సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మృతిలో ఎలాంటి కుట్ర లేదని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. పాస్టర్ ప్రవీణ్ బైకును మరే వాహనం కూడా ఢీ కొనలేదని ఆయన రాజమహేంద్రవరంలో మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లే క్రమంలో ప్రవీణ్ పలువురితో మాట్లాడినట్లు గుర్తించారు.దారి పొడవునా సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ప్రవీణ్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని ఐజీ చెప్పారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో మాట్లాడిన వారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చినవి నిరాధార ఆరోపణలేనన్నారు. హైదరాబాద్, కోదాడ, ఏలూరులో ప్రవీణ్ మద్యం దుకాణాలకు వెళ్లారని సీసీటీవీ ఫుటేజీ చూపించారు. ఆయన ప్రయాణంలో మూడు సార్లు చిన్న ప్రమాదాలు జరిగాయన్నారు.
ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. కీసర టోల్‌ప్లాజా వద్ద అదుపు తప్పి కింద పడిపోయాడని గుర్తుచేశారు. సాయం చేసేందుకు అక్కడే ఉన్న అంబులెన్స్ సిబ్బంది వెళ్లినట్లు విచారణలో తేలిందన్నారు. విజయవాడలోని రామవరప్పాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ పరిస్థితిని ఆటోడ్రైవర్ చూశాడని తెలిపారు. ట్రాఫిక్ ఎస్సై సలహాతో అక్కడే పార్కులో 2 గంటలు నిద్రపోయాడని గుర్తించారు.
కండిషన్ బాగాలేదు వెళ్లవద్దని ట్రాఫిక్ ఎస్సై చెప్పినా వినలేదని ఐజీ గుర్తుచేశారు. హెడ్ లైటు పగిలిపోవడంతో బ్లింకర్ వేసుకుని హైవేలో ప్రయాణం చేశాడని చెప్పారు. ఏలూరులోనూ ఆయన మద్యం కొనుగోలు చేసి, యూపీఐ పేమెంటు చేశాడని విచారణలో తేలిందన్నారు. ఏలూరు మద్యం దుకాణానికి వచ్చే సమయానికి ఆయన కళ్లజోడు పగిలి ఉందన్నారు. కొంతమూరు వంతెనపై చాలా వేగంగా వెళ్లినట్లు గుర్తించారు. పాస్టర్ ప్రవీణ్ బైకును ఏ వాహనం ఢీ కొట్టలేదని ఐజీ తెలిపారు. బుల్లెట్ ఎగిరి పాస్టర్ ప్రవీణ్‌పై పడినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలిందన్నారు.