అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల దెబ్బతో ఆక్వా సాగు ప్రశ్నార్థకంగా మారింది. సుంకాల పెంపు అమలుకు రంగం సిద్దం కావడంతో ఎగుమతిదారులు రొయ్యల ధరలు దారుణంగా తగ్గించారు. ప్రస్తుతం రొయ్యల ఎగుమతులపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధిస్తోంది. అది తాజాగా 27 శాతానికి పెంచారు. ఏప్రిల్ 20 నుంచి పెంచిన సుంకాలు అమల్లోకి రానున్నాయి. సుంకాల దెబ్బతో రొయ్యల ధరలు 26 శాతం తగ్గాయి. 100 కౌంట్ రొయ్యి ధర గత నెలలో కిలో రూ.250 ఉండగా నేడు అది కిలో రూ.190కి పడిపోయింది. ఒక్కో టన్నుకు రూ.70 వేల నుంచి రూ.50 వేల నష్టం వస్తోందని రైతులు చెబుతున్నారు. అంటే ఎకరాకు రూ.2 లక్షల నుంచి లక్షా 40 వేల నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు.
రొయ్యల్లో 30 నుంచి 60 కౌంట్ వచ్చే రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. 60 నుంచి 100 కౌంటు రొయ్య చైనా, వియత్నాం దేశాలకు ఎగుమతి అవుతోంది. అక్కడ ప్రాసెస్ చేసి ఆ దేశాలు అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. మన రాష్ట్రంలోని ఆక్వా ఉత్పత్తుల్లో రొయ్యలో 90 శాతం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ రంగం ముఖ్యంగా ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. ఎగుమతుల్లో అధికంగా అమెరికాకు పంపిస్తున్నారు. తాజాగా సుంకాల ప్రభావంతో రొయ్యల ధరలు పతనంతో సాగు సంక్షోభంలో పడింది. ఎకరానికి 30 కౌంట్ రొయ్య 3 టన్నుల దిగుబడి వస్తుంది. కేజీ రూ.500 ఉంటే రూ.15 లక్షల ఆదాయం వస్తుంది. రొయ్య ధరలు కిలో రూ.190కి పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఏప్రిల్ నుంచి జులై వరకు ఎగుమతులు
విదేశాలకు రొయ్యల ఎగుమతులు ఏప్రిల్ నుంచి నాలుగు నెలలపాటు జోరుగా సాగుతాయి. ప్రాసెస్ చేసిన రొయ్య ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. ఏపీలో 197 రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏటా 12 లక్షల టన్నులు ప్రాసెస్ చేసి 3.47 లక్షల టన్నులు ఎగుమతి చేస్తున్నారు. దీని ద్వారా రూ.17000 కోట్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. రైతులకు కూడా మంచి ఆదాయం వస్తోంది. సుంకాల పెంపుతో రొయ్య ఎగుమతులు ప్రభావితం అయ్యాయి. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం సాగు గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు క్రాప్ హాలిడేకు సిద్దం అవుతున్నారు.
రొయ్య సాగుకు అధిక వ్యయం
రొయ్యల సాగుకు ఎకరాకు పది లక్షలు ఖర్చవుతోంది. చలికాలంలో చెరువు నీటిలో ఆక్సిజన్ తగ్గకుండా చూసేందుకు లక్షలు ఖర్చు చేసి ఏరేటర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని నడిపించేందుకు పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగించుకోవాల్సి వస్తోంది. ఎకరాకు రూ.2 లక్షల కరెంటు బిల్లు వస్తోంది. ప్రభుత్వం రాయితీ ధరలకు విద్యుత్ సరఫరా చేయడంతో రైతులకు కొంత వరకు ఖర్చు తగ్గి మేలు జరుగుతోంది. అయితే తాజాగా అమెరికా సుంకాల ప్రభావం ఇప్పటికే ఆక్వాసాగును ప్రభావితం చేసింది. రైతుల వద్ద నుంచి రొయ్యలు కొనుగోలు చేసేందుకు ఎగుమతిదారులు ముందుకు రావడం లేదు. రొయ్యను నిల్వ చేసుకునే సదుపాయాలు కూడా లేకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
పెరుగుతోన్న సాగు ఖర్చులు
రొయ్యల సీడ్, ఫీడ్ ధరలు ఏటా పెరుగుతున్నాయి. రొయ్య కొనుగోలు ధర మాత్రం పెద్దగా పెరగడం లేదు. దీంతో కొత్తగా రొయ్యల సాగు చేపట్టేందుకు రైతులు ముందుకు రావడం లేదు. సాగు విస్తీర్ణం కూడా గడచిన ఐదేళ్లలో తగ్గినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం 4 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు. దీన్ని మరో ఐదేళ్లలో పది లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతలోనే సుంకాల ప్రభావం పడటంతో రొయ్య సాగు సంక్షోభంలో పడింది.
ప్రభుత్వం ఆదుకోవాలి
రొయ్య సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించింది. యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేస్తోంది. నాన్ జోన్లో ఆక్వా సాగు చేసే రైతులకు కూడా రాయితీలు వర్తించేలా జీవో విడుదల చేసింది. ఎగుమతిదారులను కూడా ప్రోత్సహించాలని కోరుతున్నారు. రొయ్య ప్రాసెసింగ్ పరిశ్రమకు రాయితీ ధరకు విద్యుత్ సరఫరా చేయడంతోపాటు, ఎగుమతి ఆధారిత ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరుతున్నారు. సీడ్, ఫీడ్ ధరలను కూడా ప్రభుత్వం నియంత్రించాలని రైతులు కోరుతున్నారు. నాణ్యమైన సీడ్ దొరకడం లేదని చెబుతున్నారు. సీడ్ తయారీ యూనిట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చాయి. వాటిపై పర్యవేక్షణ కొరవడిందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో నాణ్యతలేని పిల్లలతో సాగు చేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన సీడ్ అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత