అమరావతి రాజధానికి మరోసారి భూమి సమీకరించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే అమరావతి రాజధాని గ్రామాలకు ఆనుకుని ఉన్న పెదపరిమి, హరిశ్చంద్రాపురం, మోతడక గ్రామాల రైతులు తమ భూములు కూడా రాజధానికి తీసుకోవాలని పురపాలక మంత్రి నారాయణకు వినతులు ఇచ్చారు. రాజధాని అవసరాలకు ఇప్పటికే సేకరించిన 35 వేల ఎకరాలు చాలకపోవడంతో పలు ప్రతిష్ఠాత్మక సంస్థలకు భూ కేటాయింపులు చేయలేకపోతున్నారు. దీంతో మరో 42 వేల ఎకరాల భూమి సమీకరించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.
అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే విద్య,వైద్య, పర్యాటక, పరిశోధనా సంస్థలకు భూ కేటాయింపులు సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం వద్ద కేవలం 2 వేల ఎకరాలు మాత్రమే ఉండటం… అందులో 1500 ఎకరాలకు సంబంధించిన కేసు హైకోర్టులో ఉండటంతో భూ కేటాయింపులు నిలిచిపోయాయి. బిట్స్, ఎక్స్‌ఎల్‌ఆర్ సంస్థలు ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు పెట్టేందుకు ముందుకు వచ్చినా ప్రభుత్వం భూమి కేటాయించలేకపోతోంది. దీంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అమరావతి సమీప గ్రామాలతోపాటు, అవుటర్, ఇన్నర్ రింగు రోడ్డు సమీప గ్రామాల్లోనూ ప్రభుత్వం భూసమీకరణ చేసే అవకాశముంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులతోపాటు, అంతర్జాతీయ విమానాశ్రయానికి 5 వేల ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఇన్నర్ రింగు రోడ్డుకు 1300 ఎకరాలు, అవుటర్ రింగు రోడ్డుకు 3 వేల ఎకరాల భూమి సమీకరించాల్సి ఉంది. ప్రభుత్వ అవసరాల కోసమే దాదాపు 8 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇక ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున భూమి అవసరం ఉంది.
తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి, అమరావతి మండలాలతోపాటు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చే గ్రామాల్లో భూసమీకరణ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రైతులు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చిన గ్రామాల్లో ముందుగా భూసమీకరణ చేయనున్నారు. ఆ తరవాత ఇన్నర్, అవుటర్ రింగు రోడ్లకు భూసేకరణ చేయనున్నారు. ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించేందుకు కనీసం 42 వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందని అంచనా. ఇందుకు అనుగుణంగా మరోసారి భూసమీకరణకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి