అధ్యాయం 5 : సమాజ ఉద్ధారకుడు – 1
రాజకీయాలతో కాదు సామాజిక పరివర్తనతోనే దోషాలు దూరం:
సమాజంలో పరివర్తన రావాలని డాక్టర్ అంబేద్కర్ సునిశ్చిత అభిప్రాయం. సమాజపు వివేకం, సహృదయత, తోటివారిపట్ల స్నేహభావం, సమాజంలోని అందరూ అభివృద్ధి చెందాలన్న భావన వంటి లక్షణాలు లేకపోతే రాజకీయం కేవలం కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలకు పరిమితమైపోతుంది. సమాజంలోని కుసంస్కారాలను దూరం చేయకుండా రాజకీయాలను బాగుచేయడం సాధ్యం కాదు.
అంబేద్కర్ ఇలా చెప్పేవాడు ‘‘సమాజ ప్రగతిలో రాజకీయాల కంటె సామాజిక, ఆర్థిక పరిస్థితులదే పెద్దపీట. కాబట్టి కార్యకర్తలు అటువైపు ఎక్కువగా దృష్టి సారించాలి. రాజకీయాలే సర్వస్వం అనుకునేవారు ఎన్నికల సమయం రాగానే టికెట్ల కోసం పరుగులు తీస్తారు. తమకు టికెట్ దొరక్కపోతే సమాజం మీద విరుచుకు పడతారు. ఎన్నికల్లో ఓడిపోతే అలసిపోయి నిరాశలో కూరుకుపోతారు. ఎన్నికల్లో గెలిస్తే శాసనసభల్లో ఐదేళ్ళ పాటు మౌనంగా కూర్చుంటారు. వీళ్ళు చేసేదింతే.’’
1953 జులైలో అంబేద్కర్ ఔరంగాబాద్‌లో దళిత కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ ఇలా చెప్పాడు, ‘‘ఎన్నికల రాజకీయంలో భాగస్వామి అయ్యే కార్యకర్త ఎన్నికలు ముగిసిన తర్వాత నిష్క్రియంగా మిగిలిపోతాడు. రాజకీయాలు మాత్రమే కాదు, సామాజిక జీవితంలోని మరెన్నో ఇతర క్షేత్రాలు కూడా కార్యకర్తల కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ అటు వెళ్ళడానికి ఎవరికీ ఆసక్తి లేదు. ప్రతీ ఒక్కరూ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయిపోదామనే అనుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోనో లేక పార్లమెంటులోనో అడుగుపెట్టినా, వారికి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఖాళీ లేదు. శాసన సభల్లో ఓటర్ల ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. రాజకీయ రంగంలో కూడా హోంవర్క్ అత్యవసరం. పైపై మాటలతో ఉపన్యాసాలు చెప్పడం, పెద్దపెద్ద పూలదండలు వేయించుకుని ఇంటికి వెళ్ళడం మాత్రమే సరిపోదు.’’
చరిత్ర బాగుంటే పీఎం లేదా సీఎం అవవచ్చు:
‘‘దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉండేవారు చరిత్రలో నిలిచిపోగలవారు అయిఉండాలి. మొత్తం సమాజం తన గురించి గొప్పగా చెప్పడం, వ్యక్తిగత స్వార్థాల గురించి ఆలోచించడం వంటివి లేకపోవడమే గొప్ప చరిత్ర లక్షణం’’ అని చెప్పాడు అంబేద్కర్.
1954 ఫిబ్రవరి 4న ఆచార్య ఆత్రే నిర్మించిన ‘మహాత్మా ఫూలే’ అనే చిత్రాన్ని ఆవిష్కరిస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు ‘‘ఇవాళ దేశంలో చరిత్ర అన్నదే మిగలలేదు. నైతికత లేని దేశానికి భవిష్యత్తు చాలా కఠినంగా ఉంటుంది. అప్పుడు దేశ ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ అవనీయండి, ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్ కానీయండి, ఎవరైనా సరే మీ భవిష్యత్తు అంధకారబంధురం అవుతుంది. దేశాన్ని ఉద్ధరించేది మంత్రులు కాదు, ధర్మాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్న వాడే దేశాన్ని ఉద్ధరించగలుగుతాడు. మహాత్మా ఫూలే అటువంటి ధర్మోద్ధారకుడు. చదువు, బుద్ధి, కరుణ, శీలం, స్నేహభావం అనే తత్వాల ఆధారంగానే ప్రతీ ఒక్కరూ తమ చరిత్ర నిర్మించుకోవాలి. కరుణ అంటే మనిషికి తోటిమనిషి మీద ఉండే ప్రేమ. దానికోసమే మనుష్యులు ముందడుగు వేయాలి.’’
బంధుభావం లేకుండా సమాజంలో సమరసత రాదు:
సామాజిక సమరసత నిర్మాణం పూర్తవకముందే సమాజంలో సమత్వాన్ని స్థాపించడం అసాధ్యం. అంబేద్కర్ 1947 నవంబర్ 24న ఢిల్లీలో ప్రసంగిస్తూ ‘‘మన భారతీయులమందరమూ ఒకరికొకరు సోదరులం అన్న భావన అందరిలోనూ ఉండాలి. దాన్నే బంధుభావం అంటారు. కానీ నేటి సమాజంలో అదే కొరవడింది. కులాల మధ్య ఈర్ష్యా ద్వేషాలు పెరుగుతున్నాయి. అదే దేశపు ఉనికి అయితే ఆ అడ్డంకిని తక్షణం దూరం చేయాలి. ఎందుకంటే బంధుభావమే దేశపు ఉనికి కావాలి. ఆ బంధుభావమే లేకపోతే సమత, స్వాధీనత లాంటి లక్షణాలకు ఉనికి లేకుండా పోతుంది’’ అని చెప్పాడు.
నా తత్వం రాజకీయాలకు కాదు, ధర్మానికి సంబంధించినది:
భారతదేశపు మౌలిక ఆత్మలక్షణం ధర్మం. అంబేద్కర్ మనసులో కూడా చిన్ననాటి నుంచీ ధర్మం బలమైన ముద్ర వేసింది. ధర్మం యొక్క శ్రేష్ఠ గుణాల్లో ముఖ్యమైనవి తోటి ప్రాణుల పట్ల స్నేహం, కరుణ కలిగి ఉండడం. అంబేద్కర్ తత్వం మొత్తానికి మూలమైన ఆధారం అదే. ‘‘నా తత్వజ్ఞానం రాజకీయాలకు కాదు, ధర్మానికి సంబంధించినది. ఆ విషయాన్ని నేను బుద్ధ భగవానుడి ఉపదేశాల నుంచి స్వీకరించాను. అందులో సమత్వానికి, స్వాధీనతకు స్థానం ఉంది. సమత, స్వాధీనతలకు చట్టం ద్వారానే గ్యారంటీ లభిస్తుందని నేను విశ్వసించను. నా ఆలోచనల్లో బంధుభావానికే ఉన్నత స్థానం ఉంది. సమత, స్వాధీనతలను సాధించడంలో కేవలం బంధుభావమే భద్రత కల్పిస్తుంది. ఆ బంధుభావానికే మరోపేరు మానవత్వం. మానవత్వమే పరమధర్మం’’ అని అంబేద్కర్ చెప్పాడు.
విశ్వదర్శనాల్లో హిందూ దర్శనమే శ్రేష్ఠమైనది, దానికి అస్పృశ్యత కళంకం ఎందుకు?
అంబేద్కర్ హిందూ తాత్వికతనే సర్వశ్రేష్ఠమైనదిగా అంగీకరించాడు. కానీ మనిషి తన తోటి మనిషిని తాకకూడదనే ఆలోచన ఎక్కణ్ణుంచి వచ్చింది? హిందువులు ప్రతీ ప్రాణిలోనూ పరబ్రహ్మను దర్శిస్తారు కదా, మరి తోటి మానవులను అంటరానివారిగా ఎలా చూస్తారు? అంబేద్కర్ మనసును ఈ ప్రశ్న తొలిచివేసింది.
‘‘హిందువులు తమ మానవత్వ భావనలకు ప్రసిద్ధి చెందారు. సృష్టిలోని ప్రతీ ప్రాణి పట్లా వారి విశ్వాసం అద్భుతమైనది. కొంతమంది హిందువులు విషసర్పాలను సైతం చంపరు. హిందూ దర్శనం ఆత్మ సర్వవ్యాపకం అన్న సిద్ధాంతాన్ని బోధిస్తుంది. బ్రాహ్మణుడు, చండాలుడి మధ్య భేదభావం చూపవద్దని భగవద్గీత ఉపదేశిస్తుంది. మానవత్వం, ఉదారవాదం అనే ఇంత మంచి పరంపర కలిగిన హిందువులు తమ తోటి మనుష్యుల పట్ల ఇంత అనుచితంగా, నిర్దయగా ఎలా ఉండగలుగుతారు’’ అని అంబేద్కర్ ప్రశ్నించాడు. (మూలం: బి.జి.కుంతే మొదటి సంపుటం పుటలు 14-15)
1928లో ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరాక ఒక సందర్భంలో అంబేద్కర్ ఇలా అడిగాడు, ‘‘భారతీయతకు విరోధులు, గోమాంస భక్షకులు, రాముడు-కృష్ణుడు-శివుడి విగ్రహాలను ధ్వంసం చేసినవారు అయిన ముస్లిములు, క్రైస్తవులను ముట్టుకోవచ్చు కానీ హిందూ సమాజంలోనే ఒక భాగమైన వారు, ఆవును-గంగను-రాముణ్ణి-కృష్ణుణ్ణి-శివుణ్ణి పూజించేవారు అంటరానివారు ఎందుకయ్యారు?’’
(సశేషం)
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి