106 సంవత్సరాల క్రితం 13 ఏప్రిల్ 1919న పంజాబ్ అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన శాంతియుత సమావేశం భారతదేశ చరిత్రలో అత్యంత బాధాకరమైన, విషాదకరమైన రోజులలో ఒకటిగా నిలిచింది. ఓ వేసవి మధ్యాహ్నం వైశాఖి పండుగ దగ్గర పడుతున్న వేళ, బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు జరుపుకోవడం ఎలా అన్న విషయమై చర్చలు జరుపుకోడానికి వేలాది మంది సామాన్య పురుషులు, మహిళలు, పిల్లలు తోట దగ్గర చేరుకున్నారు.
ఆ సమయంలో ఎలాంటి హెచ్చరికా లేకుండా, బ్రిటిష్ సైనికాధికారి జనరల్ రెజినాల్డ్ డయ్యర్ సాయుధ సైనికులతో ఆ ప్రాంతంలోకి చొరబడ్డాడు. జలియన్‌వాలా బాగ్‌కు ఉన్న ఒకేఒక ద్వారాన్ని అతను మూసివేసాడు. నిరాయుధులుగా ఉన్న జన సమూహం మీదకు కాల్పులు జరపాలంటూ క్రూరమైన ఆజ్ఞ జారీ చేసాడు. నిజానికి అక్కడున్న ప్రజలు ఎవరి వద్దా ఆయుధాలు లేవు, హింసకు ప్రణాళికలు లేవు. వారి వద్ద కేవలం మాటలు మాత్రమే ఉన్నాయి. అయినా, బ్రిటిష్ సైనికులు పది నిమిషాల పాటు కాల్పులు జరిపారు. తమ దగ్గరున్న బులెట్లు అయిపోయే వరకు వారు ఆగలేదు.
అది కడు హృదయ విదారకమైన దృశ్యం. పడిపోయిన తల్లులను పట్టుకుని పిల్లలు కేకలు వేశారు. పెద్దలు తమ కుటుంబాలను రక్షించుకోవడానికి ప్రయత్నించారు కానీ వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చివేసారు. తెల్లవాడి తూటాల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది ప్రజలు పరుగులు తీసారు, మరికొందరు బాగ్‌లో ఉన్న బావిలో దూకారు, ఇంకొంతమంది తప్పించుకోవడానికి నేలపై పడుకున్నారు. కానీ వారెవరూ దాక్కోవడానికి అక్కడెక్కడా చోటు లేనే లేదు. ఆ పది నిమిషాల కాల్పుల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది గాయపడ్డారు. అది దారుణమైన, క్రూరమైన ఏకపక్ష దాడి. నిరాయుధులైన సామాన్య ప్రజలను ఉగ్రవాదులుగా చిత్రీకరించి కాల్చి చంపి పారేసిన జనరల్ డయ్యర్‌కు, తన దుర్మార్గమైన చర్య విషయంలో ఎన్నడూ ఎలాంటి అపరాధ భావనా కలగలేదు. అతను తన చర్యలను గర్వంగా ప్రకటించుకున్నాడు, చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోయిన జలియన్‌వాలా బాగ్ ఘాతుకం గురించి జనరల్ డయ్యర్ ఏనాడూ ఎలాంటి విచారమూ వ్యక్తం చేయలేదు.
ఆ రోజు భారతదేశపు హృదయం రక్తమోడింది. అది కేవలం ఊచకోత కాదు. భారతీయుల ప్రాణాలంటే తమకు ఏమాత్రం పట్టింపు లేదని బ్రిటిష్ వారు ప్రకటించిన సందేశం. అయితే ఆ సందేశం భారతదేశపు స్ఫూర్తిని దెబ్బ తీయడానికి బదులు, దేశం అంతటినీ బలోపేతం చేసింది. ఆ బాధ మరింత ధైర్యాన్ని పుట్టించింది. భారతీయులు జలియన్‌వాలా బాగ్ దురంతాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని, స్వేచ్ఛా స్వతంత్రాల కోసం మరింత శ్రమించి పోరాడాలని నిర్ణయించుకున్నారు.
తెల్ల దొరతనం జలియన్‌వాలా బాగ్‌లో భారతీయులను కాల్చి చంపిన దుర్మార్గం జరిగి శతాబ్దానికి పైగా కాలం గడిచిపోయింది. అయినా బ్రిటిష్ ప్రభుత్వం ఆ భయంకరమైన చర్యకు ఇప్పటివరకూ భారతదేశానికి అధికారికంగా క్షమాపణ చెప్పలేదు. 2019లో అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి తెరెసా మే జలియన్‌వాలా బాగ్ ఊచకోతను “సిగ్గుచేటు మచ్చ” అని పిలిచారు. కానీ ఆమె మాటలు విస్పష్టమైన క్షమాపణ కాదు. అవి కేవలం లాంఛనప్రాయంగా, మొక్కుబడి తీర్చుకోడానికా అన్నట్లు మాట్లాడిన పెదవి చివరి మాటలు. అంతే తప్ప హృదయపూర్వక అపరాధ వ్యక్తీకరణ కాదు.
జలియన్‌వాలా బాగ్ దురంతం గురించి యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటులో బాబ్ బ్లాక్‌మన్, వీరేంద్ర శర్మ, తన్మన్జీత్ సింగ్ ధేసీ, సీమా మల్హోత్రా, క్లైవ్ లూయిస్ వంటి చాలామంది బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు అమెరికా పార్లమెంటులో తమ గళాన్ని వినిపించారు. జలియన్‌వాలాబాగ్ మారణకాండకు క్షమాపణ చెప్పాలని వారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని స్పష్టంగా కోరారు. కానీ వారి విజ్ఞప్తులను బ్రిటిష్ ప్రభుత్వం ఏనాడూ తీవ్రంగా పరిగణించలేదు.
బ్రిటిష్ రాజకుటుంబ సభ్యులు కూడా భారతదేశంలోని జలియన్‌వాలాబాగ్‌ను సందర్శించారు. కానీ మౌఖికంగా క్షమాపణలు చెప్పే బదులు, వారు ప్రతీకాత్మకంగా విచారం మాత్రమే ప్రకటించారు. వారు మర్యాదపూర్వకంగా వంగి, పుష్పగుచ్ఛాలు అందించారు. అంతే తప్ప వారు క్షమాపణ చెప్పలేదు. వారి సంకేతాలు మర్యాదపూర్వకంగా కనిపించవచ్చు, కానీ విధి వికటించిన ఆరోజున మరణించిన వారి కుటుంబాలకు అవి శాంతిని కలిగించవు.
ఇంగ్లండ్ ప్రభుత్వం పాటిస్తున్న ఆ భయంకరమైన నిశ్శబ్దం మరింత తీవ్రమైన, అసౌకర్యమైన ప్రశ్నలనూ తెర ముందుకు తీసుకొచ్చింది. అసలు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి క్షమాపణ చెప్పడానికి ఎందుకు భయపడుతోంది? ఆ చర్య ప్రపంచానికీ, బాధితుల కుటుంబాలకూ ఎలాంటి సందేశాన్ని పంపిస్తోంది? వారు ఇప్పటికీ తమ చీకటి గతాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారా లేక అసలు అలాంటి ఊచకోతే జరగనట్లు వ్యవహరిస్తున్నారా?
వారి సంగతి ఏమో కానీ భారతదేశమూ, భారతదేశ ప్రజలూ జలియన్‌వాలా బాగ్ ఘాతుకాన్ని ఏ ఒక్కరోజూ కూడా మరచిపోలేదు. జలియన్‌వాలాబాగ్ జ్ఞాపకాలు ఒక తరం నుండి మరొక తరానికి సాగుతాయి. బాధితుల ధైర్యం, హంతకుల క్రూరత్వం రెండూ గుర్తుండిపోతాయి. కానీ అసలు ప్రశ్న ఇంకా అలాగే మిగిలుంది… మరణించిన వారి కుటుంబాలు సరళమైన, నిజాయితీతో కూడిన క్షమాపణ కోసం ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి?