అధ్యాయం 6 : సమాజ ఉద్ధారకుడు – 2
హిందువులు తమ గొప్ప వారసత్వాన్ని నిలబెట్టుకోవాలి:
హిందూధర్మగ్రంథాల్లో ఎన్నో మంచి విషయాలున్నాయి. ప్రపంచంలో ఎక్కడా దొరకని తత్వజ్ఞానం హిందూగ్రంథాల్లో ఉంది. వాటిని పునఃపరిశోధించడం ఇప్పుడు తక్షణ అవసరం. అంబేద్కర్ ఇలా అంటాడు, ‘‘ఒకవేళ మీరు హిందూధర్మాన్ని రక్షించాలనుకుంటే తమ సామాజిక వారసత్వంలో ఉపయుక్తమైన వాటిని కాపాడండి, వాటిని అందరికీ పంచండి. మిగిలిన వాటిని వదిలిపెట్టేయండి.’’
వేలమందికి యజ్ఞోపవీతం ధరింపజేసాడు:
మనం హిందువులం. హిందూధర్మ పరంపరను అనుసరించడానికి మనందరికీ పూర్తి అధికారం ఉంది. హిందూ సమాజ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, అంటరానివారిని సమానంగా చూడాలనీ అంబేద్కర్ కోరుకునేవాడు. ఆ ఉద్దేశంతోనే 1929 ఏప్రిల్‌లో రత్నగిరి జిల్లా చిప్లూన్ ప్రాంతంలో దళితజాతి పరిషత్ సమావేశం అంబేద్కర్ అధ్యక్షతన జరిగింది. దానికి అంబేద్కర్ తన బ్రాహ్మణ మిత్రుడైన దేవరావు నాయక్‌ను తీసుకువెళ్ళాడు. దేవరావు నాయక్ ఆ సమావేశంలో వేలాది దళితులకు యజ్ఞోపవీత ధారణ చేయించాడు.
అంబేద్కర్ ఉద్దేశంలో ప్రతీ హిందువుకూ వైదిక పద్ధతిలో యజ్ఞోపవీతం ధరించే అధికారం ఉంది. అందుకే ఆయన బొంబాయిలో ‘సమాజ్ సమతా సంఘ్’ అనే సంస్థ స్థాపించాడు. దాని ప్రధాన కార్యం అస్పృశ్యులకు నాగరిక అధికారాలు, హక్కుల కోసం పోరాడడం. ఆ హక్కుల గురించి అస్పృశ్యుల్లో చైతన్యం కలిగించడం. ఆ సమాజం సక్రియంగా పనిచేసింది. దాదాపు 500మంది మహర్లకు యజ్ఞోపవీత ధారణ చేయించింది. (డా.బీఆర్ అంబేద్కర్: వ్యక్తిత్వ్ ఏవం కృతిత్వ్ – పుటలు 116,117)
దళితులకు ఆహ్వానం:
మీరు మీ బస్తీలను బాగుచేసుకోండి. మన బస్తీల్లో వ్యాపించి ఉన్న మురికి, అవిద్య, చెడ్డ పద్ధతులు, మద్యపానం లాంటి దురలవాట్లకు కారణం ఎవరు? వీటన్నింటినీ మనకు మనమే బాగుచేసుకోవాలి అని అంబేద్కర్ చెబుతుండే వాడు. ఎవరో మనను అస్పృశ్యులని పిలిచే సమస్య పరిష్కారం అయిపోయింది అయిందనుకుందాం. అప్పుడు కూడా మన బస్తీలను మనమే బాగు చేసుకోవాలి అని చెప్పేవాడు.
మహాడ్‌లో ఒక జాట్ మొహల్లాలో ఒకసారి ప్రసంగిస్తూ అక్కడి మహిళలను ఉద్దేశించి అంబేద్కర్ ఇలా అన్నాడు ‘‘మిమ్మల్ని మీరు ఎప్పుడూ అంటరానివారు అనుకోకండి. పరిశుభ్రమైన జీవితం గడపండి. స్పృశ్య మహిళల్లా దుస్తులు ధరించండి. మీ దుస్తులు పాతవి, చిరిగిపోయినవి అని బాధపడకండి. అవి శుభ్రంగా ఉన్నాయా లేవా అని చూడండి. మంచిగా దుస్తులు ధరించే మీ హక్కుకు ఎవరూ అడ్డంకులు కల్పించలేరు. మీ మనసులు స్వచ్ఛంగా ఉంచుకోవడం పట్ల ధ్యాస ఉంచండి. మీకు మీరే సహాయం చేసుకోవాలన్న విషయాన్ని మీ మనసుల్లో ఎప్పుడూ గుర్తుంచుకోండి.’’ అంబేద్కర్ తనకు బీడీ, సిగరెట్, సారాయి అంటే ప్రేమ లేదని ఎప్పుడూ చెబుతుండేవాడు.
సారాయి తాగనీయకండి:
అంబేద్కర్ బస్తీ జనాలకు సారాయి తాగవద్దని హితబోధ చేసేవాడు. మీ బస్తీల్లో సారాయిని ఎవరు ఆపుతారు? అని అడిగేవాడు. ‘‘మనందరం మన బస్తీల్లో ఈ వస్తువులను రానీయకుండా ఆపుదాం. నీ భర్త, నీ కొడుకు సారాయి తాగి ఇంటికి వస్తే వారికి అన్నం పెట్టకు. అన్ని అవలక్షణాలనూ సారాయి మరింత పెంచుతుంది. సారాయి తాగడం కొనసాగినంత కాలం మీ బస్తీలను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన మీ మనసుల్లోకి రానేరాదు. మనను మనమే బాగుచేసుకోవాలి. ఎవరో వచ్చి బాగుచేయరు కదా’’ అని బస్తీ మహిళలకు అంబేద్కర్ మార్గదర్శనం చేసేవాడు.
అన్ని దోషాలకూ సవర్ణులనే బాధ్యులు చేయకండి:
‘‘సవర్ణుల దోషాలకు వారితో ఘర్షణ పడదాం’’ అంటూనే, అంబేద్కర్ అక్కడితో ఆగలేదు. ‘‘ఒకరోజు ఆలస్యమైనా మన అధికారాలు, హక్కులు మనకు వస్తాయి. కానీ మన బస్తీలను మనం బాగు చేసుకోకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? మన దోషాలను నివారించుకోడానికి ఎవరు ప్రయత్నించాలి? మన బస్తీల్లో తప్పులకు దోషులు ఎవరు? మన పిల్లలను బడులకు మనమే ఎందుకు పంపించడం లేదు? చదువు మగవారికి ఎంత ముఖ్యమో ఆడవారికి కూడా అంతే ముఖ్యం. మీరు చదవడం రాయడం నేర్చుకుంటే మీ ప్రగతి మరింత వేగవంతమవుతుంది. మీరు ఎలా ఉంటే మీ సంతానమూ అలాగే తయారవుతారు. మీ పిల్లల జీవితాన్ని మీరు ఎలా తీర్చిదిద్దాలంటే భవిష్యత్తులో వారు మీకు మంచిపేరు తెచ్చిపెట్టాలి’’ అని చెప్పేవాడు.
ఇప్పటి కేరళ ప్రాంతాన్ని అప్పట్లో మాలావర్ అని వ్యవహరించేవారు. అక్కడి స్త్రీల స్థితిగతులను చూసి అంబేద్కర్ ఆవేదన చెందాడు. ఒకసారి అక్కడి మహిళలతో సమావేశం నిర్వహించాడు. రాత్రి మొదలుపెట్టిన సమావేశం తెల్లవారుజామున నాలుగు గంటలైనా పూర్తికాలేదు. ‘‘మీ గ్రామంలోని బ్రాహ్మణులను చూడండి. వారు ఎంత నిరుపేదలైనా, తమ పిల్లలను చదివిస్తారు. వాళ్ళ పిల్లవాడు బాగా చదువుకుని డిప్యూటీ కలెక్టర్ అవుతాడు. మీరు అలా ఎందుకు చేయరు? మీ పిల్లలను ఎందుకు చదివించరు? బడికి ఎందుకు పంపించరు? మీ పిల్లలు చచ్చిన గొడ్ల మాంసం తింటూ బతకాలని కోరుకుంటారా? ఎప్పుడూ పక్కవారి గురించి చాడీలు చెప్పుకుంటూ బతికేస్తూ ఉండాలా? మీరెందుకు మీ శరీరాలను నగ్నంగా ఉంచుకుంటారు? ప్రపంచంలో ఎక్కడా ఆడవాళ్ళు మీలా అర్ధనగ్నంగా ఉండరు. ఇది చెడ్డ విషయం. మీరు మీ గౌరవాన్ని కాపాడుకోవాలి. మీరు దుస్తులు ధరించే పద్ధతిని మార్చుకోవాలి’’ అని హితవు పలికాడు. (డా.బీఆర్ అంబేద్కర్: వ్యక్తిత్వ్ ఏవం కృతిత్వ్ – పుట 105)
మరునాడు ఆ మహిళలు అందరూ పూర్తిగా దుస్తులు ధరించి వచ్చారు. వారు బాబాసాహెబ్‌కు పూలు అర్పించారు. అంబేద్కర్ దాదాపు ఐదు నెలల పాటు మాలావర్ ప్రాంతంలోనే ప్రచారం చేస్తూ ఉండిపోయాడు. మెల్లమెల్లగా బస్తీల పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.
‘‘హిందుత్వ వికాసంలో ఋషి వాల్మీకి, సంత్ రవిదాస్, చోఖామేళా వంటి సాధువుల, సిద్ధవాక్కు వంటి మహాభక్తుల కృషి ఎంతో ఉంది’’ – డా. అంబేద్కర్
(సశేషం)