అధ్యాయం 9 : జాతీయ దృష్టికోణం – 3
ముస్లిముల మానసిక స్వభావం:
ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు ఒక ప్రత్యేకమైన ఆలోచనాధోరణి కలిగి ఉంటారని అంబేద్కర్ వివరించాడు. ‘‘మతం విషయంలో ముస్లిములు ఎంత పట్టింపుతో ఉంటారంటే అభివృద్ధి చెందాలన్న ఆలోచన వారిలో ఉండనే ఉండదు. ఇతర మతాలను అనుసరించే వారి విషయంలో కూడా ముస్లిముల ఆలోచన ‘సర్వధర్మ సమభావం’ అంటే అన్ని మతాలనూ సమానంగా ఆదరించాలి అనే పద్ధతికి దూరంగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన ప్రకారం ముస్లిములు అభివృద్ధి వ్యతిరేక భావజాలం కలిగి ఉంటారు. వారి స్వభావం మీద ప్రజాస్వామ్యం ఆవగింజంత ప్రభావమైనా చూపలేదు. వారికి వారి మతమే అన్నిటికంటె గొప్పది. ఏ రకమైన అభివృద్ధినైనా వారు వ్యతిరేకిస్తారు. మొత్తం ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ వారు అభివృద్ధి నిరోధకులుగానే ఉంటారు. సర్వకాల సర్వావస్థల్లోనూ వారి దృష్టి తమ మతం మీద మాత్రమే ఉంటుంది. పాలకులు ముస్లిములు కాకపోతే వారి ఉద్దేశంలో అది వారి శత్రువుల రాజ్యమే అవుతుంది. నిజమైన ముస్లిములకు భారతదేశం తమ మాతృభూమి అనీ, హిందువులు తమ సోదర సమానులనీ భావించే అవకాశమే లేదు. ముస్లిముల స్వభావంలోనే ఆక్రమించుకునే ప్రవృత్తి పొంచివుంది. హిందువుల బలహీనతను ఆసరా చేసుకుని గూండాగిరీ చేయడం వారి స్వభావం.’’ (ప్రఖర్ రాష్ట్రభక్త్ : డా. భీమ్రావ్ అంబేద్కర్ పుస్తకం నుంచి)
సెక్యులరిజం అర్థం ఏమిటి? :
ఇవాళ సెక్యులరిజం లేదా లౌకికవాదం పేరిట హిందువుల విశ్వాసాలపై అన్నివిధాలుగానూ దాడి జరుగుతోంది. ఆ విషయంలో బాబా సాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా ఇలా చెప్పాడు, ‘‘ప్రజల మతభావనలను ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోకపోవడం సెక్యులరిజం కాదు. లౌకికవాదం అంటే అర్థం ఏమిటంటే ఒక సమూహం యొక్క మతాన్ని మిగతా మతాల మీద రుద్దడాన్ని పార్లమెంటు సహించదు. ఆ హద్దులను మాత్రమే రాజ్యాంగం పరిగణిస్తుంది. సెక్యులరిజం అంటే ధర్మ విచ్ఛేదనం అని అర్ధం కాదు.’’
అంబేద్కర్ ఆలోచనలను బట్టి చూస్తే భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ముస్లిం సంతుష్టీకరణ, మిగతా మతాలపై ఉదాసీన భావన దేశానికి ప్రమాదకరమని చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. అలాంటి ప్రవృత్తి కలిగినవారి నుంచి సావధానంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
బ్రిటిష్ వారు వెళ్ళిపోయాక మన బాధ్యత పెరిగింది:
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మనదైన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందరికీ సమాన హక్కులు లభించాయి. ఇంక కొన్ని బాధ్యతలు కూడా పెరిగాయి. ‘‘మనదేశం తెల్లవారి పాలనలో ఉన్నప్పుడు ఎవరికి ఏ హక్కులు, అధికారాలు ఇవ్వాలి అనేది ఆ పాలకుల చేతిలో ఉండేది. అప్పుడు మనం ఇతర వర్గాలతో గొడవలు పడుతుండేవాళ్ళం. ఇప్పుడు మనం మిగిలిన వర్గాలు, దళాలతో సామరస్యంగా, సహానుభూతితో వ్యవహరించాలి. చట్టబద్ధమైన పద్ధతిలో మనం ఎదగాలని కోరుకుంటే మనం మిగతా వారితో కలిసి మెలిసి నడవాల్సిన అవసరముంది. పాత శత్రుత్వాలన్నీ మరచిపోవాలి. గతంలోలా ఒంటరిగా ఉంటే పని జరగదు’’ అని అంబేద్కర్ స్పష్టం చేసాడు.
సంఘంతో సంబంధం:
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డా. హెడగేవార్, డా. అంబేద్కర్ ఇద్దరూ మహారాష్ట్రీయులే. ఆ మహాపురుషులు ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఉండేది. ఇద్దరి కార్యక్రమాలకూ కేంద్రస్థానాల్లో ప్రముఖమైనది నాగపూర్ నగరమే. ఆనాటి హిందూ సమాజం ఉన్న దుస్థితిని చూసి ఇద్దరూ బాధపడినవారే. ఆ ఇద్దరు మహాపురుషులు కూడా ఒకే సమస్య పరిష్కారం గురించి ప్రయత్నించినవారే.
సంఘీయులారా, త్వరగా పనిచేయండి:
అంబేద్కర్ 1953లో మోరోపంత్, ఇతర సంఘ కార్యకర్తలతో మాట్లాడాడు. సంఘం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. చివరిలో మాట్లాడుతూ మీరు మీ పనిని త్వరగా చేయండి అని చెప్పారు. ‘‘మీరు సరైన పని చేస్తున్నారు. కానీ ఆ పని మందకొడిగా సాగుతోంది. నా సమాజం ఇంత సుదీర్ఘకాలం వేచి ఉండలేదు. నేను కమ్యూనిజాన్ని ఏమాత్రం కోరుకోవడం లేదు. షెడ్యూల్డు జాతుల వారికి, కమ్యూనిస్టులకు మధ్య అంబేద్కర్ అడ్డంకిగా ఉన్నాడు. మిగతా హిందువులకు, కమ్యూనిస్టులకు మధ్య గోళ్వల్కర్ అడ్డంకిగా ఉన్నాడు’’ ఇవీ అంబేద్కర్ అచ్చంగా చెప్పిన మాటలు.
అంబేద్కర్ ఇచ్చిన ఈ సందేశం ఇవాళ జాతీయవాద భావధారతో ముడిపడి ఉన్న ప్రతీ ఒక్కరికీ తమ పనిని వేగవంతం చేయాలన్న ఆహ్వానమని చెప్పుకోవచ్చు.
(సమాప్తం)