గోరంట్ల మాధవ్ అరెస్ట్ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించిన 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. వీరంతా విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో వెలుగుచూసింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో గుంటూరు అరండల్‌పేట సీఐ వీరాస్వామి, పట్టాభిపురం ఎస్సైలు రామాంజనేయులు, రాంబాబు, ఏఎస్సైలు ఏడుకొండలు, ఆంధోని, నగరపాలెం స్టేషన్ కానిస్టేబుళ్లు ఐదుగురు, అరండల్‌పేట స్టేషన్ కానిస్టేబుల్ ఒకరు ఉన్నారు.
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులపై దాడి ఘటన తరవాత శుక్రవారంనాడు గుంటూరు కోర్టులో హాజరు పరిచే సమయంలో కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయను ఇందుకు నియమించారు. గోరంట్ల మాధవ్‌ను వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన సమయంలోనూ ఆయన ఫోన్ మాట్లాడుకున్నా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మీడియా ముందుకు వచ్చే ముందు
ముసుగు వేసుకునేందుకు మాధవ్ నిరాకరించారు. తనకే ముసుగు వేస్తారా? అంటూ ప్రశ్నించాడు. పోలీసులపై కన్నెర్ర చేశాడు. కోర్టు వద్ద కారు దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయాడు. వీటిపై విచారణ జరిపించారు. ఇప్పటికే డీఎస్పీ సీతారామయ్యను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను గుంటూరు తరలించేప్పుడు, గోరంట్ల మాధవ్‌కు సమాచారం అందించిన పోలీసు అధికారి ఎవరు అనే విషయంలోనూ విచారణ సాగుతోంది.