ఒకే రాష్ట్రం … ఒకే గ్రామీణ బ్యాంకు విధానం త్వరలో అమల్లోకి రానుంది.కార్యకలాపాల సామర్థ్యం పెంపు, వ్యయాల హేతుబద్ధీకరణ కోసం దేశంలోని 11 రాష్ట్రాల పరిధిలోని 15 గ్రామీణ బ్యాంకులను ఏకీకరించనున్నారు. ఈ చర్యతో దేశవ్యాప్తంగా 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య 28కి తగ్గనుంది. మే 1 నుంచి ఈ ప్రణాళిక అమల్లోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వివరించింది.
కేంద్ర ప్రభుత్వ గెజిట్ ప్రకారం..
ఆంధ్రప్రదేశ్లో 4, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో చెరి 3, బిహార్, గుజరాత్, జమ్ము అండ్ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో 2 చొప్పున విలీనం కానున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఒకటే గ్రామీణ బ్యాంక్ ఉండనుంది.
ప్రజా ప్రయోజనాల్లో భాగంగా రీజినల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్, 1976ను అనుసరించి ఈ ఏకీకృత ప్రక్రియను అమలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరిట నాలుగు వేర్వేరు గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. వీటికి వేరు వేరు స్పాన్సర్డ్ బ్యాంకులు ఉన్నాయి. ఏకీకరణ ప్రక్రియ అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉండబోతుండగా యూనియన్ బ్యాంక్ స్పాన్సర్డ్గా ఉంటుంది. యూపీ, బెంగాల్లో సైతం ఒకటే ఆర్ఆర్బీగా అవతరించనుంది.
దేశంలో ఒకప్పుడు 196 గ్రామీణ బ్యాంకులు ఉండగా 2004-25 నుంచి 2020-21 వరకు మూడు దశల్లో చేపట్టిన ఏకీకరణ ప్రక్రియతో ఆ సంఖ్య 43కు తగ్గింది. ప్రస్తుతం ఆ సంఖ్య 28కి చేరనుంది. చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులవారికి రుణాలు ఇచ్చే ఉద్దేశంతో ఆర్ఆర్బీ యాక్ట్, 1976 కింద ఈ బ్యాంకులు ఏర్పాటు చేశారు.
ఈ విలీన ప్రక్రియపై రాయలసీమలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కడప కేంద్రంగా సేవలందించే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ను విలీనం నుంచి మినహాయించాలని లేదంటే స్టేట్ ఆర్ఆర్ బీ ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే ఉంచాలని కోరుతున్నారు.
రాయలసీమ, అనంత, పినాకిని బ్యాంకుల విలీనంతో 2006లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఏర్పాటైంది. అపట్లో కడప కేంద్రంగా సేవలందించే రాయలసీమబ్యాంకు పెద్దది కావడంతో ప్రధాన కార్యాలయం అక్కడే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏపీజీబీలో చిత్తూరు కేంద్రంగా పనిచేసే సప్తగిరి బ్యాంకు, గుంటూరు లో హెడ్ ఆఫీస్ ఉన్న చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకు, వరంగల్ కేంద్రంగా ఉన్న ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. విలీనం తర్వాత అతిపెద్ద బ్యాంకు గా ఉన్న కడపలోనే ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన బ్యాంకు ప్రధాన కార్యాలయం అక్కడ ఉంటేనే మంచిదంటున్నారు. అమరావతిలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. లేదంటే ఏపీజీబీ, సప్తగిరి బ్యాంకులను మాత్రమే విలీనం చేసి ప్రధాన కార్యాలయాన్ని కడపలో ఉంచాలంటున్నారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత