భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో డీఆర్డీఓ మరో ముందడుగు వేసింది. శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, ఇతర చిన్నపాటి ఆయుధాలను క్షణాల్లో నేలకూల్చగల లేజర్ వ్యవస్థను పరీక్షించింది. ఆ ప్రయోగం కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో ఆదివారం విజయవంతం అయింది.
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – డీఆర్డీఓ సంస్థలోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (సిహెచ్ఇఎస్ఎస్ – చెస్) విభాగం ఈ లేజర్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఎంకె 2ఎ డీఈడబ్ల్యూ అని పేరు పెట్టిన ఈ లేజర్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో డీఆర్డీఓలోని మరికొన్ని ఇతర ప్రయోగశాలలు, విద్యాసంస్థలు, పరిశ్రమలూ భాగస్వాములయ్యాయి. తాజాగా కర్నూలులో నిర్వహించిన పరీక్షలో ఎంకె 2ఎ తన పూర్తి సామర్థ్యాన్ని చాటిందని డిఆర్‌డిఒ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఎంకె 2ఎను డిఆర్డిఓ శాస్త్రవేత్తలు రకరకాలుగా పరీక్షించారు. చాలా దూరంలో నిలకడగా ఉన్న వింగ్ డ్రోన్లను నేల కూల్చింది. ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు ఒకేసారి దాడి చేసినప్పుడు సైతం వాటిని సమర్ధంగా తిప్పికొట్టింది. శత్రువుల నిఘా సెన్సర్లు, యాంటెన్నాలను ధ్వంసం చేసింది. లక్ష్యాలపై కొన్ని సెకన్లలోనే శరవేగంగా విరుచుకు పడగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు నిరూపించుకుంది… అని డీఆర్డీఓ తమ ప్రకటనలో వివరించింది.
ఈ ప్రయోగం విజయం ద్వారా హై పవర్ లేజర్ డీఈడబ్ల్యూ సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసారు. ‘‘నాకు తెలిసినంత వరకూ ఈ సామర్థ్యం యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా దేశాలకు మాత్రమే ఉంది. ఇజ్రాయెల్ కూడా ఇలాంటి సాంకేతికత కోసం ప్రయోగాలు చేస్తోంది. ఈ వ్యవస్థను రూపొందించి, ప్రయోగించిన దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలోనే నాలుగు లేదా ఐదో స్థానంలో ఉందని చెప్పగలను’’ అని డీఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ వెల్లడించారు.
భవిష్యత్ యుద్ధరంగాలు శాస్త్ర సాంకేతికతల సమన్వయంగా ఉండబోతున్నాయి. ఆ క్రమంలో భారత రక్షణ వ్యవస్థను సంసిద్ధం చేసేందుకు డీఆర్డీఓ ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. ‘‘ఇది ఒక మహా ప్రయాణానికి ప్రారంభం మాత్రమే. మా లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోగలమని కచ్చితంగా చెప్పగలను. హై ఎనర్జీ మైక్రోవేవ్స్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ వంటి ఇతర హై ఎనర్జీ సిస్టమ్స్ గురించి కూడా మేము పనిచేస్తున్నాం. అలా మేము రకరకాల టెక్నాలజీల గురించి పరిశోధనలు చేస్తున్నాము. అవి మనకు స్టార్‌వార్స్ సామర్థ్యాన్ని ఇవ్వగలవు. ఇప్పుడు మీరు చూసింది స్టార్‌వార్స్ టెక్నాలజీలకు సంబంధించిన ఒక భాగం మాత్రమే’’ అని సమీర్ కామత్ వివరించారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్