ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన నిండు గర్భిణి భర్త చేతిలో హత్యకు గురైంది. ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది. విశాఖ నగరం మధురవాడలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
దువ్వాడకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వర్, అనుష దంపతులు మధురవాడలోని ఓ అపార్టుమెంటులో అద్దెకు దిగారు. వీరు వేర్వేరు కులాలకు చెందిన వారు. 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. జ్ఞానేశ్వర్ రెండు ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు నడుపుతున్నాడు. వివాహం చేసుకుని రెండేళ్లైనా తల్లిదండ్రులకు పరిచయం చేయలేదు. వివాహం చేసుకున్న సంగతి కూడా తల్లిదండ్రులకు చెప్పలేదు. భార్య అనూష ఎన్ని సార్లు అడిగినా ఏదొక షాకు చెప్పి తప్పించుకునేవాడు.
తనకు క్యాన్సర్ వచ్చిందని, తనకు విడాకులు ఇచ్చి వేరే వివాహం చేసుకోవాలంటూ భార్యను మోసగించే ప్రయత్నం చేశారు. నీతోనే నా జీవితమని అనూష తెగేసి చెప్పడంతో వారి మధ్య గొడవలు ముదిరాయి. ఈ గొడవలు హత్యకు దారితీశాయని పోలీసులు తెలిపారు.