కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మళ్లీ సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది.దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి దిగొచ్చింది. ఏప్రిల్ 7 నుంచి జరుగుతున్న ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కీలక వడ్డీరేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వడ్డీరేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. దీంతో ఈఎంఐ చెల్లింపులో తగ్గుదల ఉండే అవకాశముంది.
స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి మారాలని కమిటీ నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అసాధారణ అనిశ్చితిలో ఉండటంతో విధానాల రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయని మల్హోత్రా అన్నారు. గతంలో చెప్పినట్లుగానే దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. ప్రధాన వృద్ధికి మద్దతు ఇచ్చే ద్రవ్య విధానాన్ని పాటిస్తున్నామన్నారు.
ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం కనిపించేందుకు సమయం పడుతుంది. ఎంసీఎల్ఆర్ అనేది హోమ్ లోన్,పర్సనల్ లోన్, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్మార్క్ వడ్డీ రేటు. రెపో రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్ఆర్లో పూర్తిగా ప్రతిబింబించేందుకు కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత