అధ్యాయం 4: సంఘర్షశీల వ్యక్తిత్వం
సమాజానికి కొత్తదిశ :
కాలగతితో పాటు సమాజంలో వ్యాపించిన కొన్ని దురభిప్రాయాలు విచ్ఛిన్నమవడానికి భారతావని ఎదురు చూస్తోంది. సరైన సందర్భం, సరైన మార్గదర్శనం అప్పటి అవసరం. ఈశ్వర కృపతో అవి లభించాయి. అంటరానితనం అనుచితమని హిందూ సమాజం అర్ధం చేసుకుంటోంది. ఆ సమయంలో 1924లో అండమాన్ జైలు నుంచి విడుదలైన తర్వాత స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ అస్పృశ్యతకు వ్యతిరేకంగా శంఖం పూరించాడు. మహాత్మాగాంధీ కూడా అంటరానితనాన్ని నిర్మూలించాలంటూ ఉద్యమం ప్రారంభించాడు. డాక్టర్ హెడ్గేవార్ కూడా శతాబ్దాలుగా అణచివేతకు, అన్యాయాలకూ గురైన అస్పృశ్య సమాజ బంధువులను కేవలం ప్రసంగాలు, నినాదాలతో జాగృతం చేయలేమనీ… దానికోసం సంఘర్షణ, ప్రజాందోళన జరగాలని భావించాడు.
డాక్టర్ అంబేద్కర్ 1924 జులై 20న బొంబాయిలో ‘బహిష్కృత హితకారిణీ సభ’ ప్రారంభించాడు. దళితులకు చదువు ఆవశ్యకతను వివరించడం, వారికోసం సామాజిక కేంద్రాలు, పాఠశాలలు స్థాపించడం, విద్యార్ధుల కోసం హాస్టళ్ళు ఏర్పాటు చేయడం, ఆ ప్రయత్నాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ఆ సభ ప్రధాన లక్ష్యాలు. మొత్తంగా, అస్పృశ్యుల ఉద్ధరణ ఆ సభ ఏకైక లక్ష్యం. బొంబాయిలో ఆ సభ విస్తృతంగా పనిచేసింది.
మహాడ్‌లో జల సత్యాగ్రహం :
1926లో బొంబాయి ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం అంటరానివారికి కొలాబా జిల్లా మహాడ్ మునిసిపాలిటీలోని చావ్దార్ చెరువు నీటిని వాడుకోడానికి అవకాశం కల్పించింది. అయితే కాగితాల మీద ఉంటే ప్రయోజనం ఏముంది. ఒక రోజు అంబేద్కర్ తన వందలాది అనుయాయులతో కలిసి ఆ చెరువులోని నీటిని తాకి, తాగి, వాటిని వాడడం మొదలుపెట్టాడు. అయితే సమాజంలోని కొందరు కుత్సితబుద్ధులు అంబేద్కర్, ఆయన అనుయాయుల గురించి అవాకులూ, చెవాకులూ వ్యాపింపజేసారు. ఫలితంగా కొందరు దుర్మార్గులు అంబేద్కర్, ఆయన అనుచరులపై దాడి చేసారు.
భీమరావ్ అంబేద్కర్ మీద జరిగిన దాడితో సమాజంలో ఒక కొత్త కదలిక వచ్చింది. ఆలోచనాపరులు, ధర్మబుద్ధి కలిగినవారు అయిన హిందువులు ఆ దాడిని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, ఆ ప్రాంతంలోని అన్ని చెరువులు, బావులలోని నీటిని అస్పృశ్యులు కూడా అందరి మాదిరిగానే వాడుకోడానికి అంగీకరించారు. అన్నేళ్ళుగా ఉన్న అస్పృశ్యతను వదిలిపెట్టారు. కుక్కలు, పిల్లులు, గుర్రాలు, గాడిదలు సైతం నీళ్ళు తాగే చెరువులో మనుషులను నీళ్ళు తాగనీయని పద్ధతి అసలు పద్ధతేనా అని అంబేద్కర్ అంటుండేవాడు.
మహాడ్ జల సత్యాగ్రహం చేపట్టిన ఉద్దేశం విజయవంతం అవడంతో అంబేద్కర్, అంటరాని తరగతుల వారు, అంబేద్కర్‌కు అండగా నిలిచిన సవర్ణుల మనోబలం పెరిగింది.
సత్యాగ్రహానికి ప్రేరణ భగవద్గీతే:
మహాడ్ చెరువులోని నీళ్ళను నిమ్నవర్ణాలవారు కూడా వాడుకోవాలంటూ చేసిన సత్యాగ్రహానికి ప్రణాళికలు వేసే సమయంలో అంబేద్కర్ తనతో పాటు సత్యం కోసం సంఘర్షించడానికి ముందుకు రావాలంటూ కార్యకర్తలను ఆహ్వానిస్తుండే వాడు. ఆ సమయంలో ఆయన వారికి భగవద్గీత నుంచి ఉదాహరణలు ఇచ్చేవాడు.
‘‘ఈ దేశంలో సత్యం కోసం సంఘర్షణ పడడానికి అతిచక్కనైన ఆహ్వానం భగవద్గీత ఇచ్చింది. అసలు సత్యాగ్రహానికి మూలకారణం భగవద్గీతే. ధర్మాన్ని బోధించే ఈ పుస్తకం స్పృశ్యులు, అస్పృశ్యులు అందరికీ స్వీకరించదగినది. అందువల్ల అందులోనుంచి ఉదాహరణలు తీసుకోవడం సరైనది. ఉద్దేశం మంచిదైతే అది సర్వదా న్యాయోచితమైనదే అని భగవద్గీత ఉపదేశిస్తోంది’’ అని అంబేద్కర్ చెప్పేవాడు. (డా. భీ. అంబేద్కర్: రచన-డా. బ్రజలాల్ వర్మ, పుట సంఖ్య 113)
ఆలయాల్లోకి రానీయకుండా ఎందుకు ఆపుతున్నారు?
గుడుల్లోకి అస్పృశ్యులు, దళితుల ప్రవేశం గురించి చాలా చోట్ల సత్యాగ్రహాలు, సంఘర్షణలు జరగడం
మొదలైంది. అమరావతి నగరంలోని ఇంద్రభువన్ థియేటర్లో జరిగిన సభలో అధ్యక్షుడిగా మాట్లాడుతూ అంబేద్కర్ ఇలా చెప్పాడు ‘‘ఆలయాల్లో భగవంతుడి మూర్తిని పూజించడానికి అందరికీ సమానమైన అధికారం ఉండాలి. గుడుల్లోని విగ్రహాలు ఎవరైనా ముట్టుకుంటే అపవిత్రమైపోవు, దానివల్ల ఎవరిమీదా ఎలాంటి ప్రతికూల ప్రభావమూ పడదు. దక్షిణాఫ్రికాలో రంగు భేదం ఆధారంగా వ్యక్తుల అధికారాన్ని నిర్ణయించే పద్ధతిలోనే మన దేశం కూడా ఆలోచిస్తోంది. కానీ, ఈశ్వరుణ్ణి విశ్వసించే హిందువులనే గుడుల్లోకి రానీయకపోవడాన్ని ఏమనాలి?’’ (డా. భీ. అంబేద్కర్: రచన-డా. బ్రజలాల్ వర్మ, పుట సంఖ్య 119)
అస్పృశ్యులకు వేరే గుడులు అక్కర్లేదు:
‘‘దళితులకు ప్రత్యేకంగా మందిరాలు కట్టించే విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. అన్ని సార్వజనిక మందిరాల్లో అంటరానివారికి ప్రవేశం కల్పించడమే న్యాయం, అదే నైతికంగా సరైన పద్ధతి అని నా ఉద్దేశం’’ అని అంబేద్కర్ స్పష్టం చేసాడు. (డా. భీ. అంబేద్కర్: రచన-డా. బ్రజలాల్ వర్మ, పుట సంఖ్య 119)
హిందూధర్మం కేవలం సవర్ణులకు మాత్రమే కాదు:
‘‘గుడులు అందరూ పూజలు చేసుకునే స్థానాలు. గుడులు హిందూ సమాజం అందరికీ అన్న భావనతో నిర్మించినవి. అలాంటి చోట్ల కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉండి, మరికొంతమందికి ప్రవేశం లేదు అన్న సంగతి జీర్ణం కావడం లేదు. గుడులు అనేవి మొత్తం హిందూ సమాజం అందరికీ ఉద్దేశించినవి, ఏదైనా ఒక ప్రత్యేకమైన వర్గానికి పరిమితమైనవి కావు. హిందూ ధర్మం కేవలం సవర్ణుల కోసం మాత్రమే అవదు. అది సవర్ణులు, అస్పృశ్యులూ అందరికీ సంబంధించినది. అలాంటప్పుడు ఈ భేదభావం ఎలా వచ్చింది’’ అని అంబేద్కర్ నిలదీసాడు.
కాలా రామ్ మందిర్ సత్యాగ్రహం:
నాసిక్‌లో భగవాన్ శ్రీరాముడి మందిరం ఉంది. అందులో నల్లరాతితో చేసిన రాముడి విగ్రహం ఉంది. ఆ ఆలయాన్ని దర్శించుకోడానికి దళితులకు అనుమతి ఉండేది కాదు. 1930 మార్చి 2న డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో వేలాది ప్రజలు రాముడి దర్శనం చేసుకోడానికి ఆ గుడికి వెళ్ళారు. కానీ వారికి ఆలయంలోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. అక్కడ సత్యాగ్రహం మొదలైంది. సుమారు నెల రోజుల పాటు కొనసాగింది. అంటరానివారిలో కొందరు యువకులు రథం లాగడానికి ముందుకొచ్చారు. కానీ వారిని ఆ పని కూడా చేయనీయలేదు. దాంతో సంఘర్షణ కొనసాగింది. ఎట్టకేలకు 1935 అక్టోబర్‌లో మందిర ప్రవేశం గురించి చట్టం చేసారు. అప్పుడు అంటరానివారి కోసం గుడి తలుపులు తెరుచుకున్నాయి.
ఆ ఘటనతో డాక్టర్ అంబేద్కర్ పేరు దేశమంతా మార్మోగిపోయింది. మెల్లమెల్లగా అంబేద్కర్, యువకులు తమ హక్కుల కోసం పోరాడేలా వారిని తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు. దాని ప్రభావం చాలా విస్తృతంగా పడింది.
‘‘భారతదేశం ఒక అఖండమైన భూగోళానికి ప్రమాణం. అది ప్రకృతి అంత ప్రాచీనమైన దేశం’’ : అంబేద్కర్
(సశేషం)
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి