుబ్రమణ్య స్వామి ఫిర్యాదు ప్రకారం… అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ హస్తగతం చేసుకోడానికి ఆ సంస్థకు కాంగ్రెస్ పార్టీ రూ.90.25 కోట్ల వడ్డీలేని ఋణం అందజేసింది. కొంత కాలానికి ఆ అప్పును యంగ్ ఇండియన్ కంపెనీకి రూ.50లక్షల నామమాత్రపు మొత్తానికి అప్పగించేసింది. ఆ వ్యవహారం చాలా చాకచక్యంగా ఏజేఎల్ రియల్ఎస్టేట్ ఆస్తులపై నియంత్రణను యంగ్ ఇండియన్ కంపెనీకి బదలాయించింది. ఆ ఆస్తుల విలువ సుమారు రూ.2వేల కోట్లు. వాటి మార్కెట్ విలువ రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా. అలా జరిగిన ఆస్తుల బదలాయింపు ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఆదాయపు పన్ను చట్టాల లోని పలు ప్రొవిజన్లను ఉల్లంఘించింది. ఆ చట్టాల ప్రకారం… రాజకీయ పార్టీలు ఇలాంటి వాణిజ్యపరమైన లావాదేవీలు చేయడం నిషేధం.
అప్పటినుంచీ కాంగ్రెస్ పార్టీ తమ న్యాయవాదుల సైన్యంతో న్యాయస్థానాల నుంచి ఎప్పటికప్పుడు వాయిదాలు తీసుకుంటూనే ఉంది. ఆ కేసు విచారణను నిలువరించడానికి మొదట్లో ట్రయల్ కోర్టు స్థాయిలో వాయిదా వేసింది. తర్వాత హైకోర్టు, ఆపైన సుప్రీంకోర్టు గుమ్మాలు ఎక్కారు ఆ పార్టీ న్యాయవాదులు. కానీ ప్రతీసారీ వారికి నిరాశే మిగిలింది.
(అ) ట్రయల్ కోర్టు సమన్లు (2014)
సుబ్రమణ్య స్వామి ఫిర్యాదు ఆధారంగా 2014 జూన్ 26న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులను కోర్టుకు హాజరు కావాలంటూ ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లను నిందితులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసారు.
(ఆ) ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ (2015)
ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టేయాలని కోరుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పెట్టుకున్న పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏజేఎల్ ఆస్తులను యంగ్ ఇండియన్ సంస్థ పొందడం వెనుక ‘నేరపూర్వక ఉద్దేశం – క్రిమినల్ ఇంటెంట్’ ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రాథమిక స్థాయిలోనే దర్యాప్తు ప్రక్రియను నిలిపివేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.
(ఇ) సుప్రీంకోర్టులో విచారణ (2016)
కేసులో నిందితులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దాంతో సుప్రీంకోర్టు ఈ కేసులో నిందితులు విచారణకు ప్రత్యక్షంగా హాజరు కానక్కరలేదంటూ మినహాయింపు ఇచ్చింది. కానీ, విచారణ ప్రక్రియను కొట్టేయడానికి నిరాకరించింది. కేసు దర్యాప్తును ముందుకు సాగనీయవచ్చని తేల్చి చెప్పింది. చట్టపరమైన ప్రక్రియను ఎవరూ ఆపడానికి వీలు లేదని స్పష్టం చేసింది.
(ఈ) ఐటీ రీఎసెస్‌మెంట్ సవాల్ (2018)
ఆదాయపు పన్ను విభాగం 2011-12 ఆర్థిక సంవత్సరానికి గాను సోనియా, రాహుల్ ఆస్తులపై పన్ను అంచనాలను పరిశీలించడానికి ఆ కేసును రీఓపెన్ చేసింది. ఏజేఎల్ అక్విజిషన్‌కు సంబంధించిన వాస్తవాలను బహిర్గతం చేయాలని ఆదేశింది. ఆ ఆదేశాన్ని గాంధీలు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసారు. వారి పిటిషన్లను 2018 సెప్టెంబర్ 10న కోర్టు డిస్మిస్ చేసింది. ఏదేమైనా ఆదాయం వివరాలు సరిగ్గా రాలేదన్న అనుమానాలు ఎవరికైనా ఉంటే ఐటీ రిటర్న్‌లను పునర్మూల్యాంకనం చేసే అధికారం ఈ విభాగానికి ఉందని ఢిల్లీ కోర్టు పేర్కొంది.
(ఉ) ఈడీ ఛార్జిషీట్ (2025):
మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రొవిజన్ల ప్రకారం ఈడీ తాజాగా అంటే ఏప్రిల్ 2025న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తదితరులపై చార్జిషీట్ దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకున్న 30కోట్ల డాలర్ల విలువైన ఆస్తిని చట్టవిరుద్ధంగా ఆక్రమించాలనే దురుద్దేశంతో నిందితులు ఒక షెల్ కంపెనీని ఏర్పాటు చేసారని ఈడీ ఆరోపించింది.
ఈడీ తీసుకుంటున్న ఈ చట్టపరమైన చర్యల వల్ల సీనియర్ కాంగ్రెస్ నాయకుల ప్రమేయంతో ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను పరిశీలించడానికి వీలుగా చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి. దాంతో కాంగ్రెస్ నాయకుల్లో కలవరం మొదలైంది. అందుకే వారు ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు.