తెలంగాణలో బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలోకి ప్రవేశం కోసం ఇటీవల ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అందులో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్ధికి మాత్రం సీటు రాలేదు. అతనే కాదు, మరో 53 మంది విద్యార్ధులదీ అదే పరిస్థితి. మంచి ర్యాంకులు వచ్చినా అడ్మిషన్ మాత్రం రాలేదు. ఒక చిన్న పొరపాటు వారి సీటుకు ఎసరు పెట్టింది. అసలేం జరిగిందంటే….
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామంలోని ప్రగతి విద్యాలయం నుంచి 85 మంది విద్యార్ధులు బీసీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష రాసారు. వారిలో ఇ ఆకాష్ అనే విద్యార్ధికి రాష్ట్రంలో ప్రథమ స్థానం లభించింది. మరో 53 మంది విద్యార్ధులకు వెయ్యి లోపు ర్యాంకులు వచ్చాయి. అయితే దరఖాస్తు చేసే సమయంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల వారికి అడ్మిషన్ మాత్రం లభించలేదు.
ప్రవేశ పరీక్ష కోసం విద్యార్ధులు మీ సేవా కేంద్రంలో అప్లికేషన్లు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. విద్యార్ధులు బీసీ జాబితాలో తమది ఏ కులం అన్న కాలమ్ దగ్గర కులం పేరు సరిగ్గానే నింపారు. ఆ తర్వాత ‘మీ కులం ఎంబీసీ జాబితాలో ఉందా’ అన్న ప్రశ్నకు ‘అవును’ అని పొరపాటున నింపారు. నిజానికి అక్కడ వారు ‘కాదు’ అన్న ఆప్షన్‌ను టిక్ చేయవలసి ఉంది. ఆ పొరపాటు కారణంగా ఇప్పుడు వారికి సీట్లు రావడం లేదు.
విషయం తెలిసిన ప్రగతి విద్యాలయం హెడ్మాస్టర్ తెలంగాణ బీసీ కమిషన్‌కు లేఖ రాసారు. బాధిత విద్యార్ధులు అందరూ బీసీలే అని, దరఖాస్తులో ఎంబీసీలు అన్న ఆప్షన్‌కు వారు టిక్ చేయడం పొరపాటున జరిగిందని వివరించారు. వారి కులం ఎంబీసీ జాబితాలో లేని కారణం చేత వారికి అడ్మిషన్ రాలేదని వాపోయారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విభాగం కార్యదర్శి అలుగు వర్షిణిని కలిసేందుకు ప్రయత్నించారు. అక్కడా వారికి నిరాశే ఎదురయింది. అయితే చిన్నపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి అవకాశం కల్పించమని కోరుతూ హెడ్మాస్టర్ బీసీ కమిషన్‌కు లేఖ రాసారు.
ఆ అంశంపై తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్పందించారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసారు. విద్యార్ధులకు న్యాయం జరిపించమని అభ్యర్ధించారు.
మరోవైపు, బీసీ గురుకులాల్లో ప్రవేశ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని గురుకులాల సొసైటీ వెల్లడించింది. ఎలాంటి అవకతవకలకూ అవకాశం లేదని స్పష్టం చేసింది. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టే సమయంలో విద్యార్ధులు అన్ని వివరాలనూ సరిగ్గా తనిఖీ చేసుకోవాలని వివరించింది. ప్రతిభ కలిగిన ప్రతీ విద్యార్ధికీ న్యాయం జరుగుతుందని అందులో ఎలాంటి అనుమానాలకూ ఆస్కారం లేదనీ వెల్లడించింది.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత