పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం మద్యం తాగి మోటార్‌సైకిల్‌పై వేగంగా ప్రయాణం చేయడమే అని పోలీసులు విస్పష్టంగా ప్రకటించారు. అయితే, పాస్టర్ ప్రవీణ్‌ను కొంతమంది హిందువులు దాడి చేసి చంపేసారంటూ విపరీతంగా ప్రచారం చేసి సామాన్య క్రైస్తవుల్లో హిందువుల పట్ల విద్వేషం రగిలించిన కొందరు వ్యక్తులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టత లేదు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి దారి తీసిన పరిస్థితుల గురించి పోలీసులు వివరించారు. మార్చి 24 మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి టూవీలర్ మీద బయల్దేరి, అర్ధరాత్రికి పావుగంట ముందు రాజమండ్రి శివార్లలోని కొంతమూరు దగ్గర ప్రమాదవశాత్తు పడిపోయి మరణించాడని తేల్చారు. రోడ్డు మీద కంకర వల్ల బైక్ పట్టుజారి రోడ్డు పక్కన గుంతలో పడిపోయాడు. బైక్ మీద పడింది. తలకు గాయమై చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అని ఐజీ అశోక్ కుమార్ స్పష్టంగా ప్రకటించారు.
మద్యం మత్తులోనే ప్రయాణించిన పాస్టర్:
పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి 24న హైదరాబాద్‌లో బయల్దేరాక ఎక్కడెక్కడ ఏయేం చేసాడో పోలీసులు స్పష్టంగా ఆధారాలతో సహా బైటపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం 11.00 : హైదరాబాద్ నుంచి బులెట్ మోటార్‌సైకిల్ మీద బయలుదేరాడు
మధ్యాహ్నం 12.15 : నాగోల్ సవేరా లిక్కర్ మార్ట్ దగ్గర మద్యం కొనుగోలు చేసాడు
మధ్యాహ్నం 02.58 : కోదాడ ఆదిత్యా వైన్స్ దగ్గర మద్యం కొనుగోలు చేసాడు
సాయంత్రం 04.51 : గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించాడు
రాత్రి 10.10 : ఏలూరు టానిక్ వైన్‌షాప్ దగ్గర మద్యం కొనుగోలు చేసాడు
రాత్రి 11.42 : నయారా పెట్రోల్ బంక్ దగ్గర రోడ్డు మీద పడిపోయి చనిపోయాడు
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో చేసిన పరీక్షలో పాస్టర్ ప్రవీణ్ పగడాల శరీరంలో మద్యం ఆనవాళ్ళు ఉన్నాయని నిర్ధారణ అయింది. అందువల్ల అతను వేరెవరికో ఇవ్వడానికి మద్యం కొనలేదు, తను తాగడానికే కొన్నాడని నిర్ద్వంద్వంగా నిరూపణ అయింది.
పలుమార్లు పడిపోయినా పయనం ఆపని పాస్టర్:
పాస్టర్ ప్రవీణ్ పగడాల తన రహదారి ప్రయాణంలో మూడుసార్లు పడిపోయాడు.
మధ్యాహ్నం 3.20: జగ్గయ్యపేట దగ్గర జాతీయ రహదారి మీద లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో పడిపోయాడు. వెనకే వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు తప్పించాడు. సమీపంలోని ఆటో డ్రైవర్లు, ఫుడ్ ప్లాజా స్టాఫ్ సాయంతో ప్రవీణ్ లేచి, ప్రయాణం కొనసాగించాడు.
మధ్యాహ్నం 3.52 : కీసర టోల్ ప్లాజా దగ్గర పాస్టర్ మరోసారి పడిపోయాడు. అక్కడే బండి హెడ్‌లైట్ పగిలిపోయింది. ఆ సమయంలో అక్కడున్న ఆంబులెన్స్, పారామెడికల్ సిబ్బంది సాయం చేసారు. కాసేపు ఆగి విశ్రాంతి తీసుకోమని సూచించారు. ప్రవీణ్ వినకుండా ముందుకు సాగాడు.
సాయంత్రం 5.15 : విజయవాడ రామవరప్పాడు రింగ్‌రోడ్ దగ్గర ప్రవీణ్ మరోసారి తనంతట తనే పడిపోయాడు. ఆ సమయంలో అక్కడున్న ఆటో డ్రైవర్లు రామవరప్పాడు జంక్షన్ దగ్గరలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐకి సమాచారం ఇచ్చారు. వారందరూ కలిసి ప్రవీణ్‌ను రోడ్డు పక్కకు తీసుకెళ్ళి సపర్యలు చేసారు. అక్కడ ప్రవీణ్ రెండున్నర గంటలకు పైగా నిద్రపోయాడు. లేచాక, ఎవరికీ చెప్పకుండా రాత్రి 8.47కు ప్రయాణం కొనసాగించాడు.
మూడుసార్లూ ప్రవీణ్‌ను ఎవరూ ఢీకొట్టలేదు. మద్యం తాగిన మత్తులో డ్రైవింగ్ చేసినందునే పడిపోయి ఉండవచ్చు. అయితే మూడుసార్లూ అదృష్టం కలిసివచ్చి పెద్దగా ప్రమాదమేమీ లేకుండానే బైటపడ్డాడు. డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పదేపదే పడిపోతూ చివరిసారి అర్ధరాత్రి సమయంలో పడిపోయి తలకు దెబ్బ తగలడంతో చచ్చిపోయాడు.
హిందువులే హత్య చేసారనే దుష్ప్రచారం:
మార్చి 24 అర్ధరాత్రికి ముందు పాస్టర్ ప్రవీణ్ తాగి పడిపోయి ప్రమాదవశాత్తు చచ్చిపోతే విషయం తెల్లవారాక తెలిసింది. మార్చి 25 పొద్దున్న నుంచీ హైడ్రామా మొదలైంది. ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్న పలువురు క్రైస్తవ ప్రముఖులు విద్వేష ప్రచారం ప్రారంభించారు. రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్, క్రైస్తవ ప్రచారకుడు ఎర్రప్ప అలియాస్ పాస్టర్ అజయ్, ప్రముఖ అంతర్జాతీయ సువార్తికుడు కెఎ పాల్, ఇంకా పలువురు క్రైస్తవ ప్రముఖులు రచ్చ మొదలుపెట్టారు.
‘హిందువులే ఉద్దేశపూర్వకంగా కుట్రచేసి, పాస్టర్ ప్రవీణ్‌ను రహస్యంగా వెంబడిస్తూ వచ్చి, బలవంతంగా మద్యం కొనిపించి, యూపీఐ పేమెంట్లు చేయించి, పలుచోట్ల దాడులు చేసి, ఎట్టకేలకు చిట్టచివరికి రాజమండ్రి శివార్లలోని కొంతమూరు దగ్గర గోతిలోకి తోసేసి చంపేసి అతని మీద బండి పడవేసి హత్యను ప్రమాదంగా చిత్రీకరించారు’ అన్నది వారందరూ చేసిన దుష్ప్రచారం సారాంశం. వారి ఈ ప్రచారం నిజంగా ఫలించింది. ఇప్పటికీ వేలాది మంది సామాన్య క్రైస్తవులు ఆ దుష్ప్రచారాన్ని గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్‌ను హిందువులే హత్య చేసారు అనీ, పోలీసులను మేనేజ్ చేసి, నివేదికలు తారుమారు చేసి అబద్ధాలు చెప్పిస్తున్నారు అనీ భావిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్‌కు మద్యం తాగే అలవాటే లేదనీ, ఆయన గతంలోనే తాగడం మానేసాడనీ, ఇప్పుడు అతని శరీరంలోకి ఇంజెక్షన్ల ద్వారా మద్యం ఎక్కించారనీ నమ్ముతున్నవాళ్ళు కోకొల్లలు.