వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. నిరసనలు కొన్ని ప్రాంతాల్లో హింసకు దారితీశాయి. ముర్షిదాబాద్‌లో పరిస్థితి అంత్యంత దారుణంగా తయారైంది. తాజాగా జరిగిన హింసలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తండ్రీకొడుకులని పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో దోపిడీ చేసి, తండ్రీకొడుకులను చంపినట్లు బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు.
మరో ఘటనలో సజూర్‌మోరె అనే ప్రాంతంలో 21 సంవత్సరాల యువకుడు తుపాకీ కాల్పులో చనిపోయాడు. శంషేర్‌గంజ్‌లోని దులియాన్‌లో ఇద్దరిపై కాల్పులు జరిగాయి. రెండు రోజులుగా చెలరేగిన హింసలో 118 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్రమే నిరసనకారులకు సమాధానం చెప్పాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. బెంగాల్‌లో వక్ఫ్ చట్టం అమలు చేయమని సీఎం స్పష్టం చేశారు. నిరసనకారులు ముర్షిదాబాద్, హుగ్లీ, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్లు దిగ్భందించారు. బలగాలపై రాళ్లు విసిరారు. నిరసనలు వ్యాపించకుండా ముందస్తుగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు.