అప్ఘానిస్తాన్‌లోని తాలిబాన్ నైతిక పోలీసులు పాశ్చాత్య శైలిలో హెయిర్ స్టయిలింగ్ చేయించుకున్న పురుషులనీ, అలా చేసిన బార్బర్లనూ అరెస్టులు చేసారని ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో వెల్లడించింది. అలాగే రంజాన్ నెలలో మసీదుల్లో ప్రార్థనలు చేయని వారిని కూడా అరెస్టు చేసారని వివరించింది. అప్ఘానిస్తాన్‌లో గతేడాది ప్రజల ప్రవర్తనను నియంత్రించే నియమావళి అమలులోకి వచ్చింది.
అప్ఘానిస్తాన్‌లో నైతిక ప్రవర్తన నియంత్రణకు సంబంధించిన మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ వర్చ్యూ అండ్ వైస్) గత ఆగస్టు నెలలో నిత్య జీవితానికి సంబంధించి కొన్ని నియమాలు విధించింది. ప్రజా రవాణా, సంగీతం, షేవింగ్, వేడుకలు జరుపుకోవడం వంటి అంశాలపై ఆంక్షలు విధించింది. వాటిలో ముఖ్యమైన ఆంక్ష ఏంటంటే, బహిరంగ స్థలాల్లో మహిళల ముఖాలు కనిపించకూడదు, మాటలు వినిపించకూడదు.
అప్పటికే ఆ దేశంలో మహిళలు ఉద్యోగాలు చేయడం, బాలికలు చదువుకోవడం, ఆడపిల్లలూ మహిళలు ధరించాల్సిన దుస్తుల వంటి వాటి మీద ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. వాటికి తోడు మరిన్ని కొత్త ఆంక్షలను విధించడాన్ని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి ఒకరు తప్పుపట్టారు. నైతిక ప్రవర్తన పేరిట విధించిన ఆంక్షల మీద ఐక్యరాజ్యసమితి ఆందోళనలను తాలిబన్ అధికారులు త్రోసిపుచ్చారు.
అప్ఘానిస్తాన్‌లో ఐక్యరాజ్యసమితి మిషన్ నిన్న గురువారం ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాక మొదటి ఆరు నెలల పరిస్థితినీ వివరించింది. ప్రధానంగా, అరెస్టు చేసిన మగాళ్ళలో సగం మంది చేసిన నేరం గడ్డం తగినంత పొడుగు లేకపోవడం, జుత్తును ఆంక్షల ప్రకారం కత్తిరించుకోకపోవ. ఆ రెండు కారణాలకే జనాలను అరెస్టులు చేసేయడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, నైతిక పోలీసులు అరెస్టులు చేయడానికి ఎలాంటి ప్రక్రియా పాటించకపోవడం, బాధితులకు న్యాయపరమైన రక్షణలు ఏవీ అందుబాటులో లేకపోవడం సరికాదని అభిప్రాయపడింది.
రంజాన్ నెలలో సామూహిక ప్రార్థనలకు పురుషుల హాజరును అప్ఘాన్ నైతిక పోలీసు విభాగం నిశితంగా పరిశీలించింది. వాటికి హాజరు కానివారిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసిపడేసింది. నైతిక పోలీసుల చర్యల వల్ల అప్ఘానిస్తాన్‌లో స్త్రీపురుషులు ఇద్దరూ తీవ్రంగా ప్రభావితమయ్యారని యుఎన్ మిషన్ వెల్లడించింది. ప్రత్యేకించి ప్రైవేటు విద్యా సంస్థలు, క్షురకులు, హెయిర్డ్రెసర్లు, దర్జీలు, పెళ్ళిళ్ళకు క్యాటరింగ్ చేసేవారు, రెస్టారెంట్లు వంటి చిన్న వ్యాపారాల వారు చాలా నష్టపోయారు. వారికి ఆదాయం పూర్తిగా క్షీణించి పోయింది. ఇంక ఉద్యోగ అవకాశాలు సైతం లేకుండా పోయాయి.
మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు, ఈ చట్టాల అమలు వల్ల సమాజం మీద పడిన ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పడిన సామాజిక ఆర్థిక ప్రభావాలు ఇప్పటికే భయంకరంగా ఉన్న అప్ఘానిస్తాన్ ఆర్థిక పరిస్థితిని మరింత కుంగదీసేలా ఉన్నాయని యుఎన్ మిషన్ నివేదిక పేర్కొంది. చదువులు, ఉద్యోగాల్లో మహిళలను నిషేధించడం వల్ల అప్ఘానిస్తాన్ మీద ఏటా సుమారు 14వందల కోట్ల డాలర్ల భారం పడుతోందని ప్రపంచబ్యాంకు అధ్యయనం అంచనా వేసింది.
అయితే తాలిబన్ నాయకులు పరిస్థితిని ఆర్థిక కోణంలో చూడడం లేదు. మతపరంగా మాత్రమే చూస్తున్నారు. అప్ఘాన్ సమాజాన్ని, ఆ దేశపు ప్రజలనూ సంస్కరించే క్రమంలో ఇస్లామిక్ చట్టం, నైతిక విధుల మంత్రిత్వ శాఖ ఆంక్షల అమలు అత్యంత మౌలికమూ, ప్రాథమికమూ అయిన అవసరమని తాలిబన్ నాయకుడు హిబాతుల్లా అఖుంద్జాదా స్పష్టం చేసారు.
రంజాన్ నెల చివరిలో వచ్చే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినానికి ముందు విడుదల చేసిన సందేశంలో, ‘‘నైతిక భ్రష్టత్వం, తప్పుడు ఆచారాలు, తప్పుదోవ పట్టించే నమ్మకాలకు భవిష్యత్ తరాలు బాధితులు కాకుండా నివారించడానికీ… అవినీతి, నేరాలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికీ… ఈ ఆంక్షలు, చట్టాలు అత్యంత అవసరం’’ అని అఖుంద్జాదా ప్రకటించారు.
యుఎన్ మిషన్ నివేదిక ప్రకారం అప్ఘానిస్తాన్ చట్టాలు, ఆంక్షలు, నైతిక నియమావళి గురించి ప్రజలకు తెలియజేయడానికి తాలిబన్ ప్రభుత్వం 3300మంది కంటె ఎక్కువ పురుష ఇనస్పెక్టర్లను నియమించింది. అప్ఘాన్ నైతిక నియమావళికి సంబంధించిన మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సైఫుర్ రెహమాన్ ఖైబర్ మాత్రం తమ శాఖ ధర్మాన్ని ప్రచారం చేయడం, తప్పులను అరికట్టడం, ప్రమాణాలను ఏర్పాటు చేయడం, చెడు పనులను అడ్డుకోవడం, చెడ్డ ఆచారాలను తొలగించడం అనే ప్రాథమిక విధులతో పాటుగా… వేలాది మంది ప్రజల ఫిర్యాదులను పరిష్కరించిందని, మహిళల హక్కులను సంరక్షించిందనీ చెప్పుకున్నారు.
తప్పొప్పుల మంత్రిత్వ శాఖ ఇస్లామిక్ నియమాలు, మానవ హక్కులకు కట్టుబడి ఉందనీ, వాటిని ఆచరణలో పెడుతోందనీ సైఫుర్ రెహమాన్ ఖైబర్ తన ప్రకటనలో వెల్లడించారు. ఆ మంత్రిత్వ శాఖ కార్యకలాపాల గురించి పుకార్లు వ్యాపింపజేసే ప్రయత్నాలను అరికడతామని హెచ్చరించారు.