ఏపీ విభజన చట్టంలోని 9 వ షెడ్యూల్ ఆస్తుల పంపిణీపై సమావేశం
తాజాగా వెలువడిన మినిట్స్ …
ఏపీ పునర్విభజన చట్టం 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల ఆస్తులన్నీ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి నిధులతోనే సృష్టించినవని ఏపీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. వాటిని జనాభా ప్రాతిపదికన ఏపీ, తెలంగాణకు పంచాలని కేంద్రహోం శాఖ కార్యదర్శిని కోరింది. ఈ సంస్థలను విడివిడిగా కాకుండా అన్నింటినీ ఒకేసారి పంపిణీ చేస్తే ఏపీకి నష్టం జరగకుండా ఉంటుందని వివరించింది. తమ లెక్కల ప్రకారం ఆస్తుల విలువ రూ.21 వేల కోట్లుగా ఉన్నందున అందులో రూ.14 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని విన్నవించింది.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న ఇరురాష్ట్రాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మినిట్స్ లో తాజాగా వెల్లడయ్యాయి. వాటిని కేంద్రహోంశాఖ రాష్ట్రాలకు పంపింది.
ఏపీ ప్రభుత్వ వాదన ఇలా…
ఏపీ ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై తన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా పునురుద్ఘాటించింది. ఆధారాలు, వివరాలతో గట్టి అభిప్రాయాన్ని వెల్లడించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి షీలా బిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఏపీఎస్‌ఎఫ్‌సీ మినహాయించి 90 సంస్థల విభజనకు సిఫార్సు చేసిందని గుర్తు చేసింది. రూ.24,019 కోట్ల విలువైన ఆస్తులను జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచాలని తేల్చి చెప్పింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రూ.14,002 కోట్లు, తెలంగాణ రూ.21,028 కోట్లు అడుగుతోంది.
నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,127 కోట్లు, తెలంగాణకు రూ.16,891 కోట్లు సిఫార్సు దని ఈ ఆస్తులన్నీ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి నిధులతో సృష్టించినవే. అందువల్ల వీటన్నింటినీ జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయాలని కోరింది.
నిపుణుల కమిటీ సిఫార్సుల్లో పేర్కొన్న 53 కంపెనీలు, కార్పొరేషన్ల విభజన వరకు మాత్రమే ఇప్పటివరకు ఒప్పందం కుదిరింది. మరో 15 కంపెనీలు, కార్పొరేషన్లకు సంబంధించి చేసిన సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అంగీకరించింది. ప్రస్తుతం రెండురాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన 53 కంపెనీలు,కార్పొరేషన్ల విలువ కేవలం రూ.187 కోట్లు, మరో 15 కంపెనీలు,కార్పొరేషన్ల విలువ రూ.4,389 కోట్లు గా ఉంది. అన్ని సంస్థల సమస్యలనూ ఒకేసారి పరిష్కరించడం మంచిదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖకు సూచించారు.
మరికొన్ని ముఖ్యాంశాలు..
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర పథకాల్లో భాగంగా తెలంగాణ వాటా కింద ఏపీ నుంచి రూ.495.21 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ సీఎస్ కోరారు. ఈ విషయమై కాగ్ కు లేఖ రాస్తానని కేంద్ర హోంశాఖ కార్యదర్శి హామీ ఇచ్చారు.
విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరగా ప్రారంభించాలని ఏపీ అధికారులు కోరగా రైల్వే అధికారులు రెండేళ్ల సమయం పడుతుందన్నారు. హోంశాఖ కార్యదర్శి గోవిందమోహన్ మాత్రం తాత్కాలిక ప్రాతిపదికగానైనా ప్రారంభించాలని సూచించారు.
హైదరాబాద్-అమరావతి హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి తక్షణం డీపీఆర్ తయారు చేయాలని ఏపీ సీఎస్ కోరగా ఎలైన్‌మెంట్‌కు అనుమతి రావాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.
హైదరాబాద్-విజయవాడల మధ్య ఎన్‌హెచ్-65 విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత