అధ్యాయం 2: అంబేద్కర్ జీవిత ప్రస్థానం – 2
ఉపాధ్యాయుల స్నేహ సహకారాలు:
ఇలాంటి అస్పృశ్యతా భావాలు వ్యాపించి ఉన్న హిందూ సమాజంలోనే అస్పృశ్యతను పాటించని హిందువులు కూడా చాలామంది ఉండేవారు. దీనులు, నిరుపేదలు అయిన పిల్లలకు స్నేహహస్తం అందించే వారు. వారికి జీవితంలో పైకి రావడానికి తగిన ప్రోత్సాహం ఇచ్చేవారు. అలాంటి గురువుల స్నేహం భీమరావుకు లభించింది.
ఒకసారి భీమరావు వానలో తడుచుకుంటూ వేగంగా బడికి చేరుకున్నాడు. ఆ పాఠశాలలో పెండ్సే అనే పేరు గల బ్రాహ్మణ ఉపాధ్యాయుడు ఉండేవాడు. చదువు పట్ల భీమరావు ఆసక్తి ఆయనను మంత్రముగ్ధుణ్ణి చేసింది. భీమరావును వెంటనే తన ఇంటికి పంపించాడు. అక్కడ వేణ్ణీళ్ళతో స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేసాడు. తర్వాత కట్టుకునేందుకు తమ ఇంట్లోని దుస్తులు కూడా ఇచ్చాడు. భీమరావు ఆ దుస్తులే ధరించి బడికి వెళ్ళాడు. ఆ సంఘటన బాల భీమరావు మనసులో బాగా ముద్రపడిపోయింది.
భీమరావు పేరు మొదట్లో తమ గ్రామం అంబవాడ పేరిట భీమరావు అంబవాడేకర్ అని ఉండేది. సతారాలో మాధ్యమిక పాఠశాలలో చదువుకునేటప్పుడు అక్కడ అంబేద్కర్ అనే సనాతనవాది అయిన ఛాందస బ్రాహ్మణుడు ఒకాయన ఉపాధ్యాయుడుగా ఉండేవాడు. ఆయన భీమరావుతో చాలా స్నేహంగా ఉండేవాడు. ప్రతీరోజూ భీమరావుకు ఆహారం పెడుతుండేవాడు. తన భోజనాన్నే భీమరావుకు కూడా పంచేవాడు. వీలైనంత వరకూ తన దగ్గరే కూచోబెట్టుకుని ఇద్దరూ కలిసి భోజనం చేసేవారు. ‘‘ఆయన ప్రేమగా పెట్టే రొట్టెలు-కూర రుచి అమృతంలా ఉండేదని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నాను. ఆ విషయం తలచుకున్నప్పుడల్లా నా హృదయం ఆర్ద్రమైపోతుంది. ఆయనకు నా పట్ల నిజంగా ఎంతో ప్రేమ ఉండేది’’ అని అంబేద్కర్ తర్వాతి రోజుల్లో చెప్పారు.
భీమరావు లండన్‌లో జరిగిన గోల్మేజ్ సభలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఉపాధ్యాయుడే శుభాకాంక్షలు చెబుతూ ఉత్తరం రాసారు. ఆ ఉత్తరాన్ని చూసి భీమ్ ఎంతో ఆనందించాడు. తన జీవితం మీద అమితమైన ప్రభావం చూపిన ఆ ఉపాధ్యాయుడి పేరును భీమరావు తన పేరులో స్వీకరించాడు. నాటినుంచీ భీమరావు అంబవాడేకర్, భీమరావు అంబేద్కర్ అయాడు. (ధనుంజయ్ కీర్ రాసిన డాక్టర్ అంబేద్కర్ : లైఫ్ అండ్ మిషన్ పుస్తకం నుంచి)
సంస్కృతమంటే అభిమానం:
భీమరావు తండ్రి రాంజీ సక్పాల్ గొప్ప ఆలోచనలున్న వ్యక్తి. మనుషులందరూ దేవుని సంతానమే, కాబట్టి అందరూ సమానమే అని ఆయన భావించేవారు. కొడుకు ఉన్నత విద్య కోసం ఆయన బొంబాయి చేరుకున్నారు. అక్కడ భీమరావు ఎల్ఫిన్స్టన్ కళాశాలలో చేరాడు. హైస్కూలులో భీమరావుకు సంస్కృతం చదువుకోవాలని ఉండేది, కానీ సాధ్యం కాలేదు. హిందువులు కాని విదేశీయులు సైతం సంస్కృతం చదువుకోగలిగేవారు కానీ హిందువులు అయినప్పటికీ మహర్ కులానికి చెందినవారు కావడంతో భీమరావు సంస్కృతం చదువుకోలేకపోయాడు. ఆ బాధ అతని మనసులో ముల్లులా గుచ్చుతూనే ఉండేది.
‘‘నాకు సంస్కృతమంటే చాలా అభిమానం. సంస్కృత భాషలో గొప్ప పండితుణ్ణి కావాలి అనుకునేవాణ్ణి, కానీ ఉపాధ్యాయుల సంకుచిత దృష్టికోణం వల్ల నేను ఆ భాషకు దూరమయ్యాను’’ అని అంబేద్కర్ స్వయంగా చెప్పారు. తర్వాతి కాలంలో భీమరావు ఎంతో శ్రమకోర్చి సంస్కృతభాష నేర్చుకున్నారు, ఆ భాషలో పాండిత్యం సంపాదించారు.
ఉన్నత విద్య సంకల్పం నెరవేరింది:
బొంబాయి జీవితం చాలా కష్టంగా ఉండేది. అక్కడి పాఠశాలలోని శ్రీ కృష్ణ కేలుస్కర్ అనే ఉపాధ్యాయుడి దృష్టిలో పడ్డాడు అంబేద్కర్. నిమ్నవర్ణానికి చెందిన పిల్లవాడిలో చదువుకోవాలన్న తీవ్రమైన కోరిక ఉండడం ఆయనను ముగ్ధుణ్ణి చేసింది. ఆయన అంబేద్కర్‌కు వీలున్నప్పుడల్లా సాయం చేసారు. కావలసిన పుస్తకాలు కొనిపెట్టారు. గౌతమబుద్ధుడి గురించి అంబేద్కర్ చదివిన మొదటి పుస్తకం ఆయన ఇఛ్చిందే. కేలుస్కర్ ఒకసారి భీమరావు తండ్రి రాంజీ సుబేదార్‌ను పిలిచి, పిల్లవాడిని పైచదువులు చదివించడానికి ఏమాత్రం వెనుకాడవద్దు, అవసరమైతే నేను సహాయం చేస్తాను అని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకున్నారు కూడా. భీమరావుకు అవసరమైన ప్రతీసారీ ఆయన తన శక్తిమేరకు సహాయం చేసారు.
కష్టాల్లోనూ చదువు కొనసాగించాడు:
పేదరికం వల్ల ఒక చిన్న గదిలో మకాము. అన్నం వండుకు తినడం, చదువు, నిద్ర… అన్ని పనులూ ఆ గదిలోనే. ఆ గదిలో ఇద్దరు మనుషులు ఒకసారి పడుకోడానికి అవకాశం ఉండేది కాదు. భీమరావు చదుకునేంత సేపూ తండ్రి నిద్రపోయేవారు. రాత్రి 2 గంటల సమయంలో భీమరావు పడుకునేటప్పుడు తండ్రి నిద్ర లేచేవారు. కిరసనాయిలు దీపం వెలుగులో భీమరావు రాత్రంతా మెలకువగా ఉండి చదువుకునేవాడు. ఆ సమస్యలేవీ భీమరావు మార్గంలో సవాళ్ళుగా నిలిచాయి తప్ప ఏనాడూ ఆటంకాలు కాలేకపోయాయి.
1908లో భీమరావు ఎల్ఫిన్స్టన్ కాలేజీ నుంచి మెట్రిక్యులేషన్ పాస్ అయ్యాడు. 1910లో ఇంటర్మీడియెట్, 1912లో బీఏ పూర్తిచేసాడు. బీఏ పూర్తయిన భీమరావు అంబేద్కర్‌కు వడోదర మహారాజు సయాజీరావు గైక్వాడ్ ఘనస్వాగతం పలికాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత డిగ్రీ చదవడానికి ఆయన అంబేద్కర్‌కు నెలకు 25 రూపాయల ఉపకారవేతనం ఇచ్చాడు. భీమరావు జీవితం ముందుకు సాగడంలో వీరిద్దరి సహకారం మాటలకు అందనిది.
అమెరికా జీవితం:
అమెరికా న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్‌కు సీటు దొరికింది. అక్కడ ఆయన ఎక్కువ సమయం గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడంలోనే గడిపేవాడు. రోజులో 16గంటలు చదువుకే కేటాయించేవాడు. మిగతా పనులన్నీ మిగిలిన సమయంలో చేసుకునేవాడు. 1916లో అంబేద్కర్ పీహెచ్డీ పూర్తిచేసాడు. కానీ ధనాభావం వల్ల తన పరిశోధన ప్రతిని ప్రచురించలేకపోయాడు. ఆ ప్రతిని 1923లో ప్రచురించాడు. ఇప్పుడు అంబేద్కర్ పూర్తిస్థాయిలో డాక్టరేట్ పట్టా పొందాడు. దానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం ఊహించుకోవలసిందే.
(సశేషం)