శుక్రవారం అధికారిక పర్యటన కోసం వారణాసి వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ చేరుకోగానే ఒక గ్యాంగ్‌రేప్ కేసు గురించి వివరాలు తెలుసుకున్నారు. వారణాసి జిల్లా కలెక్టర్, స్థానిక డివిజనల్ కమిషనర్, పోలీస్ కమిషనర్లతో మాట్లాడి వారికి సూచనలిచ్చారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో అలాంటి దుర్ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలనీ ఆదేశించారు. ఇంతకీ ఆ సంఘటన ఏంటి?
ఈ నెల 7వ తేదీన ఒక 19ఏళ్ళ యువతి వారణాసి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి తనపై జరిగిన అఘాయిత్యం గురించి రిపోర్టు చేసింది. ఆరు రోజుల పాటు 23మంది వ్యక్తులు ఆమెను గ్యాంగ్‌రేప్ చేసారన్నది ఆమె ఫిర్యాదు. ఆ కేసు గురించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నిందితులు ఆమెకు మత్తుమందు ఇచ్చి వేర్వేరు హోటళ్ళకు తీసుకుపోయి, అక్కడ లైంగిక దాడులకు పాల్పడ్డారు. నిందితుల్లో ఆరుగురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ దుర్ఘటన గురించి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వంటివారు నోరు మెదపని సంగతిని ప్రజలు గ్రహించారు, విమర్శిస్తున్నారు.
వారణాసి కంటోన్మెంట్ ఏరియా ఏసీపీ విదుష్ సక్సేనా చెప్పిన వివరాల ప్రకారం… బాధిత యువతి మార్చి 29న కొందరు స్నేహితులతో కలిసి తన ఇంటినుంచి బైటకు వెళ్ళింది. చెప్పిన సమయానికి యువతి ఇంటికి రానందున ఏప్రిల్ 4న ఆమె కుటుంబ సభ్యులు మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు ఆమె ఆచూకీ కనుగొని ఇంటికి చేర్చారు. ఆ సమయంలో ఆమె సామూహిక మానభంగం గురించి ఏమీ చెప్పలేదు.
బాధిత యువతిపై సామూహిక మానభంగం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు ఏప్రిల్ 6న పోలీసులకు ఫిర్యాదు చేసారు. అప్పుడు పోలీసులకు ఆ యువతి జరిగిన సంఘటన గురించి చెప్పింది. మార్చి 29, ఏప్రిల్ 4 మధ్య నిందితులు తనను వేర్వేరు హోటళ్ళకు, హుక్కా బార్లకూ తీసుకువెళ్ళారనీ అక్కడ తనను సామూహికంగా మానభంగం చేసారనీ బాధితురాలు చెప్పింది. మొత్తం 23మంది ఆమెను రేప్ చేసారని ఆరోపించింది. వారిలో 12మంది పేర్లు తెలిసాయి, మరో 11మందిని గుర్తుతెలియని వ్యక్తులుగా కేసులో రాసుకున్నారు. పేర్లు తెలిసిన నిందితుల్లో ఆరుగురిని ఏప్రిల్ 5న అరెస్ట్ చేసారు. మిగిలిన వ్యక్తులను గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
యువతి తల్లి ఫిర్యాదులో కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బాధిత యువతి మార్చి 29న తన నేస్తం ఇంటికి వెళ్ళింది. తిరిగి ఇంటికొచ్చే దారిలో రాజ్ అనే అబ్బాయి కలిసాడు. అతను ఆ అమ్మాయిని తన కెఫేకు తీసుకువెళ్ళాడు. అక్కడ రాజ్, అతని మరో స్నేహితుడూ ఆ అమ్మాయితో ‘చెడ్డపనులు’ చేసారు. మర్నాడు అమ్మాయి సమీర్ అనే అబ్బాయిని కలిసింది. అతనితో పాటు మోటార్‌సైకిల్ మీద మరో అబ్బాయి ఉన్నాడు. వారు అమ్మాయిని బైక్ మీద హైవేకు తీసుకువెళ్ళారు. అక్కడ సమీర్ ఆ అమ్మాయితో ‘చెడ్డగా వ్యవహరించాడు’, తర్వాత ఆమెను నదేసర్ దగ్గర దింపేసాడు.
మార్చి 31న ఆయుష్, సొహాయిల్, డానిష్, అన్మోల్, సాజిద్, జాహిర్ అనే ఆరుగురు అబ్బాయిలు ఆమెను సిగ్రాలోని కాంటినెంటల్ కెఫేకు తీసుకువెళ్ళారు. అక్కడ ఆమెకు మత్తు కలిపిన పానీయం ఇచ్చి, ఆమెను ఒకరి తరువాత ఒకరుగా మానభంగం చేసారు. ఏప్రిల్ 1న సాజిద్ ఆమెను ఒక హోటల్‌కు తీసుకువెళ్ళాడు. అక్కడ ఇంకో ముగ్గురు నలుగురు యువకులు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి ఆమెను రేప్ చేసాడు. అక్కడినుంచి బలవంతంగా పంపించేసాడు. వెళ్ళిపోతున్న సమయంలో ఆమెను ఇమ్రాన్ అనే మరొక వ్యక్తి ఇంకొక హోటల్‌కు తీసుకువెళ్ళాడు. అక్కడ మత్తు కలిపిన పానీయం ఇచ్చి అతను కూడా రేప్ చేసాడు. యువతి అరవడంతో ఆమెను హోటల్ బైట వదిలిపెట్టి పారిపోయాడు.
ఏప్రిల్ 2న రాజ్ ఖాన్ అనే అబ్బాయి ఈ అమ్మాయిని తన ఇంటి మేడ మీదకు తీసుకువెళ్ళి ఆమెకు మత్తుమందు ఇచ్చాడు. తర్వాత ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించాడు. యువతి అరవడంతో మరికొందరు స్నేహితులతో కలిసి ఆమెను అస్సీఘాట్ దగ్గర వదిలేసాడు.
ఏప్రిల్ 3న డానిష్ అనే వ్యక్తి ఆ యువతిని తన స్నేహితుడి గదికి తీసుకువెళ్ళాడు. అక్కడ సొహాయిల్, షోయబ్, మరో అబ్బాయి కలిసి ఆ అమ్మాయికి మత్తుపానీయం ఇచ్చి రేప్ చేసారు. ఆ తర్వాత చౌక్ఘాట్ దగ్గర వదిలేసారు. ఏప్రిల్ 4న యువతి ఇంటికి చేరుకుంది, తాను ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను కుటుంబ సభ్యులకు చెప్పింది.
ఈ కేసులో 12మంది నిందితుల పేర్లు తెలిసాయి, మరో 11 మంది పేర్లు తెలియలేదు. వారు రాజ్, సమీర్, ఆయుష్, సొహాయిల్, డానిష్, అన్మోల్, సాజిద్, జాహిర్, ఇమ్రాన్, జయిబ్, అమన్, రాజ్ ఖాన్. పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 70(1) (గ్యాంగ్‌రేప్), 74 (దాడి లేక బలాత్కారం), 123 (మత్తు లేదా విషం ఇవ్వడం ద్వారా బాధించడం), 126(2) (తప్పు ఉద్దేశంతో నిర్బంధించడం), 127(2) (తప్పు ఉద్దేశంతో చెరపట్టడం), 351(2) (నేరపూరితంగా భయపెట్టి బెదిరించడం) అనే సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసారు. దర్యాప్తు కొనసాగుతోంది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్