రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా రాష్ట్రపతి, గవర్నర్లు తీవ్ర జాప్యం చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలన తీర్పు వెలువరించింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు 3 నెలల గడువు విధించింది. మూడు మాసాల్లో ఆమోదించడం లేదా తిప్పి పంపడం చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. బిల్లును వెనక్కు పంపితే అందుకు కారణాలను కూడా జత చేయాలని ఆదేశించింది.
ఈ తీర్పు తరవాత కూడా గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లుల ఆమోదంలో జాప్యం చేస్తే కోర్టును ఆశ్రయించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ మహాదేవన్, జస్టిస్ పార్దీవాలా ధర్మసనం తేల్చి చెప్పింది.
తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపిన 10 బిల్లులను గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం తెలపకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ నెల 8న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 415 పేజీల తీర్పులో పూర్తి వివరాలు పొందుపరిచారు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్ ద్వారా వివరాలు అందుబాటులోకి తీసుకువచ్చారు.