పరస్పర సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు వెనక్కు వేశారు. పరస్పర సుంకాలు స్మార్ట్ ఫోన్లు, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లకు వర్తించవని ప్రకటించారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. ఈ నిర్ణయంతో యాపిల్, వివో, శామ్సంగ్ లాంటి అతిపెద్ద కంపెనీ ఫోన్ల వినియోగదారులకు మేలు జరగనుంది. వీటి ధరలు పెరిగే అవకాశం లేదు.
పరస్పర సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే చైనా విషయంలో మాత్రం ట్రంప్ తగ్గలేదు. చైనాపై 145 శాతం సుంకాలు విధించారు. చైనా కూడా కాలు దువ్వడంతో సుంకాల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా దిగుమతులపై చైనా 125 శాతం సుంకం విధించింది. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరలేపినట్లైంది.
అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ చైనాలో పెద్ద ఎత్తున ఐఫోన్లు తయారు చేసి పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. మొత్తం ఐఫోన్ల ఉత్పత్తితో 90 శాతం చైనాలోనే తయారు చేస్తోంది. చైనాపై భారీగా సుంకం వేయడంతో భారత్లో ఐఫోన్ల ఉత్పత్తి పెంచాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తాజాగా ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందిన వస్తువుల జాబితాలో స్మార్టుఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్లు, సెమీ కండక్టర్లు, హార్డ్ డ్రైవ్లు ఫ్లాట్ టీవీలు ఉన్నాయి. చైనా విధించిన 145 శాతం సుంకం కూడా వీటికి వర్తించదు. వేర్వేరు సుంకాల పరిధిలోకి వస్తాయని అమెరికా కస్టమ్స్ విభాగం వెల్లడించింది. సుంకాల నుంచి మినిహాయింపు పొందాలంటే అమెరికాలోనే ఉత్పత్తి చేయాల్సి ఉంుటంది. అయితే ఇందుకు కొంత సమయం ఇచ్చారు.