విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సంస్థ, తెలుగు వారికి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌గా చిర పరిచితమైన ఉక్కు కర్మాగారం పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాక కాస్త మెరుగుపడింది. ఆ వివరాలను కేంద్ర ఉక్కు శాఖ తాజాగా విడుదల చేసిన 2024-25 వార్షిక నివేదిక వెల్లడించింది. గత అక్టోబరు నుంచి రెండో బ్లాస్ట్‌ఫర్నేస్ మొదలు పెట్టాక సంస్థ ఉత్పత్తి సామర్థ్యం సగటున రోజుకు 13,485 టన్నులకు పెరిగింది. ప్రస్తుతం రెండు ఫర్నేస్‌లు 98% ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. హై ఎండ్ విలువ గల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని, దానికి సంబంధించి దేశీయ మార్కెట్‌లో తన వాటాను పెంచుకుంది.
ప్యాకేజీకి ముందు ఆర్థిక పరిస్థితి:
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించక ముందు ఆర్థిక సంక్షోభం కారణంగా ఉక్కు కర్మాగారం పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయలేదు. దానివల్ల సంస్థ అమ్మకాల టర్నోవర్ 2024-25 డిసెంబరు నాటికి రూ.12 వేల కోట్లకే పరిమితమైంది. దానివల్ల నష్టాలు రూ.3,943 కోట్లకు చేరాయి. ఆ ఏడాదిలో సంస్థలోని ఉద్యోగుల సంఖ్య 1,198 మేర తగ్గింది. సంస్థలో ఉద్యోగుల సంఖ్య 2024 మార్చి 31 నాటికి 13,536 ఉండగా, డిసెంబరు 31నాటికి 12,338కి తగ్గింది. కంపెనీ అధీకృత వాటాలు 2024 మార్చి 31 నాటికి రూ.8 వేల కోట్ల మేర ఉండగా, 2024 డిసెంబరు 31 నాటికి రూ.15 వేల కోట్లకు పెరిగాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో నిధుల కొరత, ఆర్థిక సంక్షోభం కారణంగా కర్మాగారం పూర్తిస్థాయి సామర్థ్యంతో పని చేయలేదు. దానివల్ల అమ్మకాలు 2024 డిసెంబరు 31 నాటికి రూ.12,429 కోట్లకు పడిపోయాయి. రూ.3,943.43 కోట్ల మేర నికర నష్టం వాటిల్లింది.
రెండో బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటుతో….:
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఊపిరి పోసింది. 2024 అక్టోబరు 28 నుంచి రెండో బ్లాస్ట్ ఫర్నేస్‌ను మళ్ళీ మొదలు పెట్టారు. దాంతో రోజుకు సగటున 13,485 టన్నుల ఉత్పత్తి సాధ్యమైంది. రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు 98% ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకున్నాయి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనుకున్న సమయానికి ముందే రెండవ బ్లాస్ట్ ఫర్నేస్‌ను ప్రారంభించగలిగింది. అంతేకాదు, 2024 డిసెంబరులో అంతకు ముందరి ఉత్పత్తి సామర్థ్యాన్ని అధిగమించింది. రెండు ఫర్నేస్‌ల ద్వారా రోజుకు 13 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ నిర్దేశిత లక్ష్యం కంటే 3.7% అదనంగా ఉత్పత్తి సాధించగలిగింది. అంతే కాదు, బొగ్గులో హార్డ్ కోకింగ్ కోల్ వినియోగం 57.5% నుంచి 53.4%కి తగ్గింది.
మార్కెటింగ్ బలోపేతం:
మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ తమ మార్కెట్ అవకాశాలను విస్తృతం చేసుకోవడానికి డిస్ట్రిబ్యూషన్ విధానాన్ని పునర్‌వ్యవస్థీకరించింది. ఇతర ఉత్పత్తి సంస్థల మాదిరిగానే టీఎంటీ, స్ట్రక్చరల్ ఉత్పత్తుల విక్రయాల కోసం డిస్ట్రిబ్యూటర్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఏ మారుమూల ప్రాంతాలకైనా తన ఉత్పత్తులను పంపేందుకు వీలుగా ఇ-సువిధ పోర్టల్‌ను ప్రారంభించింది. వినియోగదారుల ఇంటి వద్దకే సేవలు అందించేందుకు సిద్ధమైంది. 2023-24లో సంస్థకు రూ.5,218.46 కోట్ల నష్టం వాటిల్లింది. గత నాలుగేళ్లలో ఇదే అత్యధికం.
ఉత్పాదక సామర్థ్యం:
2024 డిసెంబరు నాటికి విశాఖ స్టీల్ ప్లాంట్ హై ఎండ్ విలువ ఉన్న ఉక్కు ఉత్పత్తిని 12.96 లక్షల టన్నుల నుంచి 13.28 లక్షల టన్నులకు పెంచింది. విక్రయించడానికి అనువైన 23.73 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయగలిగింది. గోదాముల్లో పడి ఉన్న 30 వేల టన్నుల ఉక్కును విక్రయించింది. దేశీయ ఉక్కు విక్రయాల్లో 2023-24లో ఉన్న 57% వాటాను 63%కి పెంచుకుంది. హై ఎండ్ విలువగల స్టీల్ విక్రయాల్లో తన వాటాను 31% నుంచి 35%కి పెంచగలిగింది. మొత్తం విక్రయాల్లో నేరుగా పంపిణీ చేసే పరిమాణం 2023-24లో 30% ఉండగా, 2024-25 నాటికి అది 42%కి పెరిగింది. 95,200 మెట్రిక్ టన్నుల ఇనుము, ఉక్కు తుక్కు విక్రయం ద్వారా రూ.336 కోట్ల అదనపు రాబడి సాధించింది.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి