ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు మరోసారి రోడ్డుకెక్కాయి. మంచు మనోజ్ తన కారు పోయిందంటూ మంగళవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడుతూ తన కారు పోయేలా చేసింది సోదరుడు విష్ణుయే అంటూ ఆరోపణలు చేసారు.
‘‘ఏప్రిల్ 1న మా పాప పుట్టిన రోజు సందర్భంగా జయపుర వెళ్ళాను. ఆ సమయంలో నా సోదరుడు విష్ణు జల్పల్లిలోని ఇంట్లో 150మందితో ప్రవేశించాడు. వాళ్ళు మా వస్తువులు, సామగ్రి ధ్వంసం చేసారు. మా కార్లను టోయింగ్ వెహికిల్తో ఎత్తుకెళ్ళి రోడ్డు మీద వదిలేసారు. నా కారును దొంగతనంగా తీసుకువెళ్ళి విష్ణు ఇంట్లో పార్క్ చేసారు. నా భద్రతా సిబ్బంది మీద దాడి చేసారు. కారు విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాం. వారు ఆ కారు విష్ణు ఇంట్లో ఉందని గుర్తించారు. రికవరీ కోసం వెళ్ళినప్పుడు దాన్ని మాదాపూర్ పంపించారు’’ అని మనోజ్ వివరించారు.
మనోజ్ ఈ ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే భద్రతా సిబ్బంది గేటు తెరవలేదు. దాంతో మనోజ్ ఇంటి ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ పెద్దసంఖ్యలో మోహరించారు. మోహన్‌బాబు ఇంటి దగ్గర ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు. కొద్దిసేపటి తర్వాత మనోజ్ మీడియాతో మాట్లాడారు.
మనోజ్, తమది ఆస్తి గొడవ కాదని, తనను విష్ణు నియంత్రణలో ఉంచడానికి జరుగుతున్న ప్రయత్నమనీ చెప్పారు. ఈ ఆస్తి తనకు వద్దని తండ్రికి ఎప్పుడో చెప్పేసానని మనోజ్ తెలియజేసారు. విద్యార్ధుల భవిష్యత్తు కోసమే ఈ ఘర్షణ అంతా జరుగుతోందన్నారు. డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా పోలీసులు ఒక్క ఛార్జిషీట్ అయినా దాఖలు చేయలేదన్నారు.
తనపై దాడులు చేయడానికి జరిగిన ప్రయత్నాల గురించి పోలీసులకు సాక్ష్యాధారాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. జల్పల్లి ఇంట్లో తన పెంపుడు జంతువులు, ఇతర వస్తువులు ఉన్నాయనీ, వాటికోసమే వచ్చాననీ చెప్పారు. కుటుంబం కోసం ఎంతో చేసానని, బైటి సినిమాల్లో హిట్లు వచ్చిన ప్రతీసారీ సొంత నిర్మాణ సంస్థలోనూ సినిమా చేయాల్సిందనేవారని చెప్పుకొచ్చారు. తన ‘భైరవం’ సినిమాను విడుదల చేస్తారనే భయంతోనే విష్ణు కన్నప్ప సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడని మనోజ్ వ్యాఖ్యానించారు.
తన సమస్యను పరిష్కరించాలంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసారు. విష్ణు తనతో కూర్చుని మాట్లాడితే సమస్యలు పరిష్కారమైపోతాయని మనోజ్ వ్యాఖ్యానించారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత