అధ్యాయం 3: అంబేద్కర్ జీవిత ప్రస్థానం – 3
గోమాంసానికీ, మద్యానికీ దూరం:
అమెరికా వెళ్ళిన మొదటి వారం రోజులూ అంబేద్కర్, హార్టల్ హాల్ అనేచోట ఉన్నాడు. అక్కడ భోజనంలో ఆవు మాంసం వడ్డించేవారు. ఆవుమాంసం తినడానికి ఆయన చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న సంస్కారం అడ్డువచ్చింది. అందుకే ఆయన అక్కణ్ణుంచి మారిపోయి కొందరు భారతీయులు బస చేస్తున్న కాస్మోపాలిటన్ క్లబ్లో చేరాడు. అంబేద్కర్ తన జీవితాంతం గోమాంసానికీ, మద్యానికీ దూరంగా ఉన్నాడు. కాస్మోపాలిటన్ క్లబ్లో ఉన్న రోజుల్లో అంబేద్కర్ తన తండ్రి మిత్రుడు ఒకరికి లేఖ రాసారు. ‘‘తల్లిదండ్రులు పిల్లలకు కేవలం జన్మనిస్తారు అన్న ఆలోచనను మనమిప్పుడు పూర్తిగా వదిలిపెట్టేయాలి. వారు తమ పిల్లల భాగ్యాన్ని మార్చివేస్తారు. వ్యక్తి ఎదుగుదలకు చదువే మూలమంత్రం. కాబట్టి, చదువు విలువ గురించి వీలైనంత ఎక్కువగా మీ బంధుమిత్రులందరిలోనూ ప్రచారం చేయడమే మీరు తక్షణం చేయవలసిన మహత్కార్యం’’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు అంబేద్కర్.
అంబేద్కర్ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని 1917 ఆగస్టులో భారతదేశానికి తిరిగి వచ్చాడు. వడోదర స్టేషన్లో ఆయనకు స్వాగతం పలకడానికి ఎవరూ రాలేదు. అది ఆయనను అమితంగా బాధించింది. వడోదరలోనే మహారాజు వద్ద సైనిక మంత్రిగా అంబేద్కర్ ఉద్యోగంలో చేరాడు. కానీ అక్కడ కూడా ఆయనకు సమస్యలు కొనసాగాయి. వడోదర లాంటి నగరంలో కూడా అంబేద్కర్‌కు నివసించడానికి ఇల్లు దొరకలేదు. పెద్ద ఉద్యోగంలో ఉన్నప్పటికీ కార్యాలయంలోని చిన్న ఉద్యోగి అయినా ఆయనను తాకేవారు కాదు. తాగడానికి మంచినీరు కూడా ఇచ్చేవారు కాదు. కార్యాలయంలో ఆయనకు ఏవైనా కాగితాలు ఇవ్వాలన్నా చేతికి ఇవ్వకుండా ఆయన బల్ల మీదకు విసిరేవారు. ఇలాంటి వివక్షతో దుఃఖితుడైన అంబేద్కర్ ఆ ఉద్యోగాన్ని వదిలివేసాడు. వడోదర నుంచి బొంబాయి తిరిగి వచ్చేసాడు. 1918లో ఆయన బొంబాయిలో సిడన్హెమ్ కాలేజీలో ప్రాధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరాడు.
విద్వాంసుడైన ప్రొఫెసర్:
కళాశాలలోని చాలామంది అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నత వర్ణాలకు చెందినవారు ఉండేవారు. అస్పృశ్యుడైన ఈ ప్రొఫెసర్ పాఠాలు ఎలా చెబుతాడని వారు సందేహించారు. కానీ కొన్నిరోజుల్లోనే అంబేద్కర్ అందరికీ ఇష్టుడైన అధ్యాపకుడు అయిపోయాడు. వేరే కళాశాలల విద్యార్థులు కూడా చాలాసార్లు వచ్చి అంబేద్కర్ బోధిస్తున్న తరగతిలో కూర్చుని పాఠాలు వినేవారు. ఆయన పిల్లలకు నోట్స్ చెప్పాక వారు మరో పుస్తకం చదవాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ సిడన్హెమ్ కాలేజీలో కూడా అంటరానితనపు విషపూరిత వాతావరణం వ్యాపించింది. కొందరు ప్రొఫెసర్లు అంబేద్కర్ వాడిన గ్లాసుల్లో మంచినీళ్ళు తాగేవారు కాదు. ఇంత చదువుకున్నాక కూడా ఇంకా అస్పృశ్యత పాటిస్తున్నారంటే వారి చదువుకు అర్ధమేముంది అని అంబేద్కర్ బాధపడేవాడు.
బారిస్టర్‌గా అంబేద్కర్:
అంబేద్కర్ అర్ధశాస్త్రం, బారిస్టర్ చదవడానికి 1920లో లండన్ వెళ్ళాడు. అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని 1923లో తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఆయన భారతదేశాన్నే తన కార్యక్షేత్రంగా నిశ్చయించుకున్నాడు. ఇక్కడ సమాజంలో వ్యాపించి ఉన్న చెడు ఆచారాలను తుడిచిపెట్టేయాలని భావించాడు. ఆయనకు విదేశాల్లో ఏ లోటూ లేదు, కానీ బొంబాయి హైకోర్టులో వకీలుగా జీవితం ప్రారంభించాడు. అదే సంవత్సరం బొంబాయి విధానసభకు ఆయన ఎన్నికయ్యారు. లాయరుగా పనిచేసేటప్పుడు అంబేద్కర్‌కు అతిమామూలు పల్లెటూరి ప్రజలతో పరిచయాలు పెరిగాయి. కొద్దికాలంలోనే అంబేద్కర్ బొంబాయిలోని గొప్ప వకీళ్ళలో ఒకరిగా పేరు గడించాడు. అయినప్పటికీ అంటరానితనపు నీడ ఆయనను వదల్లేదు. మంచి న్యాయవాది అని భావించి తమ కేసులను అంబేద్కర్ దగ్గరకు తీసుకొచ్చే క్లయింట్లు, సంబంధిత కాగితాలను దూరం నుంచి ఎత్తి ఆయన చేతిలో వేసేవారు. అది ఆయన హృదయాన్ని మరింత గాయపరిచింది.
మూకనాయక్ పత్రిక స్థాపన:
అంబేద్కర్ తన ఆలోచనలను అందరికీ చేరువ చేయడానికి ఒక ప్రసారమాధ్యమం ఎంతైనా అవసరమని భావించాడు. ఒక పత్రిక ఉంటే దాని ద్వారా ఎలాంటి విషయాన్నయినా ప్రజలకు చేరువ చేయడం సులువని అర్ధం చేసుకున్నాడు. తాను ఇంగ్లండ్ వెళ్ళడానికి ముందే కొల్హాపూర్ మహారాజా సహాయంతో 1920 జనవరి 31న మూకనాయక్ పేరుతో పక్షపత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికకు ఆయన సంపాదకుడు కాదు కానీ మూకనాయక్ పత్రిక ద్వారా అంబేద్కర్ అస్పృశ్యులు, దళితులకు సంబంధించిన విషయాలను సమాజం ముందు ఉంచేవాడు. సమాజంలో చైతన్యం కలిగించే దిశగా అంబేద్కర్ వేసిన మొదటి అడుగు అది.
అందరినీ కలుపుకుని వెళ్ళే వ్యక్తిత్వం:
అతిమామూలు నిరుపేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ తన పరిశ్రమ, వ్యవహార దక్షత, ఉన్నత విద్య కారణంగా తన ప్రయాణంలో సహకారం అందించేవారిని ఎందరినో పొందాడు. వారిలో అత్యధికులు సవర్ణులే. అయినా వారు అంబేద్కర్ కఠోర శ్రమ, శ్రద్ధల వల్ల ప్రభావితులయ్యారు. అంబేద్కర్ సాధన వారి మనసులను గెలుచుకుంది. వారిలో ప్రధానమైనవారు మహారాజా గైక్వాడ్, గురువు కృష్ణ కేలుస్కర్, గురువు అంబేద్కర్, మిత్రులు భథేనా, శివతారకర్, ఛత్రపతి శాహూజీ మహరాజ్, ప్రొఫెసర్ ఇరాణీ, వేద విద్వాంసులు దేవరావు నాయక్ తదితరులు. వారిని తలచుకునే ప్రతీసారీ అంబేద్కర్ ఎంతో ఉద్వేగానికి లోనవుతుండేవాడు. వారి స్నేహాన్ని, సహాయాన్నీ ఆయన జీవితాంతం గుర్తు చేసుకుంటూనే ఉండేవాడు.
1925లో బొంబాయిలో బహిష్కృత హితకారిణీ సభ సమావేశం జరిగింది. ఆ సభలో అంబేద్కర్ మాట్లాడుతూ ‘‘అస్పృశ్యుల ఉద్ధరణ కేవలం వారి బలంతో మాత్రమే జరగదు. సమాజం అంతటినీ తోడు తీసుకుని ముందడుగు వేయాలి’’ అన్నాడు. మొత్తం హిందూ సమాజం ఒక్కమాటగా కదలాలి, కలిసి అడుగులు వేయాలి. ఆ సమాజంలో వ్యాపించిన దుర్నీతులు తొలగిపోవాలి. దానికోసమే అంబేద్కర్ తన జీవితాంతం ప్రయత్నించాడు.
‘‘హిందూ సమాజానికి నేను ఎంత మేలు చేసానన్న విషయం నేను చనిపోయాక మొత్తం హిందూ సమాజం తెలుసుకుంటుంది’’ అని అంబేద్కర్ ఒక సందర్భంలో చెప్పాడు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి