ఆంధ్రా-తెలంగాణ విభజన చట్టంలో ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉండిపోయిన అంశాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని హోంశాఖను ఆదేశించింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రింగు రోడ్డు నిర్మాణానికి ప్రక్రియ త్వరలో మొదలు కానుంది. మరోవైపు తెలంగాణలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అనుమతులు సాధించే ప్రక్రియ మొదలయింది.
ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవిందమోహన్ 15శాఖల అధికారులతో సుదీర్ఘమైన సమావేశం నిర్వహించారు. రహదారులు, ఉపరితల రవాణా, ఉక్కు, బొగ్గు, గనులు, వ్యవసాయం, పెట్రోలియం, రైల్వే తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. దాని మినిట్స్‌ను తాజాగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు.
ఆ సమీక్షలో భాగంగా అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ప్రాజెక్టు సమగ్ర నివేదికను రూపొందించాలంటూ కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖను ఆదేశించింది. అలాగే, తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాలని, రెండేళ్ళలో అక్కణ్ణుంచి కార్యకలాపాలు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలనీ రైల్వే శాఖను ఆదేశించింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు, హైదరాబాద్ కారిడార్ల ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనల విషయంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వవలసిన నిధులు పెండింగ్ ఉన్నాయనీ, వాటి విడుదలకు చర్యలు తీసుకోవాలనీ సంబంధిత అధికారులను ఆదేశించింది. తెలంగాణకు అవే నిధుల విషయంలో నీతి ఆయోగ్‌తో చర్చలు జరపాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మరో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్దికాలం క్రితం కేంద్రాన్ని కోరింది. ఆ విషయం కూడా సమీక్షలో చర్చకు వచ్చింది. అలా ఏపీలో మరో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందేమో చూడాలంటూ కేంద్ర హోంశాఖ పెట్రోలియం శాఖకు సూచించింది.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత