వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయమై ఏపీ రాజకీయాల్లో మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లి లో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ భద్రతా చర్యల్లోని డొల్లతనం బయటపడింది. అయితే ఈ పరిణామం అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఏర్పడిందా…? అధినేత మెప్పు కోసం ముఖ్యనేతల చేసిన బల ప్రదర్శనా..? లేదా రాజకీయ ప్రత్యర్థి భద్రతా విషయంలో పాలకపార్టీ ఉదాసీనంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తుందా అనే చర్చ ఆంధ్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. రాజకీయాల పేరిట ఓ మాజీ సీఎంను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదనే వాదనలు కూడా ఉన్నాయి.
రామగిరి పర్యటనకు వైఎస్ జగన్ ఆకాశమార్గంలో హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్దకు జనం ఎక్కువగా చేరుకున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా పోలీసులను మోహరించలేదు. దీంతో వైసీపీ కార్యకర్తలంతా ఒక్కసారిగా హెలీకాప్టర్ దగ్గరకు తోసుకువచ్చారు. జనం తాకిడితో హెలీకాప్టర్ కు సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో తిరుగు ప్రయాణంలో జగన్ రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు చేరుకోవాల్సి వచ్చింది.
జగన్ పర్యటనపై పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నా కనీస భద్రతా చర్యలు కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జగన్, పల్నాడు పర్యటన సందర్భంగా కూడా కూటమి ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించిందంటున్నారు. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ నాయకులు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాలతో పాటు రామగిరి సరిహద్దులోని కర్ణాటక గ్రామాల నుంచి జనాలను తరలించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. విధి నిర్వహణలోని పోలీసుల ఆదేశాలను వైసీపీ కార్యకర్తలు బేఖాతరు చేశారని విమర్శిస్తున్నారు. అధినేత మెప్పు కోసం జనసమీకరణలో వైసీపీ నేతలు పోటీ పడ్డారని చెబుతున్నారు. మద్యం, డబ్బులు పంపిణీ చేసి జనాలను వాహనాల్లో ఎక్కించారని ఆరోపిస్తున్నారు. గుంతకల్లుకు చెందిన నాయకులు జనాలకు డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మాజీ సీఎం జగన్ రామగిరి పర్యటనలో తమ వైపు నుంచి ఎక్కడా భద్రతా వైఫల్యం లేదని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. జడ్‌ప్లస్ కేటగిరికి అనుగుణంగానే భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఇద్దరు ఎస్పీల పర్యవేక్షణలో 1,100 మంది సిబ్బందిని బందోబస్తు కోసం కేటాయించామన్నారు. హెలిప్యాడ్ వద్ద సుమారు 150 మంది పోలీసులతో తొలుత భద్రత ఏర్పాటు చేశామని, జనం ఎక్కువగా రావడంతో అదనంగా మరో 100 మందిని మోహరించామని వివరించారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత