కులాంతర వివాహాల్లో చిన్న కులం వారి మీద పెద్ద కులం వారు దాడి చేస్తే గోల పెట్టే అభ్యుదయ వాదులు, ఉదార వాదులు, వామపక్షీయులు, తదితర వర్గాల వారు దానికి భిన్నమైన పరిస్థితి తలెత్తినప్పుడు నోరెత్తకుండా మౌనంగా ఉండిపోవడం సమాజానికి అలవాటైపోయిన విషయం. అలాంటి సంఘటనే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జరిగింది. మౌలికంగా నేరస్తులు ముస్లింలు అయితే అలాంటి కేసుల గురించి నోరెత్తి మాట్లాడే ధైర్యం ఈ సోకాల్డ్ అభ్యుదయవాదులు చేసిన దాఖలాలు చాలా తక్కువ.
అలాంటి రెండు సందర్భాలకు చెందిన ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి. అమృత అనే వైశ్యకులానికి చెందిన అమ్మాయిని ప్రణయ్ అనే ఎస్సీ కులస్తుడిగా చెప్పుకునే క్రైస్తవుడు ప్రేమ పేరుతో పెళ్ళి చేసుకుంటే అతన్ని ఆ అమ్మాయి తండ్రి చంపించేసిన సంఘటన 2018 నుంచి తాజాగా 2025 మార్చిలో నేరస్తులకు శిక్షలు పడేవరకూ కూడా విపరీతంగా చర్చనీయాంశం అయింది. అగ్రవర్ణాల ఆధిపత్య భావజాలం, దురహంకారం అంటూ నానారకాల వాదులూ రచ్చరచ్చ చేసారు. అదే సమయంలో, అశ్రీన్ అనే ముస్లిం యువతిని పెళ్ళి చేసుకున్నందుకు నాగరాజు అనే హిందూ మాల యువకుణ్ణి 2022 మే 4న జరిగిన ముస్లిములు వేటాడి హత్య చేసిన సంఘటన గురించి చర్చ నామమాత్రంగా మిగిలిపోయింది. ఇవి రెండూ తాజాగా మన కళ్ళ ముందరి ఉదాహరణలు. ఇప్పుడు అటువంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నగరంలో జరిగింది.
ఆదివారం జరిగిన సంఘటన ఆలస్యంగా సోమవారం రాత్రి వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు బాలాజీనగర్ కాలనీకి చెందిన షౌకత్ అలీ, ముంతాజ్ దంపతుల కూతురు యాస్మిన్ బాను(26) ఎంబీయే పూర్తి చేసింది. పూతలపట్టు మండలానికి చెందిన కోదండరాం, బుజ్జి దంపతుల కొడుకు సాయితేజ బీటెక్ పూర్తి చేసాడు. కాలేజీ రోజుల్లో వారిద్దరికీ స్నేహం కలిసింది, అది ప్రేమగా మారింది. అయితే సాయితేజ హిందూ ఎస్సీ కావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు వారి పెళ్ళికి ఒప్పుకోలేదు. దాంతో వారిద్దరూ ఈ ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్ళి చేసుకున్నారు. ప్రాణహాని భయంతో ఫిబ్రవరి 13న తిరుపతి డీఎస్పీని ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలనూ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత పరిస్థితి కొన్నాళ్ళ క్రితం వరకూ బాగానే ఉంది.
కొన్ని రోజుల క్రితం యాస్మిన్ కుటుంబీకులు ఆమెకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. తండ్రి షౌకత్ అలీ ఆరోగ్యం బాగోలేదంటూ చెప్పసాగారు. ఒక్కసారి వచ్చి తండ్రిని చూసి వెళ్ళాలంటూ పదేపదే కోరారు. తండ్రిపై మమకారంతో యాస్మిన్ మెత్తబడింది. సాయితేజ కూడా సానుకూలంగా స్పందించాడు. ఆదివారం ఉదయం సాయితేజ యాస్మిన్‌ను ఆమె సోదరుడి కారులో ఎక్కించి, ఆమె పుట్టింటికి పంపించాడు. కాసేపటికే సాయితేజ తన భార్యకు ఫోన్ చేయగా కలవలేదు. దాంతో యాస్మిన్ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసాడు. వాళ్ళెవరూ స్పందించలేదు. ఆ పరిస్థితిలో సాయితేజ యాస్మిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు విని అతనికి మతి పోయింది. యాస్మిన్ ఇంట్లో లేదనీ, ఆత్మహత్య చేసుకుందనీ, ఆమె శవం గవర్నమెంట్ మార్చురీలో ఉందనీ ఆమె కుటుంబీకులు నిర్లక్ష్యంగా జవాబిచ్చారు.
గంట క్రితం వరకూ తనతో ఉన్న భార్య అప్పుడే ఎలా చనిపోయిందో తెలియని సాయితేజ, హుటాహుటిన గవర్నమెంట్ ఆస్పత్రి మార్చురీకి పరుగెత్తాడు. అక్కడ భార్య శవాన్ని చూసి గోలుగోలున ఏడ్చాడు. తమ ఇద్దరి మతాలూ వేరు కావడం, తనది ఎస్సీ కులం కావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు మొదటినుంచీ తమ పెళ్ళిని వ్యతిరేకిస్తూ వచ్చారని సాయితేజ ఆవేదన చెందాడు. చివరికి తన భార్యను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని రోదించాడు. అప్పుడే యాస్మిన్ తండ్రి, ఆమె పెద్దమ్మ కొడుకు చిత్తూరు నగరం నుంచి పరారు అవడం కూడా వారిపై అనుమానాలకు తావిచ్చింది. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ డీఎస్పీ ప్రభాకర్, టూటౌన్ సీఐ నెట్టికంఠయ్య, వన్‌టౌన్ సీఐ మహేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. పోలీసులు ఈ మరణాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సంఘటన సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. ఇప్పటివరకూ ఈ సంఘటన గురించి ప్రధాన స్రవంతి మీడియాలో పెద్దగా వార్తలు వచ్చింది లేదు. అభ్యుదయ వాదులు, ఉదార వాదులు, లౌకిక వాదులూ ఎలాంటి చర్చలూ చేపట్టలేదు. యాస్మిన్ కోసం ఒక్క బొట్టు కన్నీరు రాల్చలేదు. కారణం చాలా సరళమైనది. అక్కడ మరణించినది ముస్లిం యువతి, ఆమెను హతమార్చినది స్వయానా ఆమె సోదరుడు. ఆమెను పెళ్ళి చేసుకున్న యువకుడు ఎస్సీ రిజర్వేషన్ కలిగిన హిందూ యువకుడు. అందుకే సోకాల్డ్ అభ్యుదయ వాదులు, ఉదార వాదులు, వామపక్ష వాదులు ఎవరికీ యాస్మిన్ మరణంతో నొప్పి కలగలేదు. కొద్దిపాటి ప్రతిఘటనైనా వినిపించ లేదు. సాయితేజకు అండగా నిలిచి, అతని కష్టంలో పాలుపంచుకున్న దిక్కే లేదు.
హిందువుల సంప్రదాయాలూ ఆచార వ్యవహారాలపై నోటికొచ్చినట్లు మాట్లాడి సంబంధం ఉన్నా లేకపోయినా హిందువుల మీద రకరకాల అపవాదులు ప్రబలేలా చేయడంలో దిట్టలైన ఎర్ర, ఆకుపచ్చ, నల్లని జెండాల వాదులందరికీ, అదేం విచిత్రమో, ముస్లిముల ఆచార వ్యవహారాల గురించి బోలెడంత జాలీ సానుభూతీ కనిపించేస్తాయి. ఏడేళ్ళ క్రితం అశ్రీన్‌ను ప్రేమించిన హిందూ ఎస్సీ నాగరాజు హత్యకు గురయ్యాడు. ఏడేళ్ళ తర్వాత హిందూ మాల యువకుణ్ణి ప్రేమించిన యాస్మిన్ ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు నాగరాజు కోసం నోళ్ళు ఎలా లేవలేదో, ఇప్పుడు యాస్మిన్ కోసమూ ఒక్క నోరయినా లేవదు. ఈ కథ ఇలా అనంతంగా సాగిపోతూనే ఉంటుంది.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి