భారతదేశపు చట్టాల చరిత్రలో వక్ఫ్ చట్టం 1995 కలిగించినంత అయోమయం, వివాదం, అవినీతి కలిగించిన చట్టాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ఆ చట్టాన్ని హడావుడిగా రాసేసారు, చాలా చెత్తగా అమలు చేసారు. అందుకే ఆ చట్టం వక్ఫ్ బోర్డులకు ఎలాంటి తనిఖీలు లేని, అపరిమితమైన అధికారాలు కట్టబెట్టింది. దానివల్లే జవాబుదారీతనం లేని సమాంతర సామ్రాజ్యంగా వక్ఫ్ బోర్డులు ఎదిగాయి.
అస్పష్టమైన ప్రొవిజన్లు, మరికొన్ని భ్రమల వల్ల వక్ఫ్ చట్టం అధికారాలు కేవలం ఇస్లామిక్ మతపరమైన ఆస్తుల నిర్వహణకు పరిమితం కాలేదు. అది దేశవ్యాప్తంగా భూవివాదాలకు కారణమైంది, మతపరమైన గొడవలకు దారి తీసింది. మతపరమైన దానాల పేరిట దేవాలయాలు, పాఠశాలలు, శ్మశానాలు, చివరికి గ్రామాలకు గ్రామాలను సైతం ఆక్రమించేసింది.
కథ అక్కడితో ఆగలేదు. 2014లో అధికారం కోల్పోవడానికి కొద్దికాలం ముందు, అంటే 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడం ద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను అపరిమితంగా పెంచేసింది. ఎలాంటి సరైన ప్రక్రియా లేకుండానే వక్ఫ్ బోర్డు భారీ స్థాయిలో భూములను స్వాధీనం చేసేసుకోడానికి గేట్లు ఎత్తేసింది. ఆ సవరణలు సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా చుట్టబెట్టేసినవి మాత్రమే కాదు, అవి అత్యంత ప్రమాదకరంగా ప్రజాస్వామ్యానికి హానికరంగా ఉన్నాయి. వాటి ద్వారా వక్ఫ్ పేరిట భూములను విచ్చలవిడిగా ఆక్రమించేయడానికి బోర్డుకు అవకాశం లభించింది. తద్వారా లక్షలాది ఎకరాల భూములను, వాటి నిజ యజమానులకు సైతం కనీసం తెలియకుండా వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసేసుకుంది.
2024లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం చాలా రకాలుగా కీలకమైనది, నిర్ణయాత్మకమైనది. చట్టపరమైన స్పష్టతను, రాజ్యాంగ సమతౌల్యాన్నీ, వక్ఫ్ ఆక్రమణల వల్ల ఆస్తులు కోల్పోయి గత ప్రభుత్వంలో నిస్సహాయంగా మిగిలిపోయిన వేలాదిమంది పౌరుల ఆస్తిహక్కులనూ ఈ సవరణ ద్వారా పునరుద్ధరించారు. స్వతంత్ర భారతంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన, బాధ్యతారహితమైన, అదే సమయంలో చట్టబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థకు, ప్రభుత్వం ఈ చట్ట సవరణ ద్వారా కోరలు పీకేసింది. అంతేకాదు, అవినీతి, మతపరమైన బుజ్జగింపులు, వ్యవస్థీకృతమైపోయిన భూముల వినియోగం వంటి అంశాల మధ్య సంబంధాల మూలాల మీదే దెబ్బకొట్టింది.
క్షేత్రస్థాయి వాస్తవాలు:
వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడం వెనుక ఉన్న తర్కం స్పష్టంగా అర్ధం కావాలంటే, వక్ఫ్ వ్యవస్థ భూములను ఆక్రమించే సిండికేట్ మాఫియాగా ఎలా మారిందో నిరూపించగల, వాస్తవిక జీవితంలోని కొన్ని ఉదాహరణలను తెలుసుకోవాలి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ వ్యవస్థలో బాధితులు, ఆరోపితులూ ఇద్దరూ ముస్లిం వర్గానికి చెందిన వారే. అలాంటి కొన్ని సంఘటనలను చూద్దాం.
బుర్హాన్‌పూర్, మధ్యప్రదేశ్ (2023 డిసెంబర్): ఒక వక్ఫ్ ఆస్తిని అబ్రార్ సాహెబ్ అనే వ్యక్తికి 11 నెలల కోసం లీజుకు ఇచ్చారు. అతను ఆ భూమిలో చట్టవిరుద్ధంగా శాశ్వత నిర్మాణాలు చేసి, ఆ భూమిని కాజేసేందుకు ప్రయత్నించాడు.
నీమచ్, మధ్యప్రదేశ్ (2024 ఆగస్ట్): నగరంలోని జామా మసీదు ప్రాంతంలో ఒక వక్ఫ్ భూమిని యూసుఫ్ ఛిపా అనే వ్యక్తి అక్రమంగా ఓ భవనం నిర్మించేసాడు. తర్వాత దాన్ని అధికారులు బుల్‌డోజర్లతో పగలగొట్టాల్సి వచ్చింది.
ఇండోర్, మధ్యప్రదేశ్ (2023 జూన్): మౌజ్ అలీ సర్కార్ దర్గాకు చెందిన 2436 చదరపు అడుగుల స్థలాన్ని దిల్‌పుకార్ షా అనే వ్యక్తి ఆక్రమించాడు. ఆ స్థలాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడు. ఆ అక్రమ అమ్మకాన్ని అడ్డుకోగలిగారు.
భోపాల్, మధ్యప్రదేశ్ (2024 జూన్): భోపాల్ నగరంలో వక్ఫ్ కింద మొత్తం 124 శ్మశానవాటికలు ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. వాటిలో 24 మాత్రమే భౌతికంగా ఉన్నాయి. మిగతావన్నీ అక్రమ ఆక్రమణలకు గురయ్యాయి. ఆ ఆక్రమణలు చేసినవాళ్ళందరూ ముస్లిములే.
భివాండి, మహారాష్ట్ర (2021 మార్చి): పట్టణంలో వక్ఫ్‌కు చెందిన ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానపు ట్రస్టీల్లో ఒక వ్యక్తి దాని గోడను తొలగించి, ఆ ప్రదేశాన్ని వాణిజ్య స్థలంగా వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిరసన తెలియజేసారు.
అహ్మద్‌నగర్, మహారాష్ట్ర (2021 ఏప్రిల్): జామామసీదు ఆవరణ లోపలే గియాసుద్దీన్ షేక్ అనే వ్యక్తి అక్రమ నిర్మాణం ప్రారంభించాడు. స్థానిక ముస్లిములు దాన్ని వ్యతిరేకించారు.
డేగ్లూర్, మహారాష్ట్ర (2021 అక్టోబర్): జియావుద్దీన్ రఫాయి దర్గాకు చెందిన భూమిని స్థానిక ల్యాండ్ మాఫియాల సహకారంతో ఒక కాంగ్రెస్ నాయకుడు అక్రమంగా ఆక్రమించాడు. ఆ విషయాన్ని బైటపెట్టిన సామాజిక కార్యకర్త షేక్ సైలానీని చంపేస్తామని బెదిరించారు.
పుణే, మహారాష్ట్ర (2022 జూన్): నగరంలోని కోంఢ్వా ప్రాంతంలో 45ఎకరాల వక్ఫ్ ఆస్తిని ఒక బిల్డర్‌కు అక్రమంగా అమ్మేసారు. ఆ విషయంలో జోక్యం చేసుకోడానికి ప్రయత్నించిన సల్మాన్ కాజీ, షోయబ్ కాజీలను చంపేస్తామని బెదిరించారు.
శంభాజీనగర్, మహారాష్ట్ర (2023 ఆగస్ట్): జిల్లాలోని బన్‌గావ్ గ్రామంలో ఆరు ఎకరాల వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. విషయాన్ని గుర్తించిన అధికారులు వాటిని కూలగొట్టారు.
బీడ్, మహారాష్ట్ర (2024 ఆగస్ట్): సంగీన్ మసీదుకు 276 ఎకరాల భూమి ఉంది. అందులో కొంతభాగాన్ని వక్ఫ్ బోర్డు సభ్యుడు సమీర్ కాజీ చట్టవిరుద్ధంగా విక్రయించేసాడు. ఆ విషయమై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
మొరాదాబాద్, ఉత్తరప్రదేశ్ (2018 అక్టోబర్): వక్ఫ్ బోర్డుకు చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములను మాజీ ఐఏఎస్ అధికారి జుహేర్ బిన్ షాగీర్ తన సహాయకుల పేరు మీదకు బదలాయించేసాడు.
పట్నా, బిహార్ (2020 జులై): అల్తాఫ్ నవాబ్ వక్ఫ్ ఎస్టేట్‌కు సంబంధించిన ఆస్తులను కమ్రాన్ అలీ, అతని సహచరులు చట్టవిరుద్ధంగా విక్రయించారు. ఆ లావాదేవీల్లో కోట్లాది రూపాయలు కొట్టేసారు.
(సశేషం)