దేశ రాజకీయాలను కుదిపేసిన బెంగాల్ ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో సీఎం మమతా బెనర్జీకి స్వల్ప ఊరట లభించింది. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదనపు పోస్టుల నిర్ణయంపై బెంగాల్ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
నిపుణులతో చర్చలు జరిపిన తరవాత, అదనపు పోస్టులపై నిర్ణయం తీసుకున్నారు. అలాంటప్పుడు ఇందులో న్యాయపరమైన జోక్యం అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల నియామకాల్లో ఇతర అవకతవకలపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 9 నుంచి 12వ తరగతి వరకు ఉపాధ్యాయులతోపాటు, గ్రూప్ సి, డి సిబ్బంది నియామకాలను మమతా సర్కార్ 2016లో చేపట్టింది. ఇందుకు రాష్ట్ర స్థాయి సెలక్షన్ ద్వారా నియామకాలు చేసింది. 24650 ఉద్యోగాలు భర్తీ చేశారు. 23 లక్ష మంది హాజరయ్యారు.
ఎంపిక ప్రక్రియ తరవాత 25753 మందికి నియామక పత్రాలు అందించారు. ఖాళీల కన్నా ఎక్కువ నియామకాల పత్రాలు ఇవ్వడంపై వివాదం రాజుకుంది. అక్రమాలకు పాల్పడేందుకే అదనపు నియామకాలు చేపట్టారనే ఆరోపణలు చుట్టుముట్టాయి.
దీనిపై కలకత్తా హైకోర్టులో కేసులు నమోదయ్యాయి. విచారించిన హైకోర్టు నియామక ప్రక్రియ చెల్లదని తీర్పు చెప్పింది. అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ దర్యాప్తుపై స్టే విధించింది. అదనపు ఉద్యోగాల భర్తీపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 25753 ఉపాధ్యాయ నియామకాలు చెల్లవని గత వారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత