ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినెవా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గతవారం తమ కుమారుడికి ప్రాణాపాయం తప్పడానికి దైవకృపే కారణమనే విశ్వాసంతో అన్నా లెజినోవా తిరుపతి వెంకన్నకు మొక్కు చెల్లించుకున్నారు.
కొద్దిరోజుల క్రితం సింగపూర్‌లో ఓ పాఠశాలకు చెందిన భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సంఘటనలో గాయపడిన పిల్లల్లో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. అదృష్టవశాత్తు ఆ పిల్లవాడు చిన్నచిన్న గాయాలతో బైటపడగలిగాడు. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్ళారు. చిన్నారిని తీసుకుని శనివారం అర్ధరాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. ఆ ప్రమాదం నుంచి తమ బిడ్డ బైటపడడానికి దైవ కృపే కారణం అని భావించిన అన్నా లెజినెవా తిరుమత వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకోడానికి ఆదివారం రాత్రికి తిరుమలకు చేరుకున్నారు.
మతం రీత్యా క్రైస్తవురాలైన అన్నా లెజినెవా, టీటీడీ నిబంధనలు అనుసరిస్తూ గాయత్రీ సదనంలో అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.
అనంతరం శ్రీ వరాహ స్వామిని దర్శించుకున్నారు. అక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తరువాత పద్మావతి కళ్యాణకట్ట వద్ద తోటి భక్తులతో పాటు వేంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించారు.
ఇవాళ సోమవారం వేకువజామున అన్నా లెజినెవా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆమెకు పండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత స్వామి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం ఉదయం 10 గంటల సమయంలో అన్నా లెజినెవా, ఆలయం చేరువలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. తమ కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షలు విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. తరువాత నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.
అనంతరం భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి