బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ పరిధిలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడులో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ఘటన విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. బాధితులంతా సామర్లకోటకు చెందిన వారిగా గుర్తించారు.
కోటవురట్ల మండల కేంద్రానికి మూడు కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. తారాజువ్వల తయారీకి ఉపయోగించే పొడికి నిప్పంటుకుని పేలుడు సంభవించిందని అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి కర్మాగారం కూలిపోయింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు గోవిందు, నిర్మల, తాతబాబుగా గుర్తించారు. మరో ముగ్గురిని గుర్తించాల్సి ఉంది.
ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి హోంమంత్రి అనిత బయలుదేరారు.