శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం ధనపురం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారు ఆదిలక్ష్మమ్మ, శాకమ్మ, అలివేలమ్మగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణీకులు ఉన్నారు. కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారు దొడగట్ట గ్రామ వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.