అధ్యాయం 1: అంబేద్కర్ జీవిత ప్రస్థానం – 1
మధ్యప్రదేశ్లోని ఇందోర్ క్షేత్రంలో మహు ఓ చిన్న పల్లెటూరు. 1891 ఏప్రిల్ 14న ఆ గ్రామంలో ఓ బాలుడు జన్మించాడు. అతని కారణంగా తన పేరు చరిత్ర పుటల్లోకెక్కుతుందని ఆ ఊరికి తెలియదు. అతనే భీమారావు. అతని తల్లి పేరు భీమాబాయి, తండ్రిపేరు రాంజీ సక్పాల్. వారు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబావాడే గ్రామ నివాసులు. మహర్ కులానికి చెందిన వారు. కడుపేదవారే కానీ ధార్మికమైన ప్రవృత్తి కలిగిన వారు. పిల్లాడికి తల్లి పేరునే మీద భీమ్ అని పేరు పెట్టారు. ఆ దంపతులకు అతను 14వ సంతానం కావడంతో, బంధువులు స్నేహితులూ అతన్ని తన తండ్రికి 14వ రత్నం అని ప్రేమగా పిలిచేవారు.
భీమ్ పుట్టిన మూడేళ్ళ తర్వాత, అంటే 1894లో తండ్రికి సైన్యంలో సుబేదార్ ఉద్యోగం పోయింది. నెలనెలా వచ్చే పింఛను కుటుంబపోషణకు ఏ మూలకూ సరిపోయేది కాదు. అలాంటి సమయంలో సతారాలో స్టోర్ కీపర్ ఉద్యోగం దొరికింది. దాంతో రాంజీ సక్పాల్ కుటుంబం మొత్తం సతారాకు వెళ్లిపోయారు. అక్కడ ఉన్నప్పుడే రాంజీ సక్పాల్కు గోరే గ్రామానికి బదిలీ అయింది. కానీ భీమాబాయి ఇద్దరు కొడుకులతో సతారాలోనే ఉండిపోయింది.
కొద్దికాలానికి ఆమె అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పుడు భీమ్ వయస్సు ఐదేళ్ళు మాత్రమే. 1913లో తండ్రి కూడా తుదిశ్వాస విడిచాడు. ఇంక భీమ్ ఆవేదనకు అంతే లేకుండా పోయింది.
అంబేద్కర్ మొదటి గురువు, ధార్మిక ప్రవృత్తి కలిగిన తండ్రే:
అంబేద్కర్ తండ్రి రాంజీ సక్పాల్ చాలా కష్టజీవి. అలాగే ధార్మిక ప్రవృత్తి పట్ల అమితమైన మక్కువ కలిగినవారు, సహృదయశీలి. రోజూ ఉదయమూ సాయంత్రమూ భగవదారాధన చేయడం, భక్తిగీతాలు ఆలపించడం అంటే ఆయనకు చాలా ఇష్టం. తన పిల్లలు అందరినీ కూర్చోబెట్టుకుని భక్తి పాటలు పాడుతుండేవారు. పిల్లలకు రామాయణం, భారతం చదివి వినిపించేవారు. పిల్లల్లో సద్బుద్ధి పెంచేందుకు ప్రయత్నించేవారు. రాత్రి చీకట్లో మెల్లమెల్లగా భజన గీతాలు ఆలపించేవారు. స్వయంగా ఆయన మద్య మాంసాలకు దూరంగా ఉండేవాడు. ఆ మంచి అలవాట్ల ప్రభావం వల్లనే అంబేద్కర్ జీవితాంతం మద్యానికి దూరంగా ఉన్నాడు.
బాల్యంలోనే అస్పృశ్యత వల్ల అవమానాలు:
భీమరావ్ అంబేద్కర్ చిన్నతనం నుంచే చాలా తెలివైన వాడు, శ్రద్ధగా చదువుకునేవాడు. అతనికి పుస్తకాలంటే అమితమైన ఆసక్తి. గ్రామంలోని పాఠశాలలో భీమరావు, అతని సోదరుడు ఆనంద్ ఇద్దరినీ మిగతా విద్యార్ధుల నుంచి దూరంగా కూర్చోబెట్టేవారు. దాహం వేస్తే తన చేతులతో మంచినీరు తీసుకుని తాగే అవకాశం కూడా ఉండేది కాదు. ఎవరో ఒకరు నీళ్ళు పోస్తే తాగాల్సి వచ్చేది. ఆ రోజుల్లో అస్పృశ్యత అంతలా ఉండేది.
భీమరావు 1900 సంవత్సరంలో సతారాలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చేరారు. అన్నదమ్ములిద్దరూ బడికి నడుచుకునే వెళ్ళేవారు. బడి ఇంటికి కొంచెం దూరంగానే ఉండేది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ బడి నుంచి వచ్చే సమయంలో ఒక ఎద్దుల బండి ఎక్కారు. కాసేపటికి బండి నడిపేవాడికి ఆ పిల్లలిద్దరూ మహర్ కులానికి చెందినవారు అని తెలిసింది. వెంటనే వారిద్దరినీ నానాతిట్లూ తిట్టి బండి దింపేసాడు. ఒకసారి బావిలో నీరు తోడుకుని తాగుతుంటే గ్రామస్తులు చూసి, అంటరానివారు బావిని ఎలా ముట్టుకుంటారని కోపంతో చితక్కొట్టారు.
భీమరావు ఒకసారి బడి నుంచి ఇంటికి వెడుతుంటే ఉన్నట్టుండి భారీ వర్షం మొదలైంది. దాన్నుంచి తప్పించుకోడానికి, ఓ ఇంటి వరండాలో నిలబడ్డాడు. ఆ ఇంటి యజమాని అతన్ని చూసి కోపగించుకుని ఆ వానలోనే ఆ పిల్లవాణ్ణి తోసేసాడు. భీమరావు బురదలో పడ్డాడు. అతని దుస్తులు, పుస్తకాలూ అన్నీ తడిసిపోయాయి. ఆ సంఘటన భీమ్ మనసులో బలమైన ముద్ర వేసింది. సమాజంలో వ్యాపించి ఉన్న అస్పృశ్యత అనే దురాచారం అతని చిన్నారి మనసును గాయపరిచింది. మనకెందుకు ఇలా జరుగుతోంది? సవర్ణుల పద్ధతి ఎప్పుడు బాగుపడుతుంది? చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలూ కేవలం సవర్ణుల సొత్తా? అనే ప్రశ్నలు చుట్టుముట్టేవి. లేదు, మనం కూడా వారిలాంటి మనుషులమే. మనం కూడా చదువుకోగలం. మనకూ అర్హత, యోగ్యత ఉన్నాయి. మనం కూడా సవర్ణులతో సమానంగా చదువుకుంటాం… అని తనకు తనే జవాబు చెప్పుకున్నాడు. క్రమం తప్పకుండా బడికి వెళ్ళాల్సిందే అని నిశ్చయించుకున్నాడు.
(సశేషం)